సీఎస్‌బీ, ఐఎస్‌బీ సంయుక్త అధ్యయనంలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు నకిలీ, కాలం చెల్లిన ఆధార్ కార్డులలో చిన్నారుల ఫొటోలను పెట్టి తయారు చేసిన పత్రాలతో సిమ్ కార్డులు తీసుకుని వాటిని సైబర్ నేరాలకు వినియోగిస్తున్నట్టు తెలంగాణ సైబర్ సెక్యూరి టీ బ్యూరో (సీఎస్‌బీ), ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం వెల్లడించింది. సిమ్ కార్డుల రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 64.5 శాతం మంది కస్టమర్లు మాత్రమే డిజిటల్ కేవైసీని ఆధార్‌తో లింక్ చేసుకుంటున్నట్టు నివేదిక తేల్చింది.
‘టెలికామ్ సిమ్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రాడ్స్–గ్లోబల్ పాలసీ ట్రెండ్స్, రిస్క్ మేనేజ్‌మెంట్ అండ్ రికమండేషన్స్’ పేరిట నిర్వహించిన ఈ అధ్యయన నివేదికను టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ సోమవారం టీజీ సీఎస్‌బీ కార్యాలయంలో ఐఎస్‌బీ ప్రొఫెసర్లతో కలిసి విడుదల చేశారు. సీఏఎఫ్ (కస్టమర్ అక్విజేషన్ ఫారమ్స్)లోని సమాచారం ఆధారంగా ఈ అధ్యయనాన్ని చేపట్టినట్టు నివేదికలో పేర్కొన్నారు.
హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో నమోదైన సైబర్ నేరాల్లో ఉన్న ఫోన్ నంబర్లకు సంబంధించి మొత్తం 1,600 సీఏఎఫ్‌ల వివరాలు విశ్లేషించినట్టు తెలిపారు. సైబర్ నేరగాళ్లు వినియోగించిన ఫోన్ నంబర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాడ్యూల్స్‌తో రియల్ టైంలో విశ్లేషించినట్టు వివరించారు.
సిమ్ కార్డులు పోతే సమాచారం ఇవ్వాలి: సీఎస్‌బీ డైరెక్టర్
సైబర్ నేరాల్లో సిమ్‌కార్డు సంబంధిత మోసాలు పెరుగు తున్నాయని, వీటిని అడ్డుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అధ్యయనం అభిప్రా యపడింది. వినియోగదారుడి వివరాలు వెరిఫికేషన్‌లో చాలా లోపాలు ఉన్నట్టు అధ్యయనం తేల్చింది. ఓటీపీ అథెంటికేషన్‌లోనూ లోపాలు ఉన్నట్టు వెల్లడించింది. ప్రజలు సిమ్ కార్డులు పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే ఆ సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని ఈ సందర్భంగా శిఖా గోయల్ సూచించారు.
పోగొట్టుకున్న సిమ్ కార్డులను వినియోగించి సైబర్ నేరగాళ్లు నేరాలకు పాల్పడే అవకాశం ఉందని, అందులో మన వివరాలు ఉంటాయి కాబట్టి మనం చిక్కుల్లో పడతామని హెచ్చరించారు. అదేవిధంగా వ్యక్తిగత సమాచారాన్ని అవసరానికి మించి ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు. ఈ నివేదిక రూపకల్పనలో ఆపరేషన్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర, నిజామాబాద్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవర్, ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజ్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డేటా సైన్స్ ప్రొఫెసర్లు మనీశ్ గంగ్వార్, డా.శ్రుతిమంత్రిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment