డేంజర్‌ లోడ్స్‌! | Sand lorries In Hyderabad roads | Sakshi
Sakshi News home page

డేంజర్‌ లోడ్స్‌!

Published Tue, Feb 13 2024 10:17 AM | Last Updated on Tue, Feb 13 2024 10:17 AM

Sand lorries In Hyderabad roads - Sakshi

సాక్షి, హైదరాబాద్: ఇసుక అక్రమ రవాణ రహదారి భద్రతకు సవాల్‌గా మారింది. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఇసుకలారీలు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి. ఓవర్‌లోడ్‌తో వచ్చే లారీల వల్ల రహదారులు సైతం ధ్వంసమవుతున్నాయి. ప్రతి రోజు సుమారు 5 వేల లారీలు వివిధ జిల్లాల నుంచి నగరానికి భారీ ఎత్తున ఇసుకను తరలిస్తున్నాయి. ఈ  క్రమంలో మోటారు వాహన నిబంధనలకు బేఖాతరు చేస్తూ  యధేచ్చగా  పరిమితికి మించిన బరువుతో  రోడ్లపైకి వస్తున్నట్లు రవాణాశాఖ గుర్తించింది.కృష్ణా,గోదావరి, తదితర పరీవాహక ప్రాంతాల నుంచి ఇసుకను తరలించే క్రమంలోనే కచి్చతమైన పరిమితిని విధించే అవకాశం ఉన్నప్పటికీ చాలా వరకు తూకం వేయకుండానే రోడ్డెక్కుతున్నాయి. కొన్ని లారీల్లో 25 టన్నుల వరకే అనుమతి ఉండగా అందుకు విరుద్దంగా 35 టన్నుల వరకు తరలిస్తున్నారు. 35 టన్నుల ఇసుక రవాణాకు అవకాశం ఉన్న 16 టైర్ల లారీల్లో ఏకంగా 45 టన్నులకు పైగా ఇసుకను తరలిస్తున్నట్లు అంచనా.  

ఓవర్‌లోడ్‌..చీకట్లో స్పీడ్‌ 
ఇలా ఓవర్‌లోడ్‌తో  వచ్చే భారీ వాహనాల వల్ల తరచుగా ఎక్కడో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా  నగర శివారు ప్రాంతాల్లో ఇసుక లారీలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నట్లు రవాణా  అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారు జామున సిటీకి వచ్చే క్రమంలో ఓవర్‌లోడ్‌ లారీలను  డ్రైవర్‌లు అదుపు చేయలేకపోతున్నారు. వేగాన్ని నియంత్రించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో  ఎక్కడో ఒకచోట  ప్రమాదాలు జరుగుతున్నాయి.ఇక ఓవర్‌లోడ్‌ వచ్చే వాహనాలను కట్టడి చేసేందుకు  గ్రేటర్‌ పరిధిలో స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టినట్లు హైదరాబాద్‌ జేటీసీ రమేష్‌ తెలిపారు.
  
తూకంలోనే మోసం... 
హైదరాబాద్‌లో భవననిర్మాణ రంగానికి  ప్రతి రోజు  వేల టన్నుల ఇసుకను వినియోగిస్తున్నారు.నదీతీరాల్లో లభించే  సన్న ఇసుకకు  నగరంలో  ఎంతో డిమాండ్‌ ఉంది.దీంతో కృష్ణా,గోదావరి పరీవాహాక ప్రాంతాలైన  పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, తదితర  ప్రాంతాల నుంచి నగరానికి పెద్ద మొత్తంలో  ఇసుక తరలివస్తుంది.అలాగే  విజయవాడ నుంచి కూడా  గుట్టుచప్పుడు కాకుండా ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం. ఇసుకను లారీల్లో నింపిన తరువాత క్వారీల్లోనే  తూకం వేయవలసి ఉంటుంది.

కానీ  చాలా వరకు క్వారీల్లో కాంటాలు  అందుబాటులో లేకపోవడం వల్ల  పెద్దమొత్తంలో ఇసుకను నింపేస్తున్నారు. నిర్ధేశించిన బరువుపైన  5 శాతం వరకు అదనంగా  తెచ్చేందుకు ఆర్టీఏ అనుమతిస్తుంది.ఉదాహరణకు  25టన్నులకు  అవకాశం ఉన్న  లారీల్లో మరో ఒకటిన్నర టన్ను  అదనంగా తెచ్చేందుకు అవకాశం ఉంటుంది. కానీ కొందరు వాహన యజమానులు ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకటిన్నర టన్నుకు బదులు 10 టన్నులకు పైగా అదనంగా నింపేసి తరలిస్తున్నారు. క్వారీలు దాటిన 20  కిలోమీటర్ల దూరంలో కాంటాలు ఉంటాయి.

 కానీ ఇక్కడి వరకు వచి్చన లారీల్లో ఓవర్‌లోడ్‌ను  తొలగించకుండా  ఏదో ఒకవిధంగా కాంటాల నిర్వాహకులతో కుమ్మౖMð్క తప్పుడు తూకం లెక్కలతో రోడ్లపైకి వస్తున్నారు. ఇలా ఓవర్‌లోడ్‌తో వచ్చే వాహనాలను చెక్‌పోస్టుల వద్ద నిలిపేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ కొందరు మోటారు వాహన ఇన్‌స్పెక్టర్‌లు ఇసుక వ్యాపారాల నుంచి ప్రతి లారీకి కొంత మొత్తంగా వసూలు చేసుకొని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ‘ఆరీ్టఏ అధికారులు బడా వ్యాపారులను వదిలేసి  నిబంధనల మేరకు ఇసుకను తెచ్చే చిన్న వ్యాపారులు, లారీ డ్రైవర్లపైన మాత్రం తమ ప్రతాపాన్ని చూపుతున్నారని’ పలువురు వాహనయజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఆర్టీఏ స్పెషల్‌ డ్రైవ్‌.. 
వివిధ దశల్లో ఏదో ఒక విధంగా తనిఖీలను తప్పించుకొని నగరానికి చేరుకొనే ఓవర్‌లోడ్‌ ఇసుక లారీలపైన  ఆర్టీఏ  ప్రస్తుత  స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. పరిమితికి మించిన బరువుతో నగరానికి  వచ్చే లారీలపైన  తనిఖీలను ప్రారంభించారు.సోమవారం ఒక్క రోజే  19 వాహనాలపైన కేసులు నమోదు చేసి జరిమానా విధించినట్లు జేటీసీ రమేష్‌  తెలిపారు.ఓవర్‌లోడ్‌ వాహనాలపైన తనిఖీలను కొనసాగించనున్నట్లు పేర్కొన్నారు.క్వారీల్లోంచి ఇసుకను నింపే సమయంలోనే  మోటారు వాహన నిబంధనలకనుగుణంగా నింపాల్సి ఉంటుందన్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement