పలు జిల్లాల్లో పాఠశాలలను ముంచెత్తిన వరద
తడిసి ముద్దయిన రికార్డులు.. కొన్నిచోట్ల నీటిపాలు
మరో వారం దాకా కుదుటపడటం కష్టమే
వరద ప్రాంతాల్లో స్కూళ్లకు నేడూ సెలవు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ వర్షాలు ప్రభుత్వ విద్యాసంస్థలను ముంచెత్తాయి. పలు జిల్లాల్లోని పాఠశాలల్లో బురద మేటలు వేసింది. కొన్నిచోట్ల విద్యార్థులు, ఉపాధ్యాయుల రికార్డులు తడిసి ముద్దవగా ఇంకొన్ని చోట్ల వరదలో రికార్డులు కొట్టుకుపోయాయి. ఖమ్మం పట్టణంలోని దాదాపు అన్ని స్కూళ్లకు వరద తీవ్రత ఎక్కువగా ఉంది. వర్షం తీవ్రత తగ్గినా వారంపాటు సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంగళవారం కూడా సెలవు ప్రకటించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు డీఈవోలను ఆదేశించారు.
అన్ని చోట్లా అదే పరిస్థితి
⇒ ఖమ్మం నయాబజార్ ప్రభుత్వ పాఠశాల మున్నే రుకు సమీపంలో ఉంటుంది. మున్నేరు ఉప్పొంగడంతో నీరంతా స్కూల్‌ను ముంచెత్తింది. ఆది వారం రాత్రి స్కూల్లోకి మోకాళ్లలోతు వరకు వర ద చేరినట్లు స్థానికులు చెప్పారు. దీంతో అడ్మినిస్ట్రేషన్ రూంలోని పలు రికార్డులు కొట్టుకుపోయినట్టు స్కూల్ టీచర్ ఒకరు పేర్కొన్నారు.
⇒ నిర్మల్ జిల్లా ముథోల్ మండల కేంద్రంలోని సాయిమాధవ నగర్ కాలనీలోని మహాత్మా జ్యోతిబా ఫూలే పాఠశాల పూర్తిగా జలదిగ్బంధమైంది. – హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కొండపర్తి ప్రభుత్వ పాఠశాల చుట్టూ వరద చేరింది. గదుల్లోనూ వరదనీరు ఉండటంతో కొన్ని రోజులపాటు క్లాసుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు.
⇒ మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట ఉన్నత పాఠశాల ముందు వరదనీరు నిలిచింది. తరగతి గదుల్లోని గోడలకు చెమ్మ ఏర్పడింది. సాధారణ పరిస్థితి వచ్చే దాకా క్లాసులు నిర్వహించడం కష్టమేనని ఉపాధ్యాయులు అంటున్నారు. క్లాసులు నిర్వహించినా కొన్ని రోజులపాటు విద్యార్థులు హాజరుకావడం కష్టమేనని స్థానికులు చెబుతున్నారు.
⇒ సూర్యాపేట జిల్లాలోని పలు స్కూళ్లలోకి వరద తగ్గినా బురద కొన్ని రోజులు ఉండే వీలుంది. ఈ నేపథ్యంలో కొన్ని రోజులపాటు తరగతుల నిర్వహణ కష్టమని టీచర్లు అంటున్నారు.
ఇంజనీరింగ్ స్పాట్‌కు మరోరోజు గడువు పెంపు
వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఇంజనీరింగ్ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియను మరోరోజు పొడిగించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి సోమవారంతో స్పాట్ ముగించాల్సి ఉంది. ఇప్పటివరకు 2 వేల మంది విద్యార్థులు స్పాట్ అడ్మిషన్లు పొందారు. కొన్నిచోట్ల రహదారులు తెగిపోవడంతో విద్యార్థులు కాలేజీలకు రాలేని పరిస్థితి ఉన్నట్లు అధికారుల దృష్టికి తెచ్చారు. మరోవైపు ఉస్మానియా, జేఎన్‌టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన పరీక్షలను యథావిధిగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment