నాయకత్వ శిక్షణ ప్రోగ్రాం ప్రారంభించిన టీ హబ్
భారతీయ ఇంక్యుబేటర్లను అంతర్జాతీయ స్థాయికి చేర్చటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఆవిష్కరణలను వేగవంతం చేయడం, వాణిజ్య వాతావరణాన్ని మరింత విస్తరించడం ద్వారా అంతర్జాతీయంగా భారతీయ స్టార్టప్‌లు రాణించేలా ‘టీ హబ్’ ప్రణాళికలు రూపొందిస్తోంది. అందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ (ఏఐసీ) సహకారంతో టీ హబ్ ఫౌండేషన్ ‘బిజినెస్ ఇంక్యుబేషన్ మేనేజ్‌మెంట్, లీడర్‌షిప్ ప్రోగ్రామ్’ (బీఐఎంఎల్) పేరుతో కొత్త కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించింది.
ఈ ప్రోగ్రామ్ ద్వారా వివిధ సంస్థల్లో మేనేజ్‌మెంట్ అధిపతులుగా పనిచేస్తున్నవారికి ఇంక్యుబేషన్ వ్యవస్థల ఏర్పాటు, నిర్వహణపై శిక్షణ ఇస్తారు. శిక్షణ, వాణిజ్య వ్యాపార సంస్థలతో వ్యూహాత్మక భాగస్వామ్యాలు, సాంకేతిక, మార్కెటింగ్ నెట్‌వర్క్‌తో అనుసంధానం వంటి అంశాల్లో సహకారం అందిస్తారు.
ఇంక్యుబేషన్ వ్యవస్థలో పరివర్తన
బీఐఎంఎల్ ద్వారా శిక్షణలో పాల్గొనేవారికి ప్రపంచ స్థాయిలో ఇంక్యుబేషన్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుంది. మెంటార్లు, కార్పొరేషన్లు, విధాన నిర్ణేతలతో టీ హబ్‌కు ఉన్న విస్తృత నెట్‌వర్క్ ద్వారా భారతీయ ఇంక్యుబేటర్లు అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దే అవకాశాలు మెరుగవుతాయి.
బీఐఎంఎల్ కార్యక్రమాన్ని విస్తృతం చేసేందుకు ఇప్పటికే టీ హబ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అస్సాం, తమిళనాడులోని 15 సాంకేతిక విద్యా సంస్థలతో కలిసి పనిచేస్తోంది. ఎడ్యుటెక్, క్రీడలు, టెక్నాలజీ, మేనేజెమెంట్ రంగాల్లో ఇంక్యుబేటర్ల ఏర్పాటును వేగవంతం చేయడమే బీఐఎంఎల్ ప్రోగ్రామ్ లక్ష్యమని టీ హబ్ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment