సాక్షి, నారాయణపేట: కనీస నిర్వహణ ఖర్చులు రాక ఇబ్బందులు పడుతున్న రేషన్ దుకాణాలను లాభసాటి కేంద్రాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసరఫరాల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వీటిలో మినీ గ్యాస్ సిలిండర్లు పంపిణీ, ఇంటర్‌నెట్ కేఫ్, సిటిజన్ చార్జ్ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నారు. తద్వారా డీలర్లకు కొంత కమీషన్ ఇచ్చి ఆర్థికంగా పరిపుష్టం చేయడంతోపాటు.. పేదలకు కొంత వరకు ఉపశమనం కలిగించనున్నారు.
జిల్లాలో 247 దుకాణాలు..
జిల్లాలోని 11 మండలాల్లో 247 రేషన్ దుకాణాలు ఉన్నాయి. గతంలో బియ్యంతోపాటు పంచదార, కిరోసిన్, గోధుమలు, ఇతర సరుకులు సరఫరా చేసిన చౌకధర దుకాణాలు ప్రస్తుతం బియ్యం మాత్రమే అందిస్తున్నాయి. 50 కిలోల బియ్యంలో మూడు నుంచి నాలుగు కిలోల తరుగు రావడంతో వచ్చిన కమీషన్ తరుగుకు సరిపోతుందని, నెల మొత్తం కష్టపడితే ఖాళీ సంచులు మాత్రమే మిగులుతున్నాయని, దీనికి తోడు కొందరు గ్రామాల్లో తిరిగి లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యం సేకరించి రీసైక్లింగ్‌కు పాల్పడితే తాము నిందపడాల్సి వస్తుందని కొద్ది రోజులుగా డీలర్లు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వీటిని బలోపేతం చేయడానికి చర్యలు చేపడుతున్నారు.
కమీషన్ రూ.41..
రేషన్ దుకాణం ద్వారా కార్డుదారులతోపాటు ఆధార్‌కార్డు కలిగిన వారికి 5 కిలోల మినీ సిలిండర్లు సరఫరా చేయడానికి పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతినెలా రేషన్ మాదిరిగానే మినీ సిలిండర్లను సైతం తీసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మొదటిసారి సిలిండర్ తీసుకున్న సమయంలో ఒక్క సిలిండర్‌కు రూ.940 చెల్లించాలని, తర్వాత నెల నుంచి రూ.620కే అందిస్తామని తెలిపారు. దీనిలో గ్యాస్ డీలర్‌కు ఒక సిలిండర్‌కు రూ.41 కమీషన్ ఇవ్వనున్నారు. నెలలో ఎన్ని సిలిండర్లు కావాలన్నా ఇస్తారు. రేషన్ డీలర్ 20 సిలిండర్ల వరకు నిల్వ చేసుకోవచ్చు.
అందుబాటులోకి పౌర సేవలు..
రేషన్ దుకాణాల్లో ఇంటర్‌నెట్ కేఫ్‌లు, పౌరసేవా పత్రం ద్వారా 14 రకాల సేవలను అందుబాటులోకి తేనున్నారు. తద్వారా కొంత కమీషన్ రూపంలో డీలర్లకు ఇవ్వనున్నారు. ఇదిలా ఉండగా రేషన్ దుకాణాలకు పీఎం వాణి కేంద్రాలుగా నామకరణం చేయనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment