సొంతంగా ఖాళీల భర్తీ అధికారం కోల్పోయిన ఆర్టీసీ
టీజీపీఎస్సీ, వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డులకు అప్పగింత
ఇటీవలే 3,035 ఖాళీల భర్తీకి అనుమతించిన ప్రభుత్వం
కానీ, ఎప్పుడు భర్తీ చేస్తాయో స్పష్టతనివ్వని ఆయా సంస్థలు
జాబ్ కేలండర్ ఆధారంగా నోటిఫికేషన్లు జారీ చేస్తామని వెల్లడి
1200మంది డ్రైవర్ల కొరత.. ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో ఖాళీల భర్తీ వ్యవహారం మూడు ముక్కలాటగా మారింది. సంస్థలో 3035 పోస్టుల భర్తీకి ఇటీవలే ప్రభుత్వం అనుమతించింది. అయితే ఇప్పటి వరకు ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థనే సొంతంగా నియామకాలు చేపడుతూ వస్తోంది. కానీ, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ అధికారానికి కోత పెడుతూ.. సొంతంగా భర్తీ చేసుకునే వీలు లేకుండా నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ బాధ్యత చూస్తున్న టీఎస్‌పీఎస్‌సీకి ఆ బాధ్యత అప్పగించింది. డ్రైవర్‌లాంటి పోస్టుల భర్తీ బాధ్యత తమకు వద్దంటూ ఆ సంస్థ పేర్కొనటంతో పోలీసు రిక్రూట్‌బోర్డుకు అటాచ్ చేసింది. డ్రైవర్లు, శ్రామిక్‌లు, సూపర్‌వైజర్లు లాంటి పోస్టుల నియామక బాధ్యతను దానికి అప్పగించారు.
వైద్య ఆరోగ్య సిబ్బంది నియామకాల బాధ్యతను వైద్య ఆరోగ్యశాఖ నియామక విభాగానికి అప్పగించారు. దీంతో ఈ మూడు సంస్థలు ఆర్టీసీలో ఖాళీల భర్తీని చూడనున్నాయి. ఫలితంగా పోస్టులు ఎప్పుడు భర్తీ అవుతాయో ఆర్టీసీకే తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
జాబ్ కేలండర్ ఆధారంగానే...
ఒకే అభ్యర్థి ఏక కాలంలో రెండుమూడు ఉద్యోగాల కోసం యత్నించటం సహజం. దీంతో అర్హత ఉన్న అన్ని ప్రవేశ పరీక్షలు రాస్తుంటారు. ఆయా పరీక్షలన్నింటికీ వారు హాజరు కావాలంటే వాటి నిర్వహణ తేదీలు వేరువేరుగా ఉండాల్సి ఉంటుంది. ఒకేరోజు రెండు పరీక్షలుంటే, ఏదో ఒక పరీక్షను మిస్ చేసుకోవాల్సిందే. దీంతో ఆయా సంస్థలు సమన్వయం చేసుకుని వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తాయి.
జాబ్ క్యాలెండర్ ఆధారంగా ఇది సాగుతుంది. ఇప్పుడు ఇదే ఆర్టీసీకి ఇబ్బందిగా మారింది. ఆర్టీసీకేమో ఖాళీల భర్తీ అత్యవసరం. కానీ, భర్తీ ప్రక్రియ చూసే మూడు సంస్థలు ప్రత్యేకంగా ఆర్టీసీ కోసం ఏర్పాట్లు చేసేందుకు ససేమిరా అంటున్నాయి. ఇతర శాఖల్లోని ఖాళీల భర్తీకి సంబంధించి పరీక్షల నిర్వహణకు రూపొందించే షెడ్యూల్ ఆధారంగానే ప్రక్రియ ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి.
రాష్ట్రం వ చ్చిన తర్వాత కొత్త నియామకాల్లేవ్
ఉమ్మడి రాష్ట్రంలో 2012లో చివరి సారిగా ఆర్టీసీలో ఖాళీల భర్తీ జరిగింది. తెలంగాణ రాష్ర్‌్టరం ఏర్పడ్డ తర్వాత కొత్త నియామకాలు చేపట్టలేదు. ప్రతినెలా పదవీ విరమణలు కొనసాగుతుండటంతో క్రమంగా సిబ్బంది సంఖ్య తగ్గిపోతూ బస్సుల నిర్వహణ పెద్ద సమస్యగా మారింది. ఓ దశలో మూడు వేలకుపైగా డ్రైవర్ పోస్టులు ఖాళీ అయ్యాయి. 2
019లో ప్రభుత్వం ఆదేశించిందంటూ ఏకంగా 2 వేల బస్సులను ఆర్టీసీ తగ్గించుకుంది. అలా కొంత సమస్యను అధిగమించింది. ఆ తర్వాత మళ్లీ కొత్త బస్సులు అవసరమంటూ అద్దె బస్సుల సంఖ్యను ఒక్కసారిగా పెంచింది. అద్దె బస్సుల్లో వాటి యజమానులే డ్రైవర్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పద్ధతులతో ఎలాగోలా నెట్టుకొస్తూ వస్తోంది. మొత్తంగా చూస్తే ప్రస్తుతం 1200 డ్రైవర్ల కొరత ఉంది.
ఫలితంగా ఉన్న డ్రైవర్లకు డబుల్ డ్యూటీలు వేస్తున్నారు. ఇది డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. నిద్ర కూడా చాలని స్థితిలో వారు డ్రైవింగ్ విధుల్లో ఉంటున్నారు. ఇది బస్సు ప్రమాదాలు జరిగేందుకు ఆస్కారమిస్తోందని కారి్మక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కనీసం డ్రైవర్ పోస్టులు భర్తీ చేయాలంటూ..
డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందనీ వెంటనే ఖాళీల భర్తీని చేపట్టాలంటూ తాజాగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ఆర్టీసీ అభ్యరి్థంచింది. పలుదఫాలు కోరిన మీదట ఆగస్టులో చూద్దామని ఆ బోర్డు పేర్కొన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment