శ్రీకాకుళం నగర ముఖ చిత్రం
లెక్కలు తేలలేదు.. సమన్వయం కుదరలేదు.. పాలకమండలి ఏర్పాటుకు కాలం కలిసిరాలేదు.. ప్రగతిని విస్మరిస్తూ అధికార పార్టీ రాజకీయఅవసరాలకే ప్రాధాన్యం ఇవ్వడంతో శ్రీకాకుళం నగరాభివృద్ధి సంస్థ (సుడా) ఇంకా ప్రాణంపోసుకోలేదు.
శ్రీకాకుళం: సుడాను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి సుమారు 25 రోజులకు పైబడుతున్నా నేటి వరకూ ఉత్తర్వులు వెలువరించలేదు. జాయింట్ కలెక్టర్‌ను వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చని కొద్ది రోజులుగా ప్రచా రం జరుగుతోంది. ఉత్తర్వులతో పాటు పాలకమండలిని కూడా నియమించాలని ప్రభుత్వం యో చించింది. ఇందుకుగాను పేర్లను సూచించాలని జిల్లా నాయకులను కోరగా వారి మధ్య సమన్వయం కుదరకపోవడంతో పాలక మండలి నియామకం పెండింగ్‌లో పడింది. దీని కారణంగానే ఉత్తర్వులు వెలువడలేదని తెలు స్తోంది. పాలకమండలిలో చైర్మన్‌లతోపాటు సభ్యుల నియామకాన్ని చేపట్టాల్సి ఉంది. సుడాను ఏర్పాటు చేసి పాలకమండలిని నియమిస్తే శ్రీకాకుళం నగరానికి చెందిన నాయకుడినే చైర్మన్‌గా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఇతర ప్రాంతాలకు చెందిన వారిని కూడా నియమించే అవకాశం ఉన్నప్పటికీ శ్రీకాకుళం నగరానికి చెందిన నాయకులకు ఇప్పటి వరకూ న్యాయం జరగలేదని అసంతృప్తిదేశం శ్రేణుల్లో ఉంది. తొలి నుంచి తెలుగుదేశం కళింగ కోమట్లకు మేయర్ పదవి ఇస్తామంటూ ఊరిస్తూ వచ్చింది. ఇప్పటి వరకూ కార్పొరేషన్‌కు ఎన్నికలే నిర్వహించలేకపోవడంతో దానిని అమలు చేయలేకపోయింది.
ఇపుడు సుడా పాలకవర్గాన్ని నియమించే పక్షంలో చైర్మన్‌గా ఆ సమాజిక వర్గానికే అవకాశం ఇవ్వాలని మంత్రి పట్టుబట్టగా దానికి మరో మంత్రి అభ్యంతరం చెప్పినట్లు భోగట్టా. స్థానిక ప్రజాప్రతినిధి కూడా.. ఆ సామాజిక వర్గానికి తర్వాత మేయర్ పదవి ఇవ్వవచ్చని.. సుడా చైర్మన్‌గా తాము సూచించిన వారినే నియమించాలని పట్టుబడుతూ తమకు అనుకూలంగా ఉన్న మంత్రిని ఆశ్రయించడంతో పాలకమండలి నియామకం పెండింగ్‌లో పడిందని దేశం వర్గాలే చెబుతున్నాయి. సుడా ఏర్పడితే నగరాభివృద్ధికి ఎంతో అవకాశం ఉంటుందని ఆర్భాటంగా ప్రకటించిన జిల్లా ప్రజాప్రతినిధులు వారి మధ్య ఉన్న అభిప్రాయభేదంతో సుడా ఏర్పడకుండా అడ్డు తగులుతున్నట్లు సాక్షాత్తు అధికార పక్షం నేతలు వాపోతున్నారు. సుడాను ఏర్పాటు చేసి పాలకమండలిని నియమిస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నగరాన్ని విశేషంగా అభివృద్ధి చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వానికి, జిల్లా ప్రజాప్రతినిధులకు సుడా ఏర్పాటులో చిత్తశుద్ధి లేకపోవడంతో అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది.
రిమ్స్ పాలకమండలిదీ ఇదే పరిస్థితి..
శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాల పాలకమండలి కూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఏర్పడకుండా ఉండిపోయింది. సుమారు నాలుగేళ్ల క్రితం రిమ్స్ పాలకమండలి ఏర్పాటుకు కసరత్తు జరిగింది. శ్రీకాకుళం ఎమ్మెల్యే పాలకమండలి కోసం కొన్ని పేర్లను సూచించగా.. దానికి మంత్రి అభ్యంతరం తెలుపుతూ మరికొన్ని పేర్లు సూచించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. తన నియోజకవర్గంలో ఉన్న రిమ్స్ పాలకమండలిలో తాను సూచించిన వారినే నియమించాలని స్థానిక ప్రజాప్రతినిధి పట్టుపట్టగా.. జిల్లాస్థాయి ఆసుపత్రి, వైద్య కళాశాల కావడంతో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతను ఇవ్వాలని మంత్రి వాదిస్తున్నారు. దీంతో పాలకమండలి ఏర్పాటు కాకుండా ఉండిపోయింది. దీని వలన రిమ్స్‌పై పర్యవేక్షణ కొరవడింది. రిమ్స్ అధికారులలో జవాబుదారీతనం కనిపించడం లేదు. ప్రజలకు మేలైన సౌకర్యాలు అందకుండా ఉండిపోయాయి. ప్రతి మూడు నెలలకు జరగాల్సిన పాలకమండలి సమావేశం ఏడాదికి ఒకసారో, ఏడాదిన్నరకొకసారో కలెక్టర్ అధ్యక్షతన జరుగుతుంది. ఎవరి ఇబ్బందులు ఎలా ఉన్నా తమకేమిటన్న తరహాలో అధికారపక్ష ప్రజాప్రతినిధులు తమ పం తాలను నెగ్గించుకునేందుకు పాలకమండలి నియామకం జరగకుండా అడ్డుపడుతుండడంపట్ల సర్వత్రా ఆక్షేపణలు వినిపిస్తున్నాయి. సుడా, రిమ్స్ పాలకమండళ్ల నియామకం ఎప్పటికి జరుగుతుం దో వేచిచూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment