సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న డిగ్రీ, పీజీ వృత్తి విద్యా కోర్సుల్లో తరగతి గదిలో 50 శాతం విద్యార్థులను మాత్రమే అనుమతించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు తన కార్యాలయంలో ఉన్నత విద్య శాఖాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతీ కళాశాల తరగతుల వారిగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్ మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలను తరుచూ తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు.
(చదవండి: టీఆర్‌టీ కంటే ముందే టెట్ )
ప్రతినిత్యం శానిటైజేషన్ ప్రక్రియను చేపట్టేందుకు వీలుగా ప్రతీ యూనివర్సిటీకి 20 లక్షల రూపాయలను తక్షణ సాయంగా అందించాలని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డిని ఆదేశించారు. కళాశాలలు పూర్తి సురక్షితం అన్న భావనను కల్పించాలని మంత్రి సూచించారు. కళాశాలల్లో విద్యార్థులు గుమికూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. విద్యార్థులు భౌతిక దూరం పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత యాజామాన్యాలదేనని మంత్రి పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిర్గల్, విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, కార్యదర్శి శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment