సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్న నగరవాసులకు ప్రత్యేక రైళ్లు తీవ్ర నిరాశకు గురిచేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించే అన్ని ప్రధాన రైళ్లలో వెయిటింగ్ లిస్టు భారీగా నమోదవుతోంది. వచ్చే జనవరి నెలాఖరు వరకు అన్నింటిలోనూ రిజర్వేషన్‌లు భర్తీ అయ్యాయి. కొత్తగా మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపితే తప్ప నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లడం సాధ్యం కాదు. కోవిడ్ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించే సుమారు 80 రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను, మరో 120కు పైగా ప్యాసింజర్ రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసిన సంగతి తెలిసిందే. వాటి స్థానంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దశల వారీగా పరిమితంగా ప్రత్యేక రైళ్లను మాత్రమే నడుపుతున్నారు.
డిమాండ్ పెరిగినా రైళ్లు పరిమితమే..
- సికింద్రాబాద్–న్యూఢిల్లీ, బెంగళూర్–న్యూఢిల్లీ మధ్య కేవలం రెండు సర్వీసులతో కోవిడ్ అన్‌లాక్ నిబంధనల మేరకు రైళ్లను పునరుద్ధరించారు. ఆ తరువాత జూన్ నాటికి విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతి, బెంగళూరు, ముంబయి, దానాపూర్, తదితర ప్రాంతాలకు 22 జతల రైళ్లను పునరుద్ధరించారు.
- రెగ్యులర్ రైళ్లను పునరుద్ధరించకుండా దశలవారీగా ప్రత్యేక రైళ్లనే అన్ని రూట్లలో నడుపుతున్నారు.
- సాధారణంగా హైదరాబాద్ నుంచి ప్రతి రోజు సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తారు. రోజుకు 200లకు పైగా రైళ్లు ఈ మూడు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి.
- అన్‌లాక్ 4.0, అన్‌లాక్ 5.0 తరువాత ప్రయాణికుల రద్దీ పెరిగింది. సుమారు 1.6 లక్షల మంది ప్రయాణికులు ప్రతి రోజు ప్రయాణం కోసం ఎదురు చూస్తుండగా 76 రైళ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. దీంతో అన్నింటిలోనూ వెయిటింగ్ లిస్టు భారీగా నమోదవుతోంది. (చదవండి: డీలక్స్ బస్సుకు సెలవు!)
అరకొరగా పండుగ రైళ్లు...
- ప్రతి సంవత్సరం సంక్రాంతి రద్దీ మేరకు దక్షిణమధ్య రైల్వే వందల కొద్దీ ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. కానీ ఈ సారి క్రిస్‌మస్, సంక్రాంతి, శబరి ప్రయాణాలను దృష్టిలో ఉంచుకొని 64 రైళ్లను మాత్రమే పెంచారు. కోవిడ్ ఆంక్షల నెపంతో రైళ్లను తగ్గించడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
- సికింద్రాబాద్ నుంచి విశాఖకు వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్ (02728)లో జనవరి 10, 11, 12 తేదీల్లో వరుసగా 300, 340, 399 చొప్పున వెయిటింగ్ లిస్టు ఉంది.
- సికింద్రాబాద్ మీదుగా ముంబయి నుంచి భువనేశ్వర్‌కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ (01019,), సికింద్రాబాద్–ఫలక్‌నుమా (02724) రైళ్లలో ఈ మూడు రోజుల పాటు వెయిటింగ్ లిస్టులో బుకింగ్‌కు కూడా అవకాశం లేకుండా ‘నో రూమ్’ దర్శనమిస్తోంది.
- సికింద్రాబాద్–విశాఖ (07016)ఎక్స్‌ప్రెస్‌లో జనవరి 10 నుంచి 12 వరకు వరుసగా 189, 208, 235 చొప్పున వెయిటింగ్ లిస్టు నమోదైంది.
- సికింద్రాబాద్–మచిలీపట్నం (02750) ఎక్స్‌ప్రెస్‌లో 10వ తేదీన 84, 11న 92, 12వ తేదీన 110 చొప్పున ఉంది.
- రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (02794)లోనూ వెయిటింగ్‌లిస్టు 97 పైనే ఉంది.
నిబంధనల మేరకే ప్రత్యేక రైళ్లు
కోవిడ్ మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని రైళ్ల నిర్వహణ కొనసాగుతోంది. రైల్వేబోర్డు మార్గదర్శకాలకు అనుగుణంగా నడుపుతున్నాం. ఈ ఏడాది సంక్రాంతికి అంతగా డిమాండ్ ఉండకపోవచ్చునని భావిస్తున్నాం.
– సీహెచ్ రాకేష్, సీపీఆర్వో, దక్షిణమధ్య రైల్వే
Comments
Please login to add a commentAdd a comment