SUDA
-
రియల్ రంగంలోకి ‘సుడా’
సాక్షి, సిద్దిపేట : రియల్ ఎస్టేట్ రంగంలోకి ‘సుడా’ (సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ) అడుగు పెడుతోంది. గతేడాది డిసెంబర్ 9న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 234 ప్రకా రం సిద్దిపేట పట్టణ శివారులోని మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్తో మోడల్ లే అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఓ వైపు పర్యాటకంగా, మరోవైపు సాగు జలాలు, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా రానుంది. పట్టణ శివారులో ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు వెంచర్లు చేసి విక్రయిస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్ పెరిగింది. శనివారం సుడా మోడల్ టౌన్షిప్పై సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 10 మంది రైతులు.. 14 ఎకరాలు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో అసైన్డ్ భూములు కలిగిన పది మంది రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమి కోల్పోతున్న రైతుకు డెవలప్ మెంట్ చేసిన టౌన్షిప్లో 800 గజాల స్థలం ఇస్తారు. 14 ఎకరాల భూమిలో 67,760 గజాల భూమి తేలింది. ప్రధాన రోడ్డు 60 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లతో నిర్మా ణాలు చివరి దశలో ఉన్నాయి. రోడ్లకు 23,907 గజాలు, పార్కులకు 6,098 గజాలు, ఇతర మౌలిక సదుపాయాలకు 2,391 గజాలు వినియోగిస్తున్నారు. దీంతో 35,360 గజాల స్థలం మిగిలింది. దీనిని 161 ప్లాట్లుగా విభజించారు. అందులో 10 మంది రైతులకు 50 ప్లాట్లు, 111 ప్లాట్లు సుడాకు మిగులుతాయి. స్ట్రీట్ లైట్లు, పార్కులు, మొక్కల పెంపకం,తాగునీటి సౌకర్యం.. ఇలా సకల సౌకర్యాలతో మోడల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నారు. నేడు ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 29న తొలి విడతలో 101 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రీబిడ్ మీటింగ్‌ను శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాట్లు కొనుగోలు చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వ ధరగా రూ.8 వేలు నిర్ణయించారు. ఆ ధర నుంచి సుడా అధికారులు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలి. కాగా, ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడతారు. సకల సౌకర్యాలతో లే అవుట్ –రమణాచారి, సుడా వైస్ చైర్మన్ (19ఎస్డీపీ12) జీఓ 234 ప్రకారం రాష్ట్రంలోనే తొలి సారిగా అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం. వేలంపాట ద్వారా ప్లాటు దక్కించుకున్న వారు వారంరోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలి. మిగతా డబ్బులు 60 రోజుల్లో చెల్లించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విశాలమైన అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, పార్కుల వంటి సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తాం. -
మంత్రి అనుచరుడే సుడా చైర్మన్!
సాక్షి, ఖమ్మం టౌన్: స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ (సుడా) చైర్మన్‌గా సీనియర్ టీఆర్ఎస్ నాయకులు, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ముఖ్య అనుచరుడు బచ్చు విజయ్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపల్ వ్యవహారాల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా విజయ్‌కుమార్ నియామక ఉత్తర్వులు అందుకున్నారు. సుడా చైర్మన్‌తో పాటు అడ్వైజరీ కమిటీని కూడా గురువారం ప్రకటించారు. (విషాదం మిగిల్చిన విద్యుత్‌షాక్) -
చేతల్లో సుక్కలు.. మాటల్లో డాబులు!
పథకం ఉంటుంది.. పనులు జరగవు. జీఓలు జారీ చేస్తారు.. కానీ డబ్బులు విదల్చరు. మాటలు కోటలు దాటుతాయి.. పనులు మాత్రం పాతాళంలో ఉంటాయి. టీడీపీ మార్కు పనితీరు ఇది. శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా) ఏర్పాటులో ఆ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. కేవలం ఎన్నికల కోసం, జనాలను మభ్యపెట్టడం కోసం ఎలక్షన్లకు రెండు నెలల ముందు సుడా ఏర్పాటు చేశారు. వాస్తవానికి దీనికి ఒక్క పైసా కూడా ఇచ్చిన పాపాన పోలేదు. కేవలం కాగితాల వరకు పనులు కానిచ్చి ఎన్నికల్లో ప్రచారాస్త్రంగా వాడుకుని పబ్బం గడిపేద్దామని బృహత్తర ప్రణాళిక వేసుకున్నారు. కానీ జన చైతన్యం ముందు వారి తెలివి ఎందుకూ కొరగాకుండా పోయింది. సాక్షి, శ్రీకాకుళం : ఐదేళ్లు గడిచిపోయాయి.. జిల్లాకు ఏమీ చేయలేదు. ఇలా ఓట్లు అడగానికి వెళ్తే బాగోదు.. ఇంకెందుకు లేటు ఓ జీఓ జారీ చేసేశారు. పేరు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(సుడా). విధివిధానా లు లేవు. నిధులు అసలే లేవు. కేవలం కాగితాలతోనే పనికానిచ్చేశారు. టీడీపీ నేతలు వేసన ఈ పాచిక ఎన్నికల్లో పారలేదు. దీంతో సుడాను గత ప్రభుత్వ నేతలు మధ్యలోనే వదిలేశారు. ఓట్ల కోసం ప్రజల్ని ఊహల్లో ఊరేగించారే తప్ప కార్యరూపంలోకి తీసుకురాలేదు. కేవలం కాగితాలకే పరిమితమైన సుడాను ఏం చేయాలన్నదానిపై ప్రస్తుత ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఒక్క పైసా కేటాయించకుండా పట్టణాభివృద్ధి పేరుతో ఎన్నికలకు రెండు నెలల ముందు(ఫిబ్రవరి 12న) శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (సుడా) ఏర్పాటు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాల్టీలు, 28 మండలాలు, 1264 గ్రామాలను కలుపుతూ 20.58లక్షల జనాభాతో పట్టణాభివృద్ధి సంస్థను ప్రకటించా రు. జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా, డిస్ట్రిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి(డీటీసీపీఓ)ను ప్లానింగ్ అధికారిగా, డీటీసీపీఓ సిబ్బందిని సు డా సిబ్బందిగా నియమిస్తూ జీవో జారీ చేశారు. కానీ అది కాగితానికే పరిమితమైంది. సుడా తరఫున ఒక్క రూపాయి విడుదల చేయలేదు. ఒక్క భవనాన్ని నిర్మించలేదు. బ్యాంకు ఖాతా ప్రా రంభిస్తే నిధులు విడుదల చేస్తానంటూ చెప్పా రు. దీంతో అధికారులు ఐసీఐసీఐలో బ్యాంకు ఖాతా తెరిచారు. కానీ ప్రభుత్వ ఒక్క పైసా జమ చేయలేదు. కాకపోతే భవన క్రమబద్ధీకరణ, లేఅవుట్ అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకోవాలంటూ ఆదేశాలు మాత్రం ఇచ్చారు. మున్సిపాల్టీల వారీగా బీపీఎస్, ఎల్పీఎస్ తది తర దరఖాస్తులు అన్నింటిని సుడాకే పంపాలని ఆదేశాల్లో పేర్కొంది. సుడా పేరుతో చెలరేగిపోయిన టీడీపీ నేతలు సుడా ఏర్పాటైందని భవన క్రమబద్ధీకరణ, లే అవుట్ అనుమతుల కోసం జిల్లాలోని మండలాలు, మున్సిపాల్టీల నుంచి దరఖాస్తులొచ్చా యి. ఇదే అవకాశంగా టీడీపీ నేతలు మరింత చెలరేగిపోయారు. ప్రభుత్వమే సుడా ఏర్పాటు చేసినందున ఏదో ఒక రకంగా అనుమతులు తెచ్చుకోవచ్చని ముందస్తుగా పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్లు వేసేశారు. సుడా అనుమతులొచ్చాయ ని అందమైన బ్రోచర్లతో ప్రచారం సాగించి, ప్లా ట్ల విక్రయాలు చేసేశారు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు, రాజాం, నరసన్నపేట, ఇచ్ఛాపురం తదితర ప్రాంతాల్లో విచ్చలవిడిగా లేఅవుట్లు వేసి అమ్మకాలు సాగించారు. సుడా ఏర్పాటైన తర్వాతే 75వరకు అనధికార లే అవుట్లు వేసినట్టుగా తెలుస్తున్నది. అధికారంలో ఉన్నాం ఎలా వేసినా ఫర్వా లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు చెల్లించకుండా, సామాజిక స్థలా లు కే టాయించకుండా ఇష్టారీతిన లేఅవుట్లు వేశారు. కానీ స్పష్టత, విధివిధానాలు లేకపోవడంతో వచ్చిన దరఖాస్తులను అధికారులు పరిష్కరిం చలేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. ఒక్క పైసా లేకుం డా పట్టణాభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయడం చరిత్రలో ఎప్పుడూ లేదని సాక్షాత్తు అధికార వర్గాలే ముక్కున వేలేసుకున్నాయి. ప్రచారం కోసం, ప్రజల్ని మభ్యపెట్టేందుకు వేసిన ఎత్తుగడ, వ్యూహాత్మక పన్నాగం తప్ప సుడాతో ఒరి గిందేమీ లేకుండా పోయింది. దీంతో సుడా ఏర్పాటే ప్రశ్నగా మిగిలిపోయింది. గత పాపాలను సరిదిద్దే పనిలో.. అసలు సుడా ఉందా? లేదా అన్న అనుమానాలొచ్చేలా గత ప్రభుత్వం వ్యవహరించింది. ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో 94 మంది నుం చి దరఖాస్తులు వచ్చాయి. కాకపోతే, వాటిని ఎలా పరిష్కరించాలి? ఏం చేయాలి? అన్న దానిపై స్పష్టమైన విధివిధానాలు జారీ చేయలేదు. ఉండటానికి భవనమే లేకపోవడంతో అధికారులు ముందుకెళ్లలేకపోయారు. ఇదంతా గమనించిన కొత్త ప్రభుత్వం ఒక్కసారిగా అవాక్కయింది. పైసా లేకుండా ఏర్పాటు చేసిన సంస్థతో ప్రయోజనమేంటన్న అభిప్రాయాని కొచ్చింది. స్పష్టత లేని పరిస్థితుల్లో సుడా కార్యకలాపాలు నిలిపివేయాలని ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. బీపీఎస్, ఇతరత్రా కార్యకలాపాలను మున్సిప ల్ ఆర్డీడీ, డిస్ట్రిక్ట్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అ«ధికారికి పంపిం చాల్సిందిగా ఆదేశాల్లో పేర్కొన్నారు. కాగితా నికి పరిమితమై అస్పష్టంగా ఉన్న సుడా వ్యవహారాన్ని పక్కన పెట్టి ఇంతవరకు వచ్చిన దరఖాస్తులకు సంబంధిత మున్సిపాల్టీలకు పంపిం చి, వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. సుడా కార్యలాపాలు నిలిపివేశాం స్పష్టత లేకపోవడం, ప్రత్యేక కార్యాలయం, పైసా నిధులు లేకపోవడంతో అయోమయంగానే సుడా ఉండేది. ఈ నేపథ్యంలో కొత్త ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సుడా కార్యకలాపాలు నిలిపివేసి, బీపీఎస్, లేఅవుట్ అనుమతుల తదితర దరఖాస్తుల పరిష్కార బాధ్యతను మళ్లీ మున్సిపల్ ఆర్డీ,డీటీసీపీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు ఆ రకంగానే చర్యలు తీసుకుంటున్నాం. – పి.నాయుడు, డిస్ట్రిక్ టౌన్ కంట్రీ ప్లానింగ్ అధికారి -
రాజకీయం ముద్దు.. నగరాభివృద్ధి వద్దు
లెక్కలు తేలలేదు.. సమన్వయం కుదరలేదు.. పాలకమండలి ఏర్పాటుకు కాలం కలిసిరాలేదు.. ప్రగతిని విస్మరిస్తూ అధికార పార్టీ రాజకీయఅవసరాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో శ్రీకాకుళం నగరాభివృద్ధి సంస్థ (సుడా) ఇంకా ప్రాణంపోసుకోలేదు. శ్రీకాకుళం: సుడాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి సుమారు 25 రోజులకు పైబడుతున్నా నేటి వరకూ ఉత్తర్వులు వెలువరించలేదు. జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చని కొద్ది రోజులుగా ప్రచా రం జరుగుతోంది. ఉత్తర్వులతో పాటు పాలకమండలిని కూడా నియమించాలని ప్రభుత్వం యో చించింది. ఇందుకుగాను పేర్లను సూచించాలని జిల్లా నాయకులను కోరగా వారి మధ్య సమన్వయం కుదరకపోవడంతో పాలక మండలి నియామకం పెండింగ్‌లో పడింది. దీని కారణంగానే ఉత్తర్వులు వెలువడలేదని తెలు స్తోంది. పాలకమండలిలో చైర్మన్లతోపాటు సభ్యుల నియామకాన్ని చేపట్టాల్సి ఉంది. సుడాను ఏర్పాటు చేసి పాలకమండలిని నియమిస్తే శ్రీకాకుళం నగరానికి చెందిన నాయకుడినే చైర్మన్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ శ్రీకాకుళం నగరానికి చెందిన నాయకులకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని అసంతృప్తిదేశం శ్రేణుల్లో ఉంది. తొలి నుంచి తెలుగుదేశం కళింగ కోమట్లకు మేయర్ పదవి ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ కార్పొరేషన్‌కు ఎన్నికలే నిర్వహించలేకపోవడంతో దానిని అమలు చేయలేకపోయింది. ఇపుడు సుడా పాలకవర్గాన్ని నియమించే పక్షంలో చైర్మన్‌గా ఆ సమాజిక వర్గానికే అవకాశం ఇవ్వాలని మంత్రి పట్టుబట్టగా దానికి మరో మంత్రి అభ్యంతరం చెప్పినట్లు భోగట్టా. స్థానిక ప్రజాప్రతినిధి కూడా.. ఆ సామాజిక వర్గానికి తర్వాత మేయర్ పదవి ఇవ్వవచ్చని.. సుడా చైర్మన్‌గా తాము సూచించిన వారినే నియమించాలని పట్టుబడుతూ తమకు అనుకూలంగా ఉన్న మంత్రిని ఆశ్రయించడంతో పాలకమండలి నియామకం పెండింగ్‌లో పడిందని దేశం వర్గాలే చెబుతున్నాయి. సుడా ఏర్పడితే నగరాభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా ప్రజాప్రతినిధులు వారి మధ్య ఉన్న అభిప్రాయభేదంతో సుడా ఏర్పడకుండా అడ్డు తగులుతున్నట్లు సాక్షాత్తు అధికార పక్షం నేతలు వాపోతున్నారు. సుడాను ఏర్పాటు చేసి పాలకమండలిని నియమిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాన్ని విశేషంగా అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వానికి, జిల్లా ప్రజాప్రతినిధులకు సుడా ఏర్పాటులో చిత్తశుద్ధి లేకపోవడంతో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. రిమ్స్ పాలకమండలిదీ ఇదే పరిస్థితి.. శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల పాలకమండలి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఏర్పడకుండా ఉండిపోయింది. సుమారు నాలుగేళ్ల క్రితం రిమ్స్ పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు జరిగింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే పాలకమండలి కోసం కొన్ని పేర్లను సూచించగా.. దానికి మంత్రి అభ్యంతరం తెలుపుతూ మరికొన్ని పేర్లు సూచించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తన నియోజకవర్గంలో ఉన్న రిమ్స్ పాలకమండలిలో తాను సూచించిన వారినే నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధి పట్టుపట్టగా.. జిల్లాస్థాయి ఆసుపత్రి, వైద్య కళాశాల కావడంతో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని మంత్రి వాదిస్తున్నారు. దీంతో పాలకమండలి ఏర్పాటు కాకుండా ఉండిపోయింది. దీని వలన రిమ్స్‌పై పర్యవేక్షణ కొరవడింది. రిమ్స్ అధికారులలో జవాబుదారీతనం కనిపించడం లేదు. ప్రజలకు మేలైన సౌకర్యాలు అందకుండా ఉండిపోయాయి. ప్రతి మూడు నెలలకు జరగాల్సిన పాలకమండలి సమావేశం ఏడాదికి ఒకసారో, ఏడాదిన్నరకొకసారో కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నా తమకేమిటన్న తరహాలో అధికారపక్ష ప్రజాప్రతినిధులు తమ పం తాలను నెగ్గించుకునేందుకు పాలకమండలి నియామకం జరగకుండా అడ్డుపడుతుండడంపట్ల సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. సుడా, రిమ్స్ పాలకమండళ్ల నియామకం ఎప్పటికి జరుగుతుం దో వేచిచూడాల్సిందే. -
సుడా.. ఏదీ ప్రగతి జాడ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: ఇప్పటివరకు హైదరాబాద్, వరంగల్‌కు మాత్రమే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో మూడో పెద్ద నగరంగా పేరొందిన కరీంనగర్ అభివృద్ధి కోసం ‘సుడా’ను ఏర్పాటు చేస్తామని ప్రకటించడంతో ప్రగతి జాడలు కన్పిస్తాయని అందరూ ఆశించారు. ‘సుడా’ ప్రకటించిన ప్రభుత్వం అదేరోజూ తాత్కాలిక కమిటీని కూడా నియమించింది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ వైస్‌చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యే, సీడీఎంఏ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీటీసీపీలు మెంబర్లుగా కమిటీ వేశారు. సుడా పరిధిలోకి వచ్చే మరో ఎమ్మెల్యేలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. నగర పాలక సంస్థ 50 డివిజన్లతో పాటు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 మండలాల పరిధిలోని 71 గ్రామాలను పట్టణాభివృద్ధి సుడాలో చేర్చారు. ప్రసుత్తం నగర జనాభా 3.15 లక్షలుగా ఉంది. సుడా పరిదిలోకి 71 గ్రామాలను కలిపితే జనాభా 6.12 లక్షల పైచిలుకుకు చేరింది. ఈ వివరాలన్నింటితో ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేయగా.. ఇప్పటివరకు కనీసం ‘సుడా’ కార్యాలయం ఏర్పాటు చేయలేదు. ప్రగతిజాడ కనిపించకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారింది. ‘సుడా’ వేగం పెరిగితేనే అభివృద్ధి.. పక్కాగా ‘మాస్టర్‌ప్లాన్’ శాతవాహన అర్బన్ అథారిటీ ఏర్పాటుతో గ్రామాల అభివృద్ధి వేగంగా జరగనుంది. ఇప్పటివరకు గ్రామ, నగరస్థాయిలో ఎవరికి తగినట్లు వారికి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. సుడాతో నగరానికి ధీటుగా అన్ని గ్రామాలకు సైతం సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 30 ఏళ్ల జనాభాకు తగ్గట్టుగా మాస్టర్‌ప్లాన్ తయారు చేసి ఆ దిశగా అభివృద్ధి చేపట్టనున్నారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామపంచాయితీలు అనుమతులు జారీ చేసేవి. నగరం, గ్రామాలకు మధ్య వ్యత్యాసాలు ఉండేవి. సుడా ఏర్పాటుతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం గ్రామాల్లో సైతం 60 ఫీట్లరోడ్లు, పక్కా డ్రైనేజీలు, వాటర్పైపులైన్లు, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ, భౌతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. అర్బన్ అథారిటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. నగరం, గ్రామాలు ఒకేప్లానింగ్ ప్రకారం అభివృద్ధి చెందనున్నాయి. అర్బన్ అథారిటీ అభివృద్ధికి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. చైర్మన్, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనాలు, కళాశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలు, మార్కెట్లు, హరితస్థలాలు, జలవనరులు, పార్కులు, వ్యాపార కేంద్రాలు, ఎలగందుల ఖిల్లా, భవిష్యత్తుల్లో నిర్వహించనున్న మానేరు రివర్‌ఫ్రంట్ నిర్వహణ బాధ్యతలు సైతం సుడాకే దక్కనున్నాయి. పాలకవర్గం ఏర్పాటుకూ రాజకీయ గ్రహణం ముఖ్యమంత్రి కేసీఆర్ సుడా ఏర్పాటుకు ఆమోదముద్ర వేసి.. అక్టోబర్ 24న జీవో ప్రతులను వెలువరించారు. ‘సుడా’ పీఠం కీలకమైందిగా మారడం.. చైర్మన్ పదవిని టీఆర్ఎస్ నాయకుల్లో చాలామంది ఆశించడంతో పోటీ మొదలైంది. టీఆర్ఎస్లో పార్టీ ప్రారంభం నుంచి ఉంటున్న జీవీ.రామక్రిష్ణారావు పేరు ఖరారైనట్లు వినిపించింది. కట్ల సతీష్, వై.సునీల్‌రావు కూడా ఎవరి స్థాయిలో వారు రాజధానిలో తమ పలుకుబడిని ఉపయోగించి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం కూడా జరిగింది. మానకొండూర్ నియోజకవర్గానికి చెందిన జీవీ.రామక్రిష్ణారావు పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నారు. ఇప్పటివరకు పార్టీ పదవులు తప్ప ఎలాంటి నామినేటెడ్ పదవులూ వరించలేదు. ఆ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశాలు కూడా లేకపోవడంతో పార్టీ కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అధిష్టానంతో చనువుగా ఉండడం, పార్టీలో అగ్రనాయకత్వంతో కూడా సంబంధాలు, బంధుత్వాలు ఉండడంతో సుడా చైర్మన్ ఆయననే వరించే అవకాశం మెండుగా ఉందని ప్రచారం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభల హడావుడి అయిపోగానే రామక్రిష్ణారావు చైర్మన్‌గా తొమ్మిదిమందితో కమిటీ వేసే అవకాశం ఉందని పార్టీవర్గాలు కూడా భావించాయి. కానీ.. రెండు నెలలు కావస్తున్నా రాజకీయ జోక్యం కారణంగా ఇప్పటికీ ‘సుడా పాలకవర్గంపై మాత్రం సాగుతున్న సస్పెన్స్ తొలగడం లేదు. ‘సుడా’ పరిధిలోకి వచ్చే గ్రామాలు.. మండలాలవారీగా కరీంనగర్ అర్బన్ మండలం: కరీంనగర్ పట్టణం కొత్తపల్లి: సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లి(హవేలి), లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల. కరీంనగర్ రూరల్: వల్లంపహాడ్, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, మగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్, జూబ్లీనగర్, ఎలబోతారం. మానకొండూర్: మానకొండూర్, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్. తిమ్మాపూర్: తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎన్), నుస్తులాపూర్, నేదునూర్, పచ్చునూర్, మన్నెంపల్లి. గన్నేరువరం: చెర్లాపూర్, సంగెం, గోపాల్పూర్, పంతులుకొండాపూర్, పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్ల, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి. రామడుగు: వన్నారం, కొక్కెరకుంట, దేశ్రాజ్పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల. చొప్పదండి: కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, ఒద్యారం. ప్రభుత్వానికి ప్రతిపాదనలు కరీంనగర్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ‘సుడా’ను ప్రకటించింది. ఈ మేరకు కార్యాలయం ఏర్పాటు, సిబ్బంది వివరాలతో ప్రభుత్వానికి లేఖ రాశాం. అక్కడినుంచి వచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కార్యాచరణ చేపడతాం. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సుడా కార్యకలాపాలు సాగుతాయి. – కె.శశాంక, కార్పొరేషన్ కమిషనర్ సుడా కమిటీ ఏర్పాటు చేయాలి అక్టోబర్ 24 సుడాను ప్రకటించిన ప్రభుత్వం ఇంతవరకూ కమిటీని ప్రకటించలేదు. మానకొండూర్ మండలంలోని సదాశివపల్లి, శ్రీనివాస్‌నగర్, జగ్గయ్యపల్లి, ఈదులగట్టెపల్లి, చెంజర్ల, ముంజంపల్లి గ్రామాలు సుడా పరిధిలోకి వెళ్లాయి. సుడా పరిధిలోకి వెళ్లడంతో ఈ గ్రామాల్లో మరింత అభివృద్ధి జరుగనుంది. సుడా కమిటీని ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేయాలి. - జక్కం రామలింగం, రిటైర్డు ఉపాధ్యాయుడు, మానకొండూర్ అమలు చేస్తే బాగుంటుంది ప్రభుత్వం కరీంనగర్ నగరంతోపాటు శివారు గ్రామాలను కలుపుతూ సుడాగా ఎంపిక చేయడం హర్షణీయం. అయితే మూడునెలలు గడుస్తున్నా ఓ రూపం తేవకపోవడం విచారకరం. తక్షణమే పాలకవర్గాన్ని నియమించి అధికారాలు బదలాయించి అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తే బాగుంటుంది. –శాతర్ల క్రిష్ణయ్య, రిటైర్డు ఉద్యోగి అభివృద్ది వేగవంతం సుడా ఎంపిక సబబే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధుల కేటాయింపు ఉంటుంది. తద్వారా అభివృద్ధి వేగవంతమవుతుంది. ప్రభుత్వం సుడా ఏర్పాటుపై దృష్టిసారించి ప్రత్యేక కార్యాలయం, పాలకవర్గాన్ని నియమించాలి. రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తే ఫలితాలు బాగుంటాయి. – మండల రాజలింగం,రిటైర్డు తహసీల్దార్ -
కరీంనగర్ సిగలో ‘సుడా’
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కార్పొరేషన్: కరీంనగర్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు గల నగరంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ, అమృత్‌సిటీ హోదాతో అభివృద్ధి పథంలోకి అడుగులు పడుతుండగా, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీతో ప్లాన్సిటీగా, మాస్టర్ ప్లాన్ గ్రామాలుగా సుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందనున్నాయి. రెండేళ్లుగా సుడా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తుండగా, ఈ ఏడాది జూలై 5న సీఎం కేసీఆర్ సుడా ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌కు మాత్రమే ఇప్పటివరకు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో మూడో పెద్ద నగరంగా పేరొందిన కరీంనగర్ అభివృద్ధికి సుడాను ఏర్పా టు చేయడంతో ప్రగతి జాడలు కనిపిస్తున్నాయి. సుడా పరిధిలోకి 50 డివిజన్లతోపాటు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 మండలాల పరిధిలోని కరీంనగర్ పట్టణంతోపాటు 71 గ్రామాలను పట్టణాభివృద్ధి సంస్థలోకి చేర్చా రు. ప్రసుత్తం నగర జనాభా 3.15 లక్షలుగా ఉంది. సుడా పరిధిలోకి 71 గ్రామాలను కలిపితే 7 లక్షల పైచిలుకు జనా భాకు చేరుతోంది. కరీంనగర్ జిల్లా పరిధిలో 16 మండలాలు ఉంటే 8 మండలాల పరిదిలోని గ్రామాలు సుడా పరిధిలోకి చేర్చారు. కాగా.. ‘సుడా’ జీవోను మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావు, ఎమ్మెల్యేలు గంగు ల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగె శోభకు ముఖ్య మంత్రి కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో అందజేయగా, వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. వేగంగా జరగనున్న అభివృద్ధి.. అర్బన్ అథారిటీ ఏర్పాటుతో కరీంనగర్ దశ దిశ మారనుంది. గ్రామాల అభివృద్ధిలో వేగం పుంజుకోనుంది. ఇప్పటివరకు గ్రామ, నగర స్థాయిలో ఎవరికి తగినట్లు వారికి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. సుడాతో నగరానికి దీటుగా అన్ని గ్రామాలకు కూడా సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 30 ఏళ్ల జనాభాకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ దిశగా అభివృద్ధి చేపట్టనున్నారు. గ్రీనరీ, లేఅవుట్ల అమలు, రహదారుల విస్తరణ, భవన నిర్మాణాలు, కార్మాగారాలు, సామాజిక భనవ నిర్మాణాలకు నిర్దేశించిన స్థలాల్లోనే అనుమతులు ఇస్తారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామపంచాయతీలు అనుమతులు జారీ చేసేవి. నగరానికి, గ్రామాలకు మధ్య వ్యత్యాసాలు ఉండేవి. సుడా ఏర్పాటుతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం గ్రామాల్లో కూడా 60 ఫీట్ల రోడ్లు, పక్కా డ్రెయినేజీలు, వాటర్పైపులైన్లు, టెలికమ్యూనికేషన్ వ్యవ స్థ, భౌతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది. స్వతంత్ర ప్రతిపత్తితో.. అర్బన్ అథారిటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. నగరం, గ్రామాలు ఒకే ప్లానింగ్ ప్రకారంగా అభివృద్ధి చెందనున్నాయి. అర్బన్ అథారిటీ అభివృద్ధికి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. చైర్మన్, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనాలు, కళాశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలు, మార్కెట్లు, హరితస్థలాలు, జలవనరులు, పార్కులు, వ్యాపార కేంద్రాలు, ఎలగందుల ఖిల్లా, భవిష్యత్తులో నిర్వహించనున్న మానేరు రివర్‌ఫ్రంట్ నిర్వహణ బాధ్యతలు కూడా సుడాకే దక్కనున్నాయి. ‘సుడా’కు కమిటీ ఏర్పాటు.. కలెక్టర్ సర్ఫరాజ్ చైర్మన్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అధికారులతో కమిటీని నియమించింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ శశాంక వైస్‌చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యే, సీడీఎంఏ, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీటీసీపీలు మెంబర్లుగా కమిటీని నియామకం చేశారు. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆశావాహుల్లో నెలకొన్న సందడి.. సుడాకు జీవో జారీ కావడంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. జూలైలో సుడాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి ఎవరి పరిధిలో వారు పావులు కదుపుతున్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో మంతనాలు జరుపుతూ సీఎం పేషీలో పైరవీలు చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం జీవోలో అధికారులతోనే కమిటీ వేయడంతో, అనధికారిక, నామినేటెడ్ పోస్టులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా ‘సుడా’ జీవో విడుదలైన నేపథ్యంలో చైర్మన్ కోసం అధికారపక్షంలో అప్పుడే రాజకీయ సందడి కనిపిస్తోంది. ‘సుడా’ పరిధిలోకి వచ్చే ప్రతిపాదిత గ్రామాలు.. కరీంనగర్ అర్బన్ మండలం : కరీంనగర్ పట్టణం ► కొత్తపల్లి మండలం : సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల. ► కరీంనగర్ రూరల్ మండలం : వల్లంపహాడ్, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, ముగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్,జూబ్లీనగర్, ఎలబోతారం. ► మానకొండూర్ మండలం : మానకొండూర్, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్. ► తిమ్మాపూర్ మండలం : తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎన్), నుస్తులాపూర్, నేదునూర్, వచ్చునూర్, మన్నెంపల్లి. ► గన్నేరువరం మండలం : చెర్లాపూర్, సంగెం, గోపాల్పూర్, పంతులుకొండాపూర్, పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్ల, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి. ► రామడుగు మండలం : వన్నారం, కొక్కెరకుంట, దేశ్రాజ్పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల. ► చొప్పదండి మండలం : కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, ఒద్యారం. -
‘నుడా’ గెజిట్ విడుదల
30 రోజుల్లో అభ్యంతరాలు సమర్పించాలి నెల్లూరు(పొగతోట): నెల్లూరు అర్బన్ డవలప్మెంట్ అథారిటీ (నుడా)ను నెల్లూరు గెజిట్‌లో విడుదల చేశారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు బుధవారం నుడా గెజిట్ నంబర్ 91ని విడుదల చేశారు. నెల్లూరు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి నెల్లూరు కార్పొరేషన్, కావలి, గూడూరు, సూళ్లూరుపేట, నాయుడుపేట మున్సిపాలిటీలు, 21 మండలాలు 156 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నెల్లూరు జిల్లాలో 19 మండలాలు 145 గ్రామాలు, చిత్తూరు జిల్లాకు సంబంధించి 2 మండలాలు 11 గ్రామాలు నుడా పరిధిలో ఉన్నాయి. నుడాకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచి 30 రోజులలోపు ప్రజలు అభ్యంతరాలు తెలియజేయవచ్చు. జిల్లా యంత్రాంగం ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించి ప్రభుత్వానికి నివేదికలు అందజేస్తారు.