![telangana bjp leaders Hopes to minister post](/styles/webp/s3/article_images/2024/06/9/57436fb5-26a6-4184-ad9c-b64625e28e47.jpeg.webp?itok=F9zJbyaq)
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మొదటి దశలో గ్రేటర్ నుంచి మంత్రి పదవి దక్కేదెవరికి? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఆదివారం ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో నగరం నుంచి మోదీతో పాటు ప్రమాణం చేసే అదృష్టవంతుడెవరన్నది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయంగా తెలుస్తోంది.
అయితే.. అది ఎవరిని వరించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి కిషన్‌రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా గెలుపొందడం తెలిసిందే. వీరిలో కిషన్‌రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్‌రెడ్డికే కేంద్ర మంత్రివర్గంలో తొలి దశలోనే అవకాశం లభించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
మరోవైపు కిషన్‌రెడ్డికి ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లభించనుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ.. తొలుత మంత్రి పదవి అయితే ఇస్తారని, అంతే కాకుండా అధ్యక్ష పదవి కంటే మంత్రిగానే ఆయనకు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ జట్టులో ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో కిషన్‌రెడ్డి పేరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
స్టేట్ బాస్‌గా ఈటల?
దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, ప్రస్తుతం సీఎంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో గెలిచిన ఈటల రాజేందర్‌కు తగిన గుర్తింపునిచ్చేందుకు మంత్రిపదవి ఇస్తారనే అభిప్రాయాలున్నా, తొలిదశలో కిషన్‌రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించలరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కిషన్‌రెడ్డి కంటే ముందు పార్టీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్న బండి సంజయ్ బీసీ కావడంతో త్వరలో నియమించే కొత్త అధ్యక్ష పదవి కూడా బీసీలకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటలకు ఆ అవకాశం కలి్పస్తారని చెబుతున్నారు. ఏ పారీ్టలో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కేడర్‌ను కలుపుకుపోవడం, సమన్వయం చేయడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment