ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు చట్టాలను సవరించడం ద్వారా హైడ్రాకు ప్రత్యేక అధికారాలు
వాల్టాతో పాటు రెండు రెవెన్యూ చట్టాలు, మున్సిపల్, పంచాయతీరాజ్ చట్టాలకు సవరణలు
ఇప్పటికే సవరణల ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపిన శాఖలు
ఆక్రమణల నిరోధం దిశగా హైడ్రాను బలోపేతం చేయడమే లక్ష్యం
నోటీసులు ఇవ్వడం నుంచి కూల్చివేతల దాకా అన్ని అధికారాల అప్పగింతకు రంగం సిద్ధం
అవసరమైతే హైడ్రాకు ప్రత్యేకంగా కొత్త చట్టం తేవాలంటున్న నిపుణులు
ఆర్డినెన్సా? అసెంబ్లీ ముందుకా? అన్నదానిపై ఈనెల 20న కేబినెట్‌లో స్పష్టత
సాక్షి, హైదరాబాద్: ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్, అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా)’ను పూర్తిస్థాయిలో బలోపేతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరు చట్టాలను సవరించడం ద్వారా ‘హైడ్రా’కు ప్రత్యేక అధికారాలు కల్పించాలని నిర్ణయించింది.
భూ ఆక్రమణల చట్టం–1905, వాల్టా, ల్యాండ్ రెవెన్యూ చట్టం, మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్, మున్సిపాలిటీస్ యాక్ట్, పంచాయతీరాజ్ చట్టాలను సవరించడం ద్వారా.. కీలక అధికారాలను హైడ్రాకు బదలాయించాలని భావిస్తోంది. ఆ చట్టాల సవరణ కోసం ప్రతిపాదనలు ్చపంపాలని రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖలను రాష్ట్ర ప్రభుత్వం కోరగా.. ఆ శాఖలు వెంటనే ప్రతిపాదనలను పంపాయని తెలిసింది.
అయితే ఈ సవరణ ప్రతిపాదనలన్నింటినీ కలిపి చట్టం చేయాలా? ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల పరిధిలోనే ఈ సవరణలను అమలు జరపాలా? అన్నదానిపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని సమాచారం. చట్ట సవరణలు కాకుండా హైడ్రా కోసం ప్రత్యేక చట్టం రూపొందిస్తే బాగుంటుందని భూచట్టాల నిపుణులు సూచిస్తున్నారు.
ప్రస్తుతానికి సహాయకారి మాత్రమే..
ఆక్రమణల కూల్చివేత విషయంలో ‘హైడ్రా’ప్రస్తుతానికి ప్రభుత్వ శాఖలకు సహాయకారిగా మాత్రమే ఉంది. ఆక్రమణల నిర్ధారణ, నోటీసులివ్వడం, చర్యలు తీసుకోవడం, కూల్చివేయడం వంటి అధికారాలేవీ హైడ్రాకు దఖలు పడలేదు. ప్రభుత్వ శాఖలకు అనుబంధంగానే పనిచేస్తోంది. ఈ నేపథ్యంలోనే పలు చట్టాలను సవరించి ఈ అధికారాలన్నీ నేరుగా హైడ్రాకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
రాష్ట్ర ప్రభుత్వం కోరిన మేరకు రెవెన్యూ శాఖ ఇప్పటికే చట్ట సవరణ ప్రతిపాదనలను పంపింది. ఆక్రమణల విషయంలో నోటీసులు ఇచ్చే అధికారం ఇప్పటివరకు కేవలం తహసీల్దార్‌కు మాత్రమే ఉండగా.. ఇకపై తహసీల్దార్‌తోపాటు హైడ్రాలోని అ«దీకృత అధికారికి కూడా అధికారాలను దఖలు పరుస్తూ రెవెన్యూ చట్టంలో సవరణను ప్రతిపాదించారు.
లేదంటే రెవెన్యూ అదీకృత అధికారిని హైడ్రాలోకి తీసుకోవాలని సవరణ ప్రతిపాదనల్లో సూచించినట్టు సమాచారం. అయితే హైడ్రాకు అధికారాల బదలాయింపు కోసం ఆర్డినెన్స్ రూపంలో చట్టం చేయాలా? అసెంబ్లీలో చర్చించి బిల్లు ఆమోదం ద్వారా చట్టం చేయాలా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదని, ఈ నెల 20వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో స్పష్టత వస్తుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి.
స్పష్టత కోసమే ప్రత్యేక చట్టం
‘హైడ్రా’ మనుగడకు ప్రత్యేక చట్టమే ఉపయోగపడుతుంది. చట్టాలకు సవరణలు, ఆ సవరణలతో మరో చట్టం చేసే దాని కంటే హైడ్రాకు ప్రత్యేకంగా చట్టం చేసి మార్గదర్శకాలు రూపొందించుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు రావు.
గందరగోళం ఉండదు. న్యాయపరమైన చిక్కులు రావు. ఎన్‌ఫోర్స్‌మెంట్‌తో పాటు చర్యలు తీసుకునే ప్రక్రియ మొత్తాన్ని ఈ చట్టంలో రూపొందించుకోవచ్చు. మరోవైపు చట్టబద్ధత ద్వారా అధికారాన్ని ఏ సంస్థకు బదలాయించినా ఆ సంస్థ బాధ్యత మరింత పెరుగుతుంది. – ఎం.సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణుడు
Comments
Please login to add a commentAdd a comment