
సాక్షి ప్రతినిధి, వరంగల్: దేశంలో కోర్టుల ఆధునీకరణతోనే ప్రజలకు సత్వర న్యాయం జరుగుతుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. దేశవ్యాప్తంగా కేసులు పెండింగ్‌లో ఉండటానికి జడ్జీల కొరత ఒక్కటే కారణం కాదని.. సరైన మౌలికవసతులు లేకుండా న్యాయమూర్తులు, న్యాయవాదులు పనిచేయలేకపోతున్నారన్నారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు పంపించినా ఇప్పటివరకు స్పందన లేదన్నారు. ఆదివారం హనుమకొండలో ఆధునిక సదుపాయాలతో నిర్మించిన 10 కోర్టుల భవన సముదాయంతోపాటు పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, ఎ.రాజశేఖర్‌రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తి, హనుమకొండ కోర్టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ పి.నవీన్‌రావు, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగ్‌రావు, వరంగల్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కేపీ ఈశ్వర్‌నాథ్, ఉపాధ్యక్షుడు మహాత్మ, ప్రధాన కార్యదర్శి విజయ్‌కుమార్, రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు జయాకర్, జనార్దన్, సంజీవరావు, న్యాయవాదులు, అధికారులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీజేఐ ప్రసంగించారు. ‘శిథిలావస్థకు చేరుకున్న కోర్టులను పునర్నిర్మించాలని సీజేఐ అయ్యాక అనుకున్నా. అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం తెప్పించాం. కోర్టుల్లో మౌలిక సౌకర్యాల ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై జూలైలో కేంద్రానికి ఇండియన్ జ్యుడీషియరీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటుపై ప్రతిపాదన పంపాం. దీనిపై న్యాయ శాఖ నుంచి ఇంకా స్పందన రాలేదు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై కేంద్రం చట్టం తెస్తుందని ఆశిస్తున్నా’అని సీజేఐ పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు...
హనుమకొండలో కోర్టుల భవన సముదాయ నిర్మాణానికి కేంద్రం నిధులివ్వకున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ కోర్టును నిర్మించడం అభినందనీయమని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఇది న్యాయ వ్యవస్థకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన గౌరవమన్నారు. కాకతీయ రాజులు అందించిన ఘనమైన వారసత్వానికి దీటుగా హనుమకొండ నూతన కోర్టు భవనాలు రూపుదిద్దుకున్నాయని ప్రశంసించారు. హనుమకొండ మాదిరిగా దేశంలోని అన్ని కోర్టుల్లో మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేస్తానన్నారు. ఏ వేదికపై ప్రధానిని కలిసినా కోర్టుల్లో మౌలికసదుపాయాల కల్పన, మొబైల్ కోర్టుల సౌకర్యం, యువ న్యాయవాదులను ప్రోత్సహించేలా కృషి చేయాలని కోరతానని తెలిపారు.
ఓరుగల్లుతో బంధం.. కవితలతో ప్రసంగం
‘తెలుగు వాడివై తెలుగు రాదనుచు సిగ్గులేక ఇంక చెప్పుడెందుకురా.. అన్య భాషలు నేర్చి ఆంధ్రమ్ము రాదనుచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకు రా!’అంటూ కాళోజీ కవితతో సీజేఐ ఎన్వీ రమణ తన ప్రసంగాన్ని మొదలెట్టారు. ‘కవులు, స్వాతంత్య్ర పోరాటయోధులు, విప్లవకారులు తిరిగిన నేల ఓరుగల్లు. వరంగల్‌తో నాకు అవినాభావ సంబంధం ఉంది. గతంలో ఇక్కడ ఆర్‌ఈసీలో కార్యక్రమాలకు హాజరయ్యా. నాకు ఇక్కడ బంధువులు, మిత్రులు ఉన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనాథుడు, దాశరథి రంగాచార్య, కాళోజీ నారాయణరావు లాంటి సరస్వతీ పుత్రులకు జన్మనిచ్చిన నేల ఇది. దేశానికి ప్రధానిని ప్రసాదిం చిన ప్రాంతం ఓరుగల్లు. నియంతృత్వ, పెత్తందారీ విధానాలకు వ్యతిరేకంగా సాగిన పోరాటాలకు ఇది పుట్టినిల్లు’అంటూ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వరంగల్‌తో తనకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ‘నా తెలంగాణ కోటి రత నాల వీణ అన్నారు దాశరథి. ఆయన గర్జన.. పరపీడన విముక్తికి, పోరాటాలకు ఊపిరినిచ్చింది. పోరుగల్లుకు.. ఓరుగల్లుకు.. వరంగల్లుకు వందనం’అని సీజేఐ పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాతృభాష ప్రాధాన్యతను మరోసారి గురు ్తచేశారు. తల్లిదండ్రులంతా పిల్లలతో తెలుగులోనే మాట్లాడాలని, మాతృభాషను గౌరవించాలన్నారు.
‘రామప్ప’ను చూసి మురిసిపోయా..
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రామప్ప దివ్యక్షేత్రాన్ని సందర్శించి మురిసిపోయా. మనకున్న గొప్ప చారిత్రక సంపదను యునెస్కో గుర్తించింది. ఇది అందరూ గర్వించాల్సిన విషయం. వేయిస్తంభాల ఆలయం శిలా, కళా వైభవానికి ఖ్యాతి. ఈ ఆలయం చూసేందుకు రెండు కళ్లూ చాలవు’అని సీజేఐ వ్యాఖ్యానించారు.
భద్రకాళి ఆలయంలో పూజలు...
వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారిని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ఆదివారం దర్శించుకున్నారు. వారికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం బహూకరించిన బంగారు కిరీటంతోపాటు జటమకుటాలను అర్చకులు అమ్మవారికి అలంకరించారు. అనంతరం వేయిస్తంభాల గుడిని రమణ దంపతులు దర్శించుకున్నారు.