మధురానగర్‌లో వినూత్నరీతిలో వెలసిన ఫ్లెక్సీలు
వెంగళరావునగర్: ‘వీధి కుక్కలకు మీ ఇంటి వద్దనే ఆహారాన్ని పెట్టండి మహాప్రబో.. రోడ్ల మీద పెట్టకండి.. కుక్కల నుంచి ప్రజల ప్రాణాలను రక్షించండి’అంటూ మధురానగర్ కాలనీలో స్థానికులు వినూత్నరీతిలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటుకు గత ఏడాది నుంచి జరుగుతున్న కాలనీవాసుల ఆందోళనే ప్రధాన కారణం. దాదాపు ఏడాదిన్నర నుంచి కాలనీలో కుక్కల బెడద మరీ ఎక్కువగా ఉంది.
శునకాలు పదుల సంఖ్యలో సంచరిస్తూ ఇప్పటికే 50 మందిపై దాడి చేసి గాయపర్చాయి. ఆందోళన చెందిన కాలనీవాసులు అసోసియేషన్‌కు మొర పెట్టుకున్నారు. కొందరు రోడ్ల మీదనే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం వల్ల అవి కాలనీలో తిష్ట వేశాయని, కనిపించిన ప్రతి ఒక్కరిపై దాడి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఇప్పటికే పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా నమోదయ్యాయి. ప్రజల ఆవేదన దృష్టిలో పెట్టుకుని మధురానగర్‌కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ విధమైన ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
వీధి కుక్కలను తమ ఇంటి వద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని అందించినట్టయితే వాటికి కడుపు నిండుతుందని, కాలనీవాసులకు రక్షణ ఉంటుందని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశామని అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు. ఇప్పటికైనా కుక్కల ప్రేమికులు కాలనీవాసుల సమస్యను కూడా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. పెంపుడు కుక్కలు వీధుల్లో మల విసర్జన చేస్తే తక్షణమే యజమానులు వాటిని తొలగించాలని కోరారు. కాలనీ వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసిన ప్రజలు అసోసియేషన్‌కు అభినందనలు తెలియజేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment