సాక్షిప్రతినిధి, కరీంనగర్/కార్పొరేషన్: కరీంనగర్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు గల నగరంగా ఎదిగేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. ఇప్పటికే స్మార్ట్ సిటీ, అమృత్‌సిటీ హోదాతో అభివృద్ధి పథంలోకి అడుగులు పడుతుండగా, అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీతో ప్లాన్‌సిటీగా, మాస్టర్ ప్లాన్ గ్రామాలుగా సుడా పరిధిలోకి వచ్చే ప్రాంతాలన్నీ పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందనున్నాయి. రెండేళ్లుగా సుడా ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేస్తుండగా, ఈ ఏడాది జూలై 5న సీఎం కేసీఆర్ సుడా ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారు. తెలంగాణలో హైదరాబాద్, వరంగల్‌కు మాత్రమే ఇప్పటివరకు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీలు ఉన్నాయి. తెలంగాణలో మూడో పెద్ద నగరంగా పేరొందిన కరీంనగర్ అభివృద్ధికి సుడాను ఏర్పా టు చేయడంతో ప్రగతి జాడలు కనిపిస్తున్నాయి. సుడా పరిధిలోకి 50 డివిజన్లతోపాటు 580 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో 8 మండలాల పరిధిలోని కరీంనగర్ పట్టణంతోపాటు 71 గ్రామాలను పట్టణాభివృద్ధి సంస్థలోకి చేర్చా రు. ప్రసుత్తం నగర జనాభా 3.15 లక్షలుగా ఉంది. సుడా పరిధిలోకి 71 గ్రామాలను కలిపితే 7 లక్షల పైచిలుకు జనా భాకు చేరుతోంది. కరీంనగర్ జిల్లా పరిధిలో 16 మండలాలు ఉంటే 8 మండలాల పరిదిలోని గ్రామాలు సుడా పరిధిలోకి చేర్చారు. కాగా.. ‘సుడా’ జీవోను మంత్రులు ఈటల రాజేందర్, కె.తారకరామారావు, ఎమ్మెల్యేలు గంగు ల కమలాకర్, రసమయి బాలకిషన్, బొడిగె శోభకు ముఖ్య మంత్రి కేసీఆర్ మంగళవారం హైదరాబాద్ ప్రగతిభవన్‌లో అందజేయగా, వారు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
వేగంగా జరగనున్న అభివృద్ధి..
అర్బన్ అథారిటీ ఏర్పాటుతో కరీంనగర్ దశ దిశ మారనుంది. గ్రామాల అభివృద్ధిలో వేగం పుంజుకోనుంది. ఇప్పటివరకు గ్రామ, నగర స్థాయిలో ఎవరికి తగినట్లు వారికి మాస్టర్ ప్లాన్ అమలులో ఉంది. సుడాతో నగరానికి దీటుగా అన్ని గ్రామాలకు కూడా సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. 30 ఏళ్ల జనాభాకు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఆ దిశగా అభివృద్ధి చేపట్టనున్నారు. గ్రీనరీ, లేఅవుట్ల అమలు, రహదారుల విస్తరణ, భవన నిర్మాణాలు, కార్మాగారాలు, సామాజిక భనవ నిర్మాణాలకు నిర్దేశించిన స్థలాల్లోనే అనుమతులు ఇస్తారు. ఇప్పటివరకు నగరపాలక సంస్థ, గ్రామీణ ప్రాంతాల్లో ఆయా గ్రామపంచాయతీలు అనుమతులు జారీ చేసేవి. నగరానికి, గ్రామాలకు మధ్య వ్యత్యాసాలు ఉండేవి. సుడా ఏర్పాటుతో మాస్టర్‌ప్లాన్ ప్రకారం గ్రామాల్లో కూడా 60 ఫీట్ల రోడ్లు, పక్కా డ్రెయినేజీలు, వాటర్‌పైపులైన్‌లు, టెలికమ్యూనికేషన్ వ్యవ స్థ, భౌతికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుంది.
స్వతంత్ర ప్రతిపత్తితో..
అర్బన్ అథారిటీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉంటుంది. నగరం, గ్రామాలు ఒకే ప్లానింగ్ ప్రకారంగా అభివృద్ధి చెందనున్నాయి. అర్బన్ అథారిటీ అభివృద్ధికి ఇండిపెండెంట్ బాడీని ఏర్పాటు చేస్తారు. చైర్మన్, అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం భవనాలు, కళాశాలలు, ఆసుపత్రులు, శ్మశానాలు, మార్కెట్లు, హరితస్థలాలు, జలవనరులు, పార్కులు, వ్యాపార కేంద్రాలు, ఎలగందుల ఖిల్లా, భవిష్యత్తులో నిర్వహించనున్న మానేరు రివర్‌ఫ్రంట్ నిర్వహణ బాధ్యతలు కూడా సుడాకే దక్కనున్నాయి.
‘సుడా’కు కమిటీ ఏర్పాటు.. కలెక్టర్ సర్ఫరాజ్ చైర్మన్
శాతవాహన అర్బన్ డెవలప్‌మెంట్ అభివృద్ధికి ప్రభుత్వం అధికారులతో కమిటీని నియమించింది. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ చైర్మన్‌గా, కార్పొరేషన్ కమిషనర్ శశాంక వైస్‌చైర్మన్‌గా, కరీంనగర్ ఎమ్మెల్యే, సీడీఎంఏ, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డీటీసీపీలు మెంబర్లుగా కమిటీని నియామకం చేశారు. అయితే.. మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా కమిటీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఆశావాహుల్లో నెలకొన్న సందడి..
సుడాకు జీవో జారీ కావడంతో ఆశావాహుల్లో సందడి నెలకొంది. జూలైలో సుడాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన నాటి నుంచి ఎవరి పరిధిలో వారు పావులు కదుపుతున్నారు. ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తో మంతనాలు జరుపుతూ సీఎం పేషీలో పైరవీలు చేస్తున్నారు. అయితే.. ప్రభుత్వం జీవోలో అధికారులతోనే కమిటీ వేయడంతో, అనధికారిక, నామినేటెడ్ పోస్టులు ఆలస్యం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదిఏమైనా ‘సుడా’ జీవో విడుదలైన నేపథ్యంలో చైర్మన్ కోసం అధికారపక్షంలో అప్పుడే రాజకీయ సందడి కనిపిస్తోంది.
‘సుడా’ పరిధిలోకి వచ్చే ప్రతిపాదిత గ్రామాలు.. కరీంనగర్ అర్బన్ మండలం : కరీంనగర్ పట్టణం
► కొత్తపల్లి మండలం : సీతారాంపూర్, రేకుర్తి, మల్కాపూర్, చింతకుంట, పద్మనగర్, కమాన్‌పూర్, కొత్తపల్లిహవేలి, లక్ష్మిపూర్, బద్దిపల్లి, నాగులమల్యాల, ఆసిఫ్‌నగర్, ఖాజీపూర్, ఎలగందుల.
► కరీంనగర్ రూరల్ మండలం : వల్లంపహాడ్, దుర్శేడ్, నగునూరు, చేగుర్తి, బొమ్మకల్, ఆరెపల్లి, ఇరుకుల్ల, ముగ్దుంపూర్, చెర్లబూత్కూర్, చామన్‌పల్లి, తాహెర్ కొండాపూర్, పకీర్‌పేట్,జూబ్లీనగర్, ఎలబోతారం.
► మానకొండూర్ మండలం : మానకొండూర్, సదాశివపల్లి, జగ్గయ్యపల్లి, శ్రీనివాస్‌నగర్, ముంజంపల్లి, ఈదులగట్టెపల్లి, అన్నారం, చెంజర్ల, లింగాపూర్.
► తిమ్మాపూర్ మండలం : తిమ్మాపూర్, అల్గునూరు, పొరండ్ల, రేణికుంట, కొత్తపల్లి (పీఎన్), నుస్తులాపూర్, నేదునూర్, వచ్చునూర్, మన్నెంపల్లి.
► గన్నేరువరం మండలం : చెర్లాపూర్, సంగెం, గోపాల్‌పూర్, పంతులుకొండాపూర్, పోత్గల్, హస్నాపూర్, యాశ్వాడ, గునుకుల కొండాపూర్, గన్నేరువరం, పారువెల్ల, కాశీంపెట, మైలారం, మాదాపూర్, జంగపల్లి.
► రామడుగు మండలం : వన్నారం, కొక్కెరకుంట, దేశ్‌రాజ్‌పల్లి, కిష్టాపూర్, వెదిర, వెలిచాల.
► చొప్పదండి మండలం : కోనేరుపల్లి, రుక్మాపూర్, కొలిమికుంట, చాకుంట, ఒద్యారం.
Comments
Please login to add a commentAdd a comment