ఇంద్రవెల్లి: ఒకే కుటుంబంలోని ఇద్దరు పిల్లలు పాముకాటుకు బలయ్యారు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం సమకా పంచాయతీ పరిధి పాటగూడ(మారుతీగూడ) కోలాం గ్రామంలో చోటుచేసుకుంది. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం దనోర పంచాయతీ పరిధి అక్షాపూర్ కోలం గిరిజన గ్రామానికి చెందిన ఆత్రం రాజు–కవితాబాయి దంపతులకు భీంబాయి, భీంరావ్(14), దేవ్‌రావ్, దుర్గ, రాము, దీప(4)తోపాటు ఏడాది పాప ఉంది.
కుటుంబ కలహాల కారణంగా ఏడాది క్రితం కవితాబాయి తన పిల్లలతో కలిసి ఇంద్రవెల్లి మండలం సమకా పంచాయతీ పరిధి పాటగూడ(మారుతీగూడ)లోని పుట్టింటికి వెళ్లింది. అక్కడే చిన్న గుడిసె వేసుకుని నివసిస్తోంది. కూలీపనులకు వెళ్తూ పిల్లలను పోషిస్తోంది. శనివారంరాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసి నిద్రపోయారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల ప్రాంతంలో దీప ఏడుస్తూ నిద్ర లేచింది.
కవితాబాయి ఆందోళన చెంది ఇరుగుపొరుగు వారిని పిలువగా అప్పటికే దీప స్పృహ కోల్పోయింది. అంతలో నిద్రలేచిన కొడుకు భీంరావ్ తన కుడి చెవిపై పాముకాటు వేసిందని తెలిపాడు. దీప శరీరంపై కూడా పాముకాటు కనిపించడంతో గ్రామస్తులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. అంబులెన్స్ వచ్చేలోపే పరిస్థితి విషమించి దీప మృతి చెందింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో భీంరావు మృతి చెందాడు.
Comments
Please login to add a commentAdd a comment