రేషన్‌ షాపుల్లో నయా దందా! | Irregularities In Ration Shops At Mahabubnagar | Sakshi
Sakshi News home page

రేషన్‌ షాపుల్లో నయా దందా!

Published Thu, Aug 22 2019 12:00 PM | Last Updated on Thu, Aug 22 2019 12:01 PM

Irregularities In Ration Shops At Mahabubnagar - Sakshi

‘‘మహబూబ్‌నగర్‌లోని న్యూటౌన్‌ పరిధిలో నివసిస్తున్న శివశంకర్‌ బియ్యం కోసం రేషన్‌షాపుకు వెళ్లాడు. సదరు రేషన్‌ డీలర్‌ ముందుగా అతనికి రేషన్‌ బియ్యం ఇస్తూనే టేబుల్‌పై గోధుమ పిండి, వంటనూనె, సర్ఫ్‌ పాకెట్‌ పెట్టాడు. ఇవీ కొత్తగా వచ్చిన మంచి బ్రాండ్లు.. బయట మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉంది. మా దగ్గర తక్కువ ధరకే ఇస్తున్నాం. తీసుకోవాలని పట్టుబట్టాడు. దానికి శివశంకర్‌ ససేమిరా అన్నాడు. అటు రేషన్‌ డీలర్‌ కూడా పట్టు వదలకుండా అతన్ని కనీసం రెండు సరుకులైనా తీసుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీంతో శంకర్‌ గత్యంతరం లేక రూ. 35లు చెల్లించి గోధుమ పిండి పాకెట్‌ తీసుకున్నాడు. ఇలాంటి డీలర్లు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలా మందే ఉన్నారు. ప్రభుత్వం సరఫరా చేసే సరుకుల కోసం తమ వద్దకు వచ్చే వినియోగదారులను బలవంత పెట్టి మరీ అనధికారికంగా నిత్యావసర వస్తువులు అంటగడుతున్నారు.

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో పలు రేషన్‌ దుకాణాలు గాడితప్పాయి. ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, కిరోసిన్‌ మాత్రమే ఆయా దుకాణాల్లో విక్రయించాల్సి ఉండగా ఇప్పుడవి కిరాణం షాపులుగా దర్శనమిస్తున్నాయి. సబ్బులు, సర్ఫ్, గోధుమలు, గోధుమ పిండి, వంటనూనె, పప్పుతోకళకళలాడుతున్నాయి. వీటిలో దాదాపు అన్నీ లోకల్‌ బ్రాండ్లే కావడం విశేషం. ప్రభుత్వేతరసరుకులు వద్దన్నా చాలా మంది డీలర్లు బలవంతంగా వినియోగదారులకు వాటిని అంటగడుతున్నారు. పలు ప్రాంతాల్లోనయితే ఇచ్చిన సరుకులు తీసుకుంటేనే బియ్యం, కిరోసిన్‌ ఇస్తున్నట్లు సమాచారం.

ఇంకొన్ని చోట్ల బియ్యం కోసం వచ్చిన వినియోగదారులకు ప్రభుత్వేతర సరుకులు అంటగట్టి.. రూ.1కిలో ఉన్న రేషన్‌ బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. దీంతో చాలా మంది వినియోగదారులు చేసేదేమీ లేక బియ్యం, కిరోసిన్‌ కోసం డీలర్లు ఇచ్చిన సరుకులు కొనుగోలు చేయాల్సివస్తోంది. ము ఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ అక్రమ వ్యా పారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సా గుతోంది. తెరచాటున జరుగుతున్న ఈ వ్యా పారంతో రేషన్‌ షాపులకు నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తోన్న వ్యాపారులతో పాటు డీలర్లూ పెద్ద మొత్తంలో లాభపడుతున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో 510 రేషన్‌ షాపులు ఉండగా 2,38,932 ఆహారభద్రత కార్డులున్నాయి. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 558 షాపులు, 3.33లక్షల కార్డులు..వనపర్తి జిల్లాలో 325 షాపులు, 1,55,021 ఆహార భద్రత కార్డులున్నాయి.

ఏడాది క్రితం వరకు రేషన్‌ షాపుల్లో కందిపప్పు, చింతపండు, పామాయిల్, చక్కెర, గోధుమలు, కారం, ఉప్పు, పసుపు, పెసరపప్పు, బియ్యం, కిరోసిన్‌ ఇచ్చేవారు. ఒక్కొక్కటీగా అన్ని సరుకులపై సబ్సిడీ ఎత్తివేసిన ప్రభుత్వం రేషన్‌ షాపులను కేవలం బియ్యం, కిరోసిన్, ఏఏవై కార్డుదారులకు చక్కెర ఇస్తుంది. కుటుంబంలో ఎంత మంది ఉంటే అంత మందికి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున బియ్యం.. ప్రతి కార్డుపై లీటరు కిరోసిన్‌ ఇస్తున్నారు. అయితే.. పంపిణీ చేస్తోన్న బియ్యం, కిరోసిన్‌పై ఒక రూపాయి నుంచి రూ.2 వరకు కమీషన్‌ అందుతోంది.  

షాపులకు సరుకులు.. డీలర్లకు కమీషన్లు..  
డీలర్ల ఆర్థిక పరిస్థితిని గమనించిన కొందరు బడా వ్యాపారులు కొత్త తరహా మార్కెటింగ్‌కు తెరలేపారు. రేషన్‌ షాపుల ద్వారా పలు రకాల నిత్యావసర సరుకులు విక్రయిస్తే ఎక్కువ కమీషన్లు ఇచ్చేందుకు చాలా మంది డీలర్లతో ఒప్పందం కుదుర్చుకున్నారు. గుట్టుచప్పుడు కాకుండా.. వంట పాత్రలు కడిగే సబ్బు మొదలు వంట నూనె వరకు సుమారు పది సరుకులు ఆయా షాపులకు సరఫరా చేసి ఎంఆర్‌పీ ధరల ప్రకారం డీలర్లతో అమ్మిస్తున్నారు. ఒక్కో సరుకుపై ఒక్కో కమీషన్‌ మేరకు డీలర్లకు లాభం చేకూరుస్తున్నారు. ఉదాహరణకు విజయ, కోటా, టేస్టీ గోల్డ్‌ పేరిట రూ.50 నుంచి రూ.60 వరకు పాకెట్లలో పామాయిల్‌ విక్రయిస్తున్నారు.

మినార్‌ పేరిట రూ. 35 చొప్పున గోధుమ పిండి (లోకల్‌ బ్రాండ్‌) డీలర్ల ద్వారా విక్రయిస్తున్నారు. ఈఈఈ పేరిట బట్టలు ఉతికే సర్ఫ్, సబ్బులు వంటి లోకల్‌ బ్రాండ్లు విక్రయిస్తూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ వ్యాపారం ముఖ్యంగా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలో జోరుగా సాగుతోంది. ఆయా జిల్లాలకు చెందిన పలువురు డీలర్లే హైదరాబాద్‌ నుంచి సరుకులు తెప్పించి అన్ని షాపులకు చేరవేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం జిల్లా కేంద్రాల్లో స్టాక్‌ పాయింట్లు కూడా ఏర్పాట్లు చేసుకున్నారు. పలు రేషన్‌ దుకాణాల్లో ఈ అక్రమ వ్యాపారం జోరుగా సాగుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement