
ఎయిడ్స్ డే సందర్భంగా బుధవారం విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్న కోటాచలం
సూర్యాపేట, తిరుమలగిరి: సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి, ఆయన కుటుంబ సభ్యులు ఐదుగురికి కరోనా నిర్ధారణ అయింది. డీఎంహెచ్‌ఓ డాక్టర్ కోటాచలం, ఆయన కుటుంబ సభ్యులు జలుబు, దగ్గు లక్షణాలు ఉండడంతో ఆర్‌టీపీసీఆర్ పరీక్ష చేయించుకున్నారు. గురువారం రిపోర్టు రాగా.. కోటాచలం, ఆయన భార్య, ఇద్దరు కుమారులు, కోడలు, మనుమరాలుకు వైరస్ సోకినట్లు తేలింది. జర్మనీలో ఉంటున్న డీఎంహెచ్‌ఓ పెద్ద కుమారుడు అజయ్, కోడలు, మనుమరాలు నవంబర్ 20న ఇంటికి వచ్చారు.
మహారాష్ట్రలో ఎంబీబీఎస్ చదువుతున్న చిన్న కుమారుడు కూడా గత శుక్రవారం వచ్చాడు. అందరూ కలిసి శనివారం తిరుపతి దైవ దర్శనానికి వెళ్లారు. తిరిగి సోమవారం వారి స్వగ్రామమైన తిరుమలగిరికి చేరుకున్నారు. తిరుపతి నుంచి తెచ్చుకున్న ప్రసాదాన్ని ఇంటి చుట్టుపక్కల వారికి, బంధువులకు పంచారు. కోటాచలం మంగళవారం విధుల్లో చేరారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.
అదేరోజు నిర్వహించిన ఎయిడ్స్ డే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో తనను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోవాలని డీఎంహెచ్‌ఓ కోరారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలగిరిలోని నివాసంలోనే హోం క్వారంటైన్‌లో ఉన్నట్లు తెలిపారు. కాగా డీఎంహెచ్‌ఓ సహా ఆరుగురు శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సాక్షికి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment