నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly session to begin from July 23 | Sakshi
Sakshi News home page

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published Tue, Jul 23 2024 5:58 AM | Last Updated on Tue, Jul 23 2024 6:16 AM

Telangana Assembly session to begin from July 23

సంతాప తీర్మానాల తర్వాత సభ వాయిదా 

బీఏసీ భేటీలో సమావేశాల ఎజెండా ఖరారు 

25న ఉభయ సభల్లో రాష్ట్ర 2024–25 వార్షిక బడ్జెట్‌ 

ఉదయం బడ్జెట్‌ను ఆమోదించనున్న కేబినెట్‌  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర శాసనసభ మూడో విడత సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. శాసనమండలి సమావేశాలు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు మొదలవుతాయి. అసెంబ్లీ సమావేశాలు ఆగస్టు 3వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తొలిరోజు మంగళవారం ఉదయం స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన సభ ప్రారంభమైన వెంటనే ఈ ఏడాది ఫిబ్రవరి 23న రోడ్డు ప్రమాదంలో మరణించిన దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మరణం పట్ల సభ సంతాపం ప్రకటించనుంది. ఈ సంతాప తీర్మానాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ప్రవేశపెడతారు.

అలాగే ఇటీవలి కాలంలో మరణించిన పలువురు మాజీ ఎమ్మెల్యేలకు కూడా నివాళులరి్పంచనుంది. అనంతరం సభను 24వ తేదీ ఉదయం 10 గంటలకు వాయిదా వేస్తారు. తర్వాత స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌ అధ్యక్షతన ఆయన ఛాంబర్‌లో బిజినెస్‌ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఈ భేటీలో సభ ఎజెండా, సమావేశాలు ఎన్ని రోజులు జరిగేదీ ఖరారు చేయనున్నారు. 24న రైతు రుణమాఫీ అంశంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగే అవకాశముందని సమాచారం.

ఇక 25న శాసనసభలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాసనమండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు 2024–25 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు. 26న సమావేశాలకు విరామం ప్రకటిస్తారు. 27న బడ్జెట్‌ ప్రసంగంపై చర్చ ప్రారంభం అవుతుంది. బోనాల పండుగ నేపథ్యంలో 28, 29 తేదీల్లో మళ్లీ విరామం అనంతరం, ఈ నెల 30 నుంచి సమావేశాలు తిరిగి ప్రారంభమవుతాయి. ఈ సమావేశాల్లో స్కిల్స్‌ యూనివర్సిటీతో పాటు పలు ప్రభుత్వ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. 

25న మంత్రివర్గ భేటీ: అసెంబ్లీలో ఈ నెల 25న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ ప్రవేశ పెడుతున్న నేపథ్యంలో అదే రోజు ఉదయం 9 గంటలకు మీటింగ్‌ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన కేబినెట్‌ భేటీ జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.  

ఇప్పటివరకు రెండు విడతలు
గత ఏడాది డిసెంబర్‌ మొదటి వారంలో రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. తొలి విడత సమావేశాలు డిసెంబర్‌ 9 నుంచి 21వ తేదీ వరకు 6 రోజుల పాటు, రెండో విడత ఫిబ్రవరి 9 నుంచి 17 తేదీల నడుమ 8 రోజుల పాటు జరిగాయి. తొలి విడత సమావేశాల్లో నూతన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్‌ ఎన్నిక జరిగింది. గవర్నర్‌ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది. ఇక ఫిబ్రవరిలో జరిగిన రెండో విడత సమావేశాల్లో 2024– 25 ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టడంతో పాటు సాగునీటి వనరులపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement