కాళేశ్వరం: పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన | Medigadda Barrage Bridge Slightly Bent In Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం: పెద్ద శబ్ధంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన.. రాకపోకలు బంద్‌

Published Sun, Oct 22 2023 8:19 AM | Last Updated on Sun, Oct 22 2023 11:02 AM

Slightly bent Medigadda Barrage Bridge - Sakshi

సాక్షి, కాళేశ్వరం: తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించింది. అయితే, కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఎంతో కీలకమైంది. కాగా,  మేడిగడ్డ బ్యారేజీ వంతెన ఒక్కసారిగా కొంతమేరకు కుంగింది. భారీ శబ్దంతో బి-బ్లాకులోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఉన్న వంతెన ఒక అడుగు మేర కుంగిపోయింది. దీంతో, అప్రమత్తమైన అధికారులు వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు. ఈ క్రమంలో తెలంగాణ, మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

వివరాల ప్రకారం.. మేడిగడ్డ బ్యారేజీ 20వ పిల్లర్‌ కుంగడంతోనే పైన వంతెన కుంగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా, బ్యారేజీ పొడవు 1.6 కిలోమీటర్లు ఉండగా సంఘటన జరిగిన ప్రదేశం మహారాష్ట్ర వైపు నుంచి 356 మీటర్ల సమీపంలో ఉంది. గోదావరి నదిపై జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలో 2019లో మేడిగడ్డ వద్ద ఈ బ్యారేజీ నిర్మించారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లో ఇది మొదటిది. శనివారం రాత్రి సమయానికి ఎగువ నుంచి జలాశయానికి 25 వేల క్యూసెక్కుల వరకు ప్రవాహం వస్తుండగా 8 గేట్లు తెరిచి దిగువకు వదులుతున్నారు. 

ఈ క్రమంలో శబ్దం రావడంతో ప్రాజెక్టు కార్యనిర్వాహక ఇంజినీరు తిరుపతిరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. వారు పరిశీలన చేస్తున్న సమయంలోనూ మరికొన్ని శబ్దాలు రావడంతో వెంటనే ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. దీంతో, అప్రమత్తమైన నీటిపారుదల శాఖ ఇంజినీర్లు డ్యాం పరిసరాల్లో అలర్ట్‌ ప్రకటించారు. మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ బ్యారేజీ పైనుంచి రాకపోకలు నిలిపివేశారు. మరోవైపు ఎల్‌అండ్‌టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రికి మేడిగడ్డ చేరుకున్నారు. డ్యాం పైభాగాన్ని పరిశీలించిన ఈఈ తిరుపతిరావు మాట్లాడుతూ.. చీకటిగా ఉండటంతో ఏం జరిగిందనేది స్పష్టత లేదని తెలిపారు.

10.17 టీఎంసీల జలాలు
16.17 టీఎంసీల సామర్థ్యం ఉన్న బ్యారేజీలో సంఘటన జరిగే సమయానికి 10.17 టీఎంసీల జలాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వంతెన కుంగిన నేపథ్యంలో ఇంజినీర్లు ముందు జాగ్రత్త చర్యగా జలాశయాన్ని ఖాళీ చేయడం ప్రారంభించారు. మొదట 12 గేట్లు, ఆ తరువాత వాటిని 46కు పెంచి దిగువకు నీటిని విడుదల చేయడం ప్రారంభించారు. దాదాపు 50 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ఉదయానికి కొంత మేరకు జలాశయాన్ని ఖాళీ చేసి వంతెన కుంగిన ప్రాంతం దిగువన బ్యారేజీకి ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది పరిశీలించనున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

ఇది కూడా చదవండి: ఆర్టీసీకి ‘ఎన్నికల గిరాకీ’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement