Secunderabad-Tirupati Vande Bharat Express To Add Extra 16 Coaches From May 17 - Sakshi
Sakshi News home page

16 బోగీలతో సికింద్రాబాద్‌–తిరుపతి వందేభారత్‌.. ఎప్పటి నుంచి అంటే?

Published Tue, May 16 2023 3:03 AM | Last Updated on Tue, May 16 2023 9:54 AM

Secunderabad Tirupati Vande Bharat with 16 bogies - Sakshi

సాక్షి, సిటీబ్యూరో:  సికింద్రాబాద్‌–తిరుపతి మధ్య నడిచే వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌  కోచ్‌ల సంఖ్య పెరగనుంది. ప్రస్తుతం 8 కోచ్‌లు ఉన్న ఈ  ట్రైన్‌కు ఈ నెల  17వ తేదీ నుంచి అదనంగా మరో 8 కోచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఈ  ట్రైన్‌ బోగీల సంఖ్య 16కు చేరుకోనుంది. అలాగే  ఇప్పుడు 530 మంది ప్రయాణికుల సామర్థ్యం మాత్రమే ఉండగా  బోగీల పెంపు వల్ల  సీట్ల సంఖ్య కూడా 1,128 కి పెరగనుంది.

దీంతో పాటు సికింద్రాబాద్‌–తిరుపతి, తిరుపతి–సికింద్రాబాద్‌ మధ్య రెండు వైపులా  ప్రయాణ సమయం కూడా  15 నిమిషాల వరకు తగ్గనున్నట్లు  దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్‌ రాకేశ్‌  తెలిపారు. ప్రస్తుతం ఈ  రైలు  ఎనిమిదిన్నర గంటల వ్యవధిలో గమ్యస్థానం చేరుకుంటుండగా  ఈ నెల  17 నుంచి  8 గంటల  15 నిమిషాలకే  చేరుకోనుంది. 

అనూహ్యమైన డిమాండ్‌... 
నిత్యం వందలాది మంది భక్తులు హైదరాబాద్‌ నుంచి తిరుపతి పుణ్యక్షేత్రాన్ని సందర్శించేందుకు తరలి వెళ్తారు. దీంతో ఈ రూట్‌లో రైళ్లకు  ఎంతో డిమాండ్‌ ఉంది. గత నెల 8వ తేదీన ప్రధాని  నరేంద్రమోదీ చేతుల మీదుగా వందేభారత్‌ను ప్రవేశపెట్టినప్పటి నుంచి వంద శాతానికి పైగా ఆక్యుపెన్సీతో నడుస్తోంది. కానీ  కోచ్‌లు, సీట్లు పరిమితంగానే ఉండడం వల్ల చాలా మంది వందేభారత్‌లో  పయనించలేకపోయారు.

8 కోచ్‌ల కూర్పుతో ప్రవేశపెట్టిన ఈ ట్రైన్‌లో ఒక  ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ తో పాటు  7  చైర్‌ కార్లు మాత్రమే ఉన్నాయి.సికింద్రాబాద్‌ నుంచి వెళ్లేటప్పుడు  ఏప్రిల్‌లో 131 శాతం, మే నెలలో  135శాతం, తిరుపతి నుంచి   సికింద్రాబాద్‌కు వచ్చేటప్పుడు ఏప్రిల్‌లో 136 శాతం, మేలో ఇప్పటి వరకు 38 శాతం చొప్పున ఆక్యుపెన్సీ నమోదు కావడం గమనార్హం.ఇప్పటి వరకు ఈ ట్రైన్‌లో  మొత్తం 44,992 మంది ప్రయాణం చేశారు. సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి 21,798 మంది,  తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు మరో 23,194 మంది చొప్పున రాకపోకలు సాగించారు. 



పెరుగనున్న సీట్ల సంఖ్య.... 
కొత్తగా అందుబాటులోకి రానున్న 16 కోచ్‌లలో 14 చైర్‌కార్‌లు ఉంటాయి. వీటిలో 1,024 మంది ప్రయాణం చేస్తారు. మరో 2 ఎగ్జిక్యూటివ్‌ కోచ్‌లలో 104 మంది ప్రయాణం చేస్తారు. దీంతో ప్రయాణికుల సంఖ్య 1128 కి పెరగనుంది.కోచ్‌లను  రెట్టింపు చేయడం వల్ల  ఎక్కువ మంది ప్రయాణం చేయగలుగుతారని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌  తెలిపారు.  వేసవి సెలవుల దృష్ట్యా ప్రయాణికుల డిమాండ్‌ కూడా ఎక్కువగానే ఉందన్నారు. 

ఇవీ వేళలు.. 
సికింద్రాబాద్‌– తిరుపతి 
సికింద్రాబాద్‌– తిరుపతి (20701) ఉదయం 6.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఉదయం 7.29 గంటలకు నల్గొండ, 9.35 గంటలకు గుంటూరు, 11.12 గంటలకు ఒంగోలుకు చేరుకుంటుంది. ఒంగోలులో తిరిగి  11.15 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.29 గంటలకు నెల్లూరుకు మధ్యాహ్నం 2.30 కు తిరుపతికి చేరుకుంటుంది. ప్రతి స్టేషన్‌లో ఒక నిమిషం పాటు హాల్టింగ్‌ ఉంటుంది. ఒంగోలులో మాత్రం  3 నిమిషాల పాటు నిలుపుతారు.  

తిరుపతి–సికింద్రాబాద్‌   
ఈ ట్రైన్‌ మధ్యాహ్నం 3.15 గంటలకు బయలుదేరి రాత్రి 11.30 కు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. సాయంత్రం 4.49 గంటలకు నెల్లూరు, 6.02 గంటలకు ఒంగోలుకు చేరుకుంటుంది. సాయంత్రం 6.05 గంటలకు ఒంగోలు నుంచి బయలుదేరి 7.45 గంటలకు గుంటూరు, రాత్రి 9.49 గంటలకు నల్గొండకు చేరుకుంటుంది. రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలోనూ ఒంగోలులో  3 నిమిషాల హాల్టింగ్‌ సదుపాయం ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement