ఆ నష్టం పూడ్చేదెవరు?
హైడ్రా కూల్చివేతల తీరుపై కుటుంబాల్లో కన్నీళ్లు
గుండెపోటుతో మరణించిన బాధితురాలు అంజలి
తీవ్ర నష్టంతో రోడ్డునపడ్డ విజయ్‌ప్రతాప్, రవి
రోడ్డున పడ్డ బతుకులు.. ఇక కోలుకునే మార్గమే లేదంటూ ఆవేదన
(గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి) : ‘హైడ్రా’తో చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో వెలిసిన అక్రమ నిర్మాణాల కూల్చివేతపై తొలుత హర్షం వ్యక్తమైంది. కానీ ఆ తర్వాత హైడ్రా వ్యవహరిస్తున్న తీరు మా త్రం కుటుంబాల్లో కన్నీళ్లు నింపేలా ఉందంటూ బాధితులు మండిపడుతున్నారు.
ఇళ్లలోనో, దుకాణాల్లోనో, షెడ్లలోనో నివ సిస్తున్న.. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కనీస సమాచారం ఇవ్వకుండా, ఇచ్చినా ఖాళీ చేసేందుకు సమ యం ఇవ్వకుండా కూల్చివేతలు చేపడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమదుఃఖం తీర్చేదెవరని.. తమకు జరిగిన నష్టాన్ని పూడ్చేదెవరంటూ కన్నీళ్లుపెడుతున్నారు.
చాలా వరకు పేదలు, మధ్యతరగతివారే..
ఇళ్లు కట్టుకున్నవారే కాదు.. స్థలాలు, నిర్మాణాలను లీజుకు తీసుకుని వ్యాపారాలు పెట్టుకున్నవారూ హైడ్రా కూల్చివేతల్లో తీవ్రంగా నష్టపోయారు. ఎక్కడెక్కడి నుంచో బతుకుదెరువు కోసం వచ్చి.. కడుపు కట్టుకుని సంపాదించుకుంటున్న తమ బతుకులు రోడ్డున పడ్డాయని వాపోతున్నారు. వడ్డీలకు అప్పులు తెచ్చి వ్యాపారాలు చేసుకుంటున్న షెడ్లను, భవనాలను ఉన్నట్టుండి కూల్చడంతో.. తీవ్రంగా నష్టపోయామని, ఇక తమ బతుకులు కోలుకునే అవకాశమే కనిపించడం లేదని కన్నీళ్లు పెడుతున్నారు.
ఈ నెల 8న సున్నంచెరువు ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్లలోని ఒక గోడౌన్, మూడు భవనాలు, 20 గుడిసెలను అధికారులు కూల్చివేశారు. అందులో ఒక గుడిసెలో నివాసం ఉంటున్న బలహీనవర్గాలకు చెందిన ఎన్.నర్సింహ, అంజలి దంపతులు ఇరవయ్యేళ్ల క్రితం మాదాపూర్‌కు వలస వచ్చారు.
స్థానిక నేతల సూచనతో అక్కడ గుడిసె వేసుకొని కూలిపనులు చేసుకుంటూ బతుకుతున్నారు. వారి కుమారుడు సాయిచరణ్ (17) కేన్సర్ వ్యాధితో బాధపడుతూ రెండు నెలల క్రితమే మృతిచెందాడు. ఆ దుఃఖం నుంచి కోలుకోకముందే వారి గుడిసె నేలమట్టమైంది. తలదాచుకునేందుకు నర్సింహ సోదరి ఇంటికి వెళ్లారు.
కానీ అటు కుమారుడిని, ఇటు గూడును కోల్పోయిన ఆవేదనతో.. అంజలి ఈనెల 21న ఛాతీనొప్పికి గురైంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి ఆమె మృతి చెందింది. పాత జ్ఞాపకాలను వెతుక్కుంటూ కూల్చిన గుడిసె వద్దకు వచ్చిన నర్సింహ.. కొడుకు, భార్య ఇద్దరూ మరణించాక, తాను ఎవరి కోసం బతకాలో అర్థం కావడం లేదని వెక్కివెక్కి ఏడ్చారు.
రోడ్డున పడ్డ బతుకులు..
కూకట్‌పల్లికి చెందిన విజయ్‌ప్రతాప్‌గౌడ్‌ది మరో కన్నీటి వ్యథ. కేటరింగ్ చేసే ఆయన వద్ద 68 మంది పనిచేస్తున్నారు. వారందరికీ అదే జీవనాధారం. విజయ్‌ప్రతాప్ భూమిని లీజుకు తీసుకొని, రూ.40 లక్షల వ్యయంతో షెడ్లు, సామగ్రి ఏర్పాటు చేసుకున్నారు.
నల్లచెరువులో హైడ్రా కూల్చివేతల్లో భాగంగా ఆయన షెడ్లనూ కూల్చేశారు. కనీసం కేటరింగ్ సామగ్రి బయటికి తీసుకువెళ్లే అవకాశం ఇవ్వలేదని ఆయన వాపోయారు. తనతోపాటు పనిచేసేవారంతా ఉపాధి లేక రోడ్డునపడ్డామని ఆందోళన వ్యక్తం చేశారు.
కొంత గడువైనా ఇవ్వాల్సింది
సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలతో తీవ్రంగా నష్టపోయానని మరో బాధితుడు పునారాం పేర్కొన్నారు. అక్కడ లక్షలు ఖర్చుపెట్టి గోడౌన్ నిర్మాణం చేపట్టానని, శానిటరీ సామాగ్రి కొంత అందులోనే ఉండిపోయిందని వాపోయారు. కొన్నిరోజులు గడువు ఇచ్చి ఉంటే సామగ్రిని పూర్తిగా తరలించే అవకాశం ఉండేదన్నారు. గోడౌన్, సామగ్రి కలిపి రూ.50 లక్షలకుపైగా నష్టపోయి.. రోడ్డునపడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గర్భవతి అన్నా కనికరించలేదు!
కూకట్‌పల్లిలో రవి జిరాక్స్, ప్రింటింగ్ ప్రెస్‌కు సంబంధించిన దుకాణం నిర్వహిస్తున్నాడు. హైడ్రా ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టడంతో తీవ్రంగా నష్టపోయానని వాపోయాడు. తన భార్య గర్భవతి అని, సామగ్రి తీసుకునేందుకు కాస్త గడువు ఇవ్వాలని కోరినా అధికారులు కనికరించలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు.
తాను, మరికొందరు కలసి నాలుగు రోజులు కష్టపడి కొంత సామగ్రిని బయటికి తీసినా.. అది చాలా వరకు పాడైపోయిందని వాపోయారు. తనతో పాటు మరెందరో నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment