సారూ... జర జాగ్రత్త! | Surveillance of teachers movements | Sakshi
Sakshi News home page

సారూ... జర జాగ్రత్త!

Published Sat, Oct 21 2023 1:46 AM | Last Updated on Sat, Oct 21 2023 4:12 PM

Surveillance of teachers movements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇప్పుడంతా ‘సోషల్‌’ మయం.. ప్రచారమేదైనా సోషల్‌ మీడియాదే హవా! ఎన్నికల సీజన్‌ కావడంతో రాజకీయ పార్టీలు, అభ్యర్థులతో పాటు ఎవరికి నచ్చినట్లుగా వారు సోషల్‌ మీడియా పోస్ట్‌లతో చెలరేగిపోతున్నారు. అయితే, ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలంటోంది ఎన్నికల కమిషన్‌. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది.

ఎన్నికల నియమావళికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించింది. ప్రతి ఎన్నికల సందర్భంగా ఇది సర్వసాధారణమే అయినప్పటికీ, ఈసారి సోషల్‌ మీడియాలో చేసే పోస్ట్‌లపైనా నిఘా పెట్టాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వ ఉద్యోగుల పోస్టింగ్‌లు, ప్రచార కోణాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.

ఉద్యోగి అనుసరించాల్సిన విధివిధానాలపై ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో కొంతమందికి శిక్షణ ఇచ్చారు. వారు జిల్లా స్థాయిలో, వారి ద్వారా మండల స్థాయిలో అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తారు. ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్లను కోరింది. ఏదైనా పార్టీకి అనుకూలంగా పనిచేసినట్టు రుజువైతే తక్షణం సస్పెండ్‌ చేయాలని నియమావళి పేర్కొంటోంది.

మీటింగ్‌లకు వెళ్ళినా నేరమే..
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్నికల విధుల్లో కీలకపాత్ర పోషిస్తారు. ఈ కారణంగా ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే సంకేతాలు వారి నుంచి రాకుండా ఉండాలని ఎన్నికల నియామవళి పేర్కొంటోంది. పార్టీల బహి రంగ సభలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమాల్లో ఉద్యో గులు పాల్గొన్నట్టు ఫిర్యా దులొస్తే తేలికగా తీసుకోవద్దని పేర్కొంటూ పరిశీలనకు కొన్ని సూచనలు చేసింది.

సభ జరిగినప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను పరిశీలించాలని, క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నట్టు భావిస్తే ఆయా ప్రాంతాల్లో సీసీ కెమెరాలను పరిశీలించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కరపత్రాలు పంచడం, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్‌బుక్‌ ద్వారా ప్రచారం చేయడాన్ని సీరియస్‌గా పరిగణించాలని, ఆధారాలుంటే తక్షణమే సస్పెండ్‌ చేసే అవకాశం కూడా ఉంటుందని అధికార వర్గాలు 
పేర్కొంటున్నాయి.

తస్మాత్‌ జాగ్రత్త
ప్రతీ ఉద్యోగికి వ్యక్తిగత అభిప్రాయం ఉండటంలో తప్పులేదు. ఇది విధి నిర్వహణపై ప్రభావం చూపడానికి వీల్లేదు. ఎన్నికల నియామవళి ప్రకారం పారదర్శకంగానే వ్యవహరించాలి. పూర్తి సాంకేతికతతో నిఘా వ్యవస్థ పనిచేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని టీచర్లు,  ప్రభుత్వ ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. – చావా రవి (యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement