శ్రీశైలం ప్రాజెక్టు పది గేట్లు ఎత్తడంతో సాగర్ వైపు పరుగులు తీస్తున్న కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణా వరద ప్రవాహం ఉద్ధృతమవడంతో శ్రీశైలం ప్రాజెక్టు స్పిల్ వేకు ఉన్న 12 గేట్లకుగానూ.. పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2.90 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమ కేంద్రాల్లో 1,670 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తూ 75 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటలకు నాగార్జునసాగర్‌లోకి 1.69 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండటంతో నీటి నిల్వ 271.38 టీఎంసీలకు చేరింది. మరో 41 టీఎంసీలు చేరితే సాగర్ నిండుతుంది. శ్రీశైలం నుంచి దిగువకు 3.65 లక్షల క్యూసెక్కులు వస్తున్న నేపథ్యంలో సాగర్ శుక్రవారం నిండనుంది. నిండితే శుక్రవారం సాగర్ గేట్లను ఎత్తనున్నారు.
ఊ సాగర్ విద్యుత్ కేంద్రాల ద్వారా విడుదల చేస్తున్న జలాలకు మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 34 వేల క్యూసెక్కులు చేరుతున్నాయి. దీంతో నీటి నిల్వ 17.70 టీఎంసీలకు చేరింది. పులిచింతల నిండాలంటే 28 టీఎంసీలు అవసరం. శనివారానికి పులిచింతల ప్రాజెక్టు నిండనుంది. శనివారం సాయంత్రంగానీ.. ఆదివారం ఉదయంగానీ పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశముంది. ఊ పులిచింతలకు దిగువ ప్రాంతంలో వర్షాలు తగ్గడంతో కృష్ణా వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి 37,488 క్యూసెక్కులు చేరుతుండగా.. డెల్టాకు విడుదల చేయ గా మిగులుగా ఉన్న 34,828 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.
► ఈ సీజన్‌లో గురువారం ఉదయం 6 గంటల వరకూ 48.62 టీఎంసీల కృష్ణా జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి.
► భారీ వర్షాల వల్ల తుంగభద్ర పరవళ్లు తొక్కుతోంది. తుంగభద్ర డ్యామ్ నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో సుంకేశుల బ్యారేజీలోకి 1,12,334 క్యూసెక్కులు చేరుతోంది. గురువారం మధ్యాహ్నం అంతే స్థాయిలో దిగువకు విడుదల చేయడంతో కర్నూల్ నగరానికి ఒకటో ప్రమాద హెచ్చరికను సీడబ్ల్యూసీ(కేంద్ర జలసంఘం) జారీ చేసింది.
► ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి వి డుదల చేసిన జలాలకు తుంగభద్ర జలాలతో వడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.17 లక్షల క్యూ సెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నీటి నిల్వ 208.72 టీఎంసీలకు చేరడంతో వచ్చిన వరద ను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ వరద ప్రవాహం కనీసం 8 రోజులు కొనసాగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ వెల్లడించింది.
గోదారి ఉగ్రరూపం
గోదారమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల గోదావరి ఉరకలెత్తుతుండటంతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తి 85 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. మహారాష్ట్రలో గురువారం భారీ వర్షాలు కురవడంతో ప్రాణహిత మళ్లీ ఉప్పొంగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన లక్ష్మీ బ్యారేజీ గేట్లు ఎత్తి.. 5.35 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి ఇంద్రావతి, శబరి వరద తోడైంది.
► ఖమ్మం జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల తాలిపేరు, కిన్నెరసాని ఉప్పొంగుతున్నాయి. తాలిపేరు ప్రాజెక్టు నుంచి 1.69 లక్షల క్యూసెక్కులు.. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి 1.02 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వాటికి కొండవాగుల వరద తోడవడంతో.. భద్రాచలం వద్ద వరద నీటిమట్టం గంటగంటకూ పెరుగుతోంది.
► మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 30,491 క్యూసె క్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 68.43 టీఎంసీలకు చేరుకుంది. మరో 22 టీఎంసీలు చేరితే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment