సాక్షి ప్రతినిధి, వరంగల్/గీసుకొండ: ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండున్నర దశాబ్దాల క్రితమే మహిళా పాలన జాతీయస్థాయి ఖ్యాతినార్జించింది. ఆదర్శ గ్రామంగా పేరెన్నికగన్న వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లి ఇందుకు వేదికైంది. దశాబ్దం పాటు ఇక్కడ మహిళలే ప్రజాప్రతినిధులుగా వెలుగొందారు. గీసుగొండ మండలంలో మచ్చాపురం శివారు గ్రామంగా ఉండే గంగదేవిపల్లి 1994లో ప్రత్యేక గ్రామ పంచాయతీగా అవతరించింది. అప్పట్లో గ్రామ జనాభా 1,291 మంది కాగా, 1995లో జరిగిన తొలి పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవిని మహిళలకు రిజర్వ్ చేశారు. సర్పంచ్ స్థానంతో పాటు 9 వార్డుల్లోనూ మహిళలే పోటీ చేయగా, వీరంతా ఏకగ్రీవంగా ఎన్నికై ఆదర్శంగా నిలిచారు. ఆ తరువాత విడతలోనూ ఇదే ప్రత్యేకతను చాటుకుందీ గ్రామం.
కూలీల నుంచి పాలకులుగా..
వ్యవసాయం, కూలి పనులు చేసుకునే మహిళలు పాలనా పగ్గాలు చేపట్టి గంగదేవిపల్లిని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దారు. 1995 ఆగస్టు 23న గ్రామ తొలి సర్పంచ్‌గా కూసం లలిత, ఉపసర్పంచ్‌గా పెండ్లి సరోజన, వార్డు సభ్యులుగా కూసం రాజేశ్వరి, దేవులపెల్లి విజయ, జంగం వీరలక్ష్మి, మామిండ్ల లక్ష్మి, చల్ల కట్టమ్మ, సింగిరెడ్డి నర్సమ్మ, గోనె లక్ష్మి ఎన్నికయ్యారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారంతో వీరంతా ప్రతీ పనికి కమిటీలు, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కించారు.
రెండోసారీ మహిళలకే పట్టం
గ్రామపంచాయతీ రెండో విడత ఎన్నికలు 2001 ఆగస్టు 23న జరగ్గా, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పురుషులు పోటీపడినా మహిళలకే గ్రామస్తులు పట్టంకట్టారు. సర్పంచ్‌గా రెండోసారి కూసం లలిత, ఉపసర్పంచ్‌గా పెండ్లి జయసుధ, వార్డు సభ్యులుగా దేవులపెల్లి విజయ, కూసం రాజేశ్వరి, సల్ల సాంబలక్ష్మి, సల్ల కట్టమ్మ, మేడిద లక్ష్మి, మేడిద మల్లికాంబ, గూడ రాధమ్మ ఎన్నికై మహిళాసత్తా చాటారు. వీరి హయాంలో గంగదేవిపల్లి జాతీయ ఆదర్శ గ్రామంగా గుర్తింపు పొంది దేశ, విదేశీయులను ఆకర్షించింది.
అన్నింటా వంద శాతం..
►వంద శాతం ఇంటిపన్ను వసూలు
►వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం
►ఇద్దరు పిల్లలతో కుటుంబ నియంత్రణ
►వంద శాతం కుటుంబాలు చిన్నమొత్తాల పొదుపు
►వంద శాతం బడిఈడు పిల్లలు బడికి
►15–50 ఏళ్లలోపు వంద శాతం సంపూర్ణ అక్షరాస్యత
►వంద శాతం ప్రజలకు బాలవికాస ద్వారా పరిశుభ్రమైన తాగునీరు
►బాల కార్మికులు లేని గ్రామం
►1996–97, 1997–98లో మండల స్థాయిలో ఉత్తమ పంచాయతీ అవార్డులు
►1997–98, 2003–04, 2006–07లో మూడుసార్లు జిల్లా స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డులు
►2006–07లో ఎల్‌ఐసీ బీమా గ్రామీణ అవార్డు పురస్కారం
Comments
Please login to add a commentAdd a comment