సాక్షి, సిద్దిపేట : రియల్ ఎస్టేట్ రంగంలోకి ‘సుడా’ (సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ) అడుగు పెడుతోంది. గతేడాది డిసెంబర్ 9న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 234 ప్రకా రం సిద్దిపేట పట్టణ శివారులోని మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్‌తో మోడల్ లే అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది.
ఓ వైపు పర్యాటకంగా, మరోవైపు సాగు జలాలు, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా రానుంది. పట్టణ శివారులో ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు వెంచర్లు చేసి విక్రయిస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్ పెరిగింది. శనివారం సుడా మోడల్ టౌన్‌షిప్‌పై సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
10 మంది రైతులు.. 14 ఎకరాలు
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో అసైన్డ్ భూములు కలిగిన పది మంది రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమి కోల్పోతున్న రైతుకు డెవలప్ మెంట్ చేసిన టౌన్‌షిప్‌లో 800 గజాల స్థలం ఇస్తారు. 14 ఎకరాల భూమిలో 67,760 గజాల భూమి తేలింది. ప్రధాన రోడ్డు 60 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లతో నిర్మా ణాలు చివరి దశలో ఉన్నాయి.
రోడ్లకు 23,907 గజాలు, పార్కులకు 6,098 గజాలు, ఇతర మౌలిక సదుపాయాలకు 2,391 గజాలు వినియోగిస్తున్నారు. దీంతో 35,360 గజాల స్థలం మిగిలింది. దీనిని 161 ప్లాట్లుగా విభజించారు. అందులో 10 మంది రైతులకు 50 ప్లాట్లు, 111 ప్లాట్లు సుడాకు మిగులుతాయి. స్ట్రీట్ లైట్‌లు, పార్కులు, మొక్కల పెంపకం,తాగునీటి సౌకర్యం.. ఇలా సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్ ఏర్పాటు చేస్తున్నారు.
నేడు ప్రీబిడ్ మీటింగ్
ఈ నెల 29న తొలి విడతలో 101 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రీబిడ్ మీటింగ్‌ను శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాట్లు కొనుగోలు చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వ ధరగా రూ.8 వేలు నిర్ణయించారు. ఆ ధర నుంచి సుడా అధికారులు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలి. కాగా, ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడతారు.
సకల సౌకర్యాలతో లే అవుట్ –రమణాచారి, సుడా వైస్ చైర్మన్ (19ఎస్‌డీపీ12)
జీఓ 234 ప్రకారం రాష్ట్రంలోనే తొలి సారిగా అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం. వేలంపాట ద్వారా ప్లాటు దక్కించుకున్న వారు వారంరోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలి. మిగతా డబ్బులు 60 రోజుల్లో చెల్లించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విశాలమైన అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, పార్కుల వంటి సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment