సాక్షి, నాగర్‌కర్నూల్: పదహారేళ్లుగా పనిచేస్తున్నామని, తమ ఉద్యోగాలు రెగ్యులర్ చేయాలంటూ సెకండ్ ఏఎన్‌ఎంలు పోస్టుకార్డులు రాసి ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఏజ్ లిమిట్‌తో కొత్త నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయిందని వాపోతున్నారు.
2007లో మంది 4025 మంది నియామకం
ప్రజలకు క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం 2007లో సెకండ్ ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు పద్ధతిన నియమించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 4,025 మంది సెకండ్ ఏఎన్‌ఎంలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాల అమలులో వీరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. శిశువులు, గర్భిణులకు టీకాలు, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్, పీహెచ్‌సీల్లో విధులు, ఆయుష్మాన్ భారత్ కార్డుల జారీ తదితర విధులతోపాటు మొత్తం 40 వరకు జాతీయ కార్యక్రమాలు, 32 వరకు ఆన్‌లైన్ రిపోర్టుల అందజేత వంటి విధుల్లో పాలుపంచుకుంటున్నారు.
జీతమూ తక్కువే...: రెగ్యులర్ ఏఎన్‌ఎంలు నిర్వర్తించే అన్ని విధులు తాము నిర్వర్తిస్తున్నా జీతం మాత్రం రూ.25 వేలు ఉందని సెకండ్ ఏఎన్‌ఎంలు వాపోతున్నారు. అదనంగా టీఏ, డీఏలు సైతం ఇవ్వడం లేదని లేవని, 16 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని వృద్ధాప్యానికి చేరువవుతున్నా తమ ఉద్యోగాలకు భద్రత కరువైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం కొత్తగా 1,520 పోస్టులతో ఏఎన్‌ఎం భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో ఏళ్లుగా ఆశతో చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగాలకు ఎసరు పెట్టినట్లయ్యిందని సెకండ్ ఏఎన్‌ఎంలు ఆందోళన చెందుతున్నారు.
వయోపరిమితితో అనర్హత..
ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఏఎన్‌ఎం నోటిఫికేషన్‌లో ఇప్పటికే పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వందకు 20 పాయింట్లు వెయిటేజీ కలి్పంచింది. అయితే ఇందులో జనరల్ అభ్యర్థులకు గరిష్టంగా 45 ఏళ్ల వయోపరిమితి విధించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేళ్ల మినహాయింపు కలి్పంచింది. కానీ, సెకండ్ ఏఎన్‌ఎంలలో చాలావరకు 45 నుంచి 50 ఏళ్ల వయస్సు పైబడినవారే ఉన్నారు. ఏళ్లుగా చాలీచాలని జీతాలతో వైద్యసేవలు అందిస్తూ వృద్ధాప్య దశకు చేరుకుంటున్నా, ఉద్యోగ భద్రత కరువైందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని కోరుతున్నారు.
వయసు పైబడుతోంది..
ప్రభుత్వపరంగా చేపట్టే అన్ని ఆరోగ్య కార్యక్రమాల అమలులో కీలకంగా పనిచేస్తున్నాం.16 ఏళ్ల సర్విసుతో అందరి వయస్సు 45 ఏళ్లు దాటింది. ప్రభుత్వ నోటిఫికేషన్ రద్దు చేసి మా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలి. – హైమవతి, సెకండ్ ఏఎన్‌ఎం, తాడూరు పీహెచ్‌సీ, నాగర్‌కర్నూల్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment