సాక్షి,రాయపర్తి(వరంగల్): తల నుంచి కాలి గోటి వరకు కారుమబ్బును తలపించే నిఖార్సైన నలుపుకోడి. మటన్‌కు పోటా పోటీగా గిరాకీ, నాటుకోడిని తలదన్నే రుచి. సాధారణ బాయిలర్ కోళ్లతో పోల్చితే పోషకాలతో మేటి. తెగుళ్లు దరిచేరని రోగనిరోధక శక్తి దీని సొంతం. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను తెచ్చి పెడుతున్న ఈ కోళ్లను రాయపర్తి మండలం కొలన్‌పల్లికి చెందిన యువకుడు సతీష్ పెంచుతున్నాడు.
నాటుకోడిని తలదన్నేలా కడక్‌నాథ్ అనే ఈ ప్రత్యేక జాతి నాటుకోడి మార్కెట్‌లో ప్రవేశించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మెలనిన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉండటంతో ఈ కోడి నలుపు రంగును సంతరించుకుందని చెబుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్‌లో కడక్‌నాథ్ కోడి మాంసం కిలో రూ.700 నుంచి రూ 900 వరకు, గుడ్డు ఒక్కటికి రూ. 20 నుంచి రూ.30 వరకు పలుకుతుందని సతీష్ అంటున్నాడు.
నెలకు 18 గుడ్లు..
సాధారణ నాటు కోళ్ల మాదిరిగానే కడక్‌నాథ్ కోడి రెండు నుంచి ఐదేళ్ల వరకు బతుకుతుంది. ఐదు నెలల వయసు నుంచి నెలకు 10 నుంచి 18 గుడ్ల చొప్పున మూడేళ్ల వరకు గుడ్లు పెడుతుంది. పుంజు రెండు నుంచి రెండున్నర కేజీలు, పెట్ట ఒకటిన్నర కేజీల నుంచి రెండు కేజీల వరకు బరువు పెరుగుతుంది.
వృత్తి సాఫ్ట్‌వేర్..ప్రవృత్తి నాటుకోళ్ల పెంపకం
వృత్తి సాఫ్ట్‌వేర్ అయినా ప్రవృత్తిగా నాటుకోళ్లను పెంచుతూ లాభాలను ఆర్జిస్తున్నాడు సతీష్. చాలా చోట్ల తిరిగినా దొరకపోవడంతో ఆన్‌లైన్‌లో ఏక్యూఏఐ అనే యాప్ ద్వారా ఒకేసారి ఒక్కో పిల్లకు రూ.110 చొప్పున 50 పిల్లలను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం 70 నాటుకోళ్లు, 50 కడక్‌నాథ్ కోడిపిల్లలతో పాటు బాతులను పెంచుతూ ఆదర్శంగా నిలుస్తునాడు.
చదవండి: రండి బాబు రండి!.... రూ.50 వేలకే బీటెక్, డిగ్రి, ఇంటర్ సర్టిఫికేట్లు
Comments
Please login to add a commentAdd a comment