ఆక్యుపెన్సీ రేషియో 109 శాతం
సోమవారం అరుదైన రికార్డు నమోదు చేసిన ఆర్టీసీ
సాక్షి, హైదరాబాద్ : ఒకే రోజు బస్సుల్లో 65 లక్షల మందిని గమ్యం చేర్చి ఆర్టీసీ మరో రికార్డు సృష్టించింది. సోమవారం రోజున ఈ ఘనత చోటు చేసుకుంది. సాధారణ రోజులతో పోలిస్తే సోమవారాల్లో ఎక్కువ మంది ప్రయాణిస్తుంటారు. ఈ పదో తేదీ సోమవారం రోజున ఆ రద్దీ మరింత ఎక్కువగా నమోదైంది. ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడూ రికార్డు కాని రీతిలో ఏకంగా 109.8 శాతం ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. బస్సులన్నీ కిక్కిరిసి ప్రయాణించటంతో ఆర్టీ సీకి 24 గంటల్లో ఏకంగా రూ.24.06 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో జీరో టికెట్ల వాటా కూడా ఉంది.
ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో మహిళలు కొనుగోలు చేసిన జీరో టికెట్ల మొత్తాన్ని ప్రభుత్వం ఆర్టీ సీకి రీయింబర్స్ చేయాల్సి ఉంది. వాటితో కలుపుకొని ఈ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఒకే రోజు ఆర్టీసీ పొందినట్టయింది. ప్రభుత్వం రీయింబర్స్ చేస్తేనే..ఆర్టీసీ ఎక్స్‌ప్రెస్, ఆర్డినరీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించిన తర్వాత బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. సోమవారాల్లో ఆ రద్దీ మరీ ఎక్కువగా ఉంటోంది. దీంతో గత కొన్ని నెలలుగా సోమవారాల్లో ఆర్టీసీ అధిక ఆదాయాన్ని సాధిస్తోంది.
జీరో టికెట్ల రూపంలో రికార్డుస్థాయిలో ఆదాయం నమోదవుతున్నా, ఆర్టీ సీకి మాత్రం అదే రోజు ఆ ఆదాయం రావడం లేదు. ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా, ప్రతినెలా ఆ మొత్తాన్ని ఆర్టీసీకి చెల్లిస్తేనే దాన్ని ఆదాయంగా పరిగణించాల్సి వస్తుంది. కానీ, పాత బకాయిలతోపాటు, ఈ ఆదాయం మొత్తంగా ఇప్పటి వరకు ఆర్టీ సీకి అందలేదని తెలుస్తోంది. గతేడాది బడ్జెట్‌కు సంబంధించిన బకాయిలతో కలుపుకుంటే ఆర్టీ సీకి ప్రభుత్వం రూ.2200 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది.
కానీ, ఇప్పటి వరకు అంతమొత్తం విడుదల కాలేదు. ఇక 2015 వేతన సవరణకు సంబంధించి బాండ్ల డబ్బులు కూడా పూర్తిస్థాయిలో అందలేదు. ఆ మొత్తానికి సంబంధించిన నిధులు ఆర్టీ సీకి విడుదల చేస్తున్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడించినా, కేవలం డ్రైవర్లకు మాత్రమే ఆ నిధులందాయి. మిగతావారు ఎదురుచూస్తున్నారు. దీనికి కూడా నిధులు లేకపోవటమే కారణంగా కనిపిస్తోంది. ఇప్పుడు కాగితాలపై రికార్డు స్థాయి ఆదాయం నమోదైనా.. ప్రభుత్వం రీయింబర్స్ చేసినప్పుడే అది నిజం ఆదాయంగా ఆర్టీసీ పరిగణించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment