సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన నల్లు ఇంద్రసేనారెడ్డికి త్వరలోనే గవర్నర్ పదవి దక్కనున్నట్టు విశ్వసనీయ సమాచారం. హరియాణా గవర్నర్‌గా ఉన్న బండారు దత్తాత్రేయ పదవీకాలం ముగియగానే ఈ నియామకం జరగనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణకు చెందిన అత్యంత సీనియర్ నేతగా ఉన్న ఇంద్రసేనారెడ్డి దాదాపు ఐదు దశాబ్దాలపాటు పార్టీకి అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పదవిని కట్టబెట్టాలని అధిష్ఠానం నిర్ణయించినట్లు తెలిసింది.
ఈ మేరకు ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే పార్టీకి చెందిన సీనియర్ నేత, 40 ఏళ్లుగా పార్టీనే అంటిపెట్టుకుని, క్రమశిక్షణతో పనిచేసిన డా.కె.లక్ష్మణ్‌కు యూపీ నుంచి రాజ్యసభకు అవకాశం కల్పించిన విషయం విదితమే.
లోక్‌సభలో తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీకి నలుగురు ఎంపీలున్నా, రాజ్యసభలో తెలంగాణకు ప్రాతినిధ్యం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్దల సభలో రాష్ట్రానికి సంబంధించిన అంశాలు లేవనెత్తేందుకు, టీఆర్‌ఎస్ వైఖరిని ఎండగట్టేందుకు, రాష్ట్ర రాజకీయాల్లో బలమైన మున్నూరుకాపు సామాజికవర్గం మద్దతును కూడగట్టేందుకు దూరదృష్టితోనే ఈ ఎంపిక జరిగిందని తెలుస్తోంది.
లోక్‌సభ బరిలో మురళీధర్‌రావు!
తెలంగాణకే చెందిన మరో ముఖ్యనేత, ప్రస్తుతం మధ్యప్రదేశ్ ఇన్‌చార్జీగా ఉన్న మురళీధర్‌రావును ఈసారి లోక్‌సభకు పోటీ చేయించాలని ఆ పార్టీ జాతీయ నాయకత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందువల్లే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వకుండా వచ్చే ఎన్నికల్లో మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం నుంచి బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు సమాచారం.
ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపని లేదా ఆ అవకాశం లభించని ఇతర సీనియర్ నేతలకు కూడా జాతీయస్థాయిలో వివిధ నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు తెలిసింది. వీరిలో దళితవర్గానికి చెందిన చింతా సాంబమూర్తి ఉన్నట్లు సమాచారం. వాజ్‌పేయి హయాంలో సఫాయి కర్మచారీ కమిషన్ సభ్యుడిగా సాంబమూర్తి పనిచేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వేములవాడ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాజాగా ఢిల్లీలో జాతీయపార్టీ ముఖ్యనేతలతో రాష్ట్ర నాయకులు సమావేశమైన సందర్భంగా వివిధ విషయాలపై స్పష్టతనిచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment