
సంగారంలో పామును ఆడిస్తున్న షరీఫ్
మణుగూరు టౌన్: ఎక్కడ పాము కనిపించినా చాకచక్యంగా బంధించే వ్యక్తి.. అదే పాము కాటుతో మృతి చెందిన సంఘటన విషాదం నింపింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సమితి సింగారానికి చెందిన షరీఫ్ (31) ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూనే పాములను పడుతుంటాడు. దీంతో ఎవరి ఇంట్లోకి పాము వచ్చినా స్థానికులు ఆయనకు సమాచారం ఇస్తారు.
ఇదే క్రమంలో రిక్షా కాలనీకి చెందిన బానోత్ వెంకట్రావ్ ఇంట్లోని బావిలో మంగళవారం తాచు పాము కనిపించగా, షరీఫ్ దాన్ని బయటికి తీసుకొచ్చి సుమారు గంట పాటు రోడ్డుపై సరదాగా ఆడించాడు. ఈ సమయంలోనే అతని చేతిపై పాము కాటు వేసింది. అదేమీ పట్టించుకోని షరీఫ్ పామును బస్తాలో వేసుకుని తీసుకెళ్లి అడవిలో వదిలివేసి తిరిగి వస్తుండగా సురక్షా బస్టాండ్ వద్ద కింద పడిపోయాడు.
దీంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుని తల్లి కమరున్నీసా బేగం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ ముత్యం రమేష్ తెలిపారు. పాములను అత్యంత చాకచక్యంగా బంధించే షరీఫ్ అదే పాముకాటుతో మృతి చెందడం స్థానికంగా విషాదం నింపింది. పాము కాటు వేయగానే ఆస్పత్రికి వెళ్లాలని సూచించినా షరీఫ్ పట్టించుకోలేదని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment