దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వెల్లడి
వచ్చే ఒలింపిక్స్ నాటికి మన క్రీడాకారులను సన్నద్ధం చేస్తాం
2036 ఒలింపిక్స్ కల్లా అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాల కల్పన
ఎన్‌ఎండీసీ మారథాన్ విజేతలకు పతకాల ప్రదానం
చందానగర్ (హైదరాబాద్): దేశంలో క్రీడలను ప్రోత్సహించే రాష్ట్రం తెలంగాణనే అనే గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. 2036లో ఒలింపిక్స్‌ను ఇండియాలో నిర్వహించాలనే ప్రధాని నరేంద్రమోదీ సంకల్పం నేపథ్యంలో హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. జాతీయ క్రీడలను హైదరాబాద్‌లో నిర్వహించేలా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.
ఇటీవల కేంద్ర క్రీడల శాఖ మంత్రిని ఢిల్లీలో కలసి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న స్టేడియాలను ఆధునీకరించి క్రీడాకారులకు శిక్షణ ఇస్తామని చెప్పారు. 2028లో జరిగే ఒలింపిక్స్‌లో హైదరాబాద్ క్రీడాకారులు ఎక్కువ పతకాలు సాధించేందుకు ఇప్పటినుంచే చర్యలు చేపడతామన్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ విజేతలకు పతకాలను ప్రదానం చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
త్వరలో స్పోర్ట్స్ పాలసీ
‘వచ్చే విద్యాసంవత్సరం నుంచే హైదరాబాద్‌లో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభిస్తాం. దక్షిణ కొరియా పర్యటన సందర్భంగా అక్కడి స్పోర్ట్స్ యూనివర్సిటీని సందర్శించడంతో పాటు మూడు బంగారు పతకాలను సాధించిన క్రీడాకారిణితో మాట్లాడాం. ఇక్కడ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకు దక్షిణ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీ సహకారం తీసుకుంటాం.
అంతర్జాతీయ స్థాయి కోచ్‌లను రప్పించి క్రీడాకారులను తీర్చిదిద్దేలా ప్రణాళికలు రూపొందిస్తాం. ప్రాంతీయ క్రీడలకు ఎల్బీ స్టేడియం, జాతీయ క్రీడలకు ఉప్పల్ స్టేడి యం, అంతర్జాతీయ క్రీడలకు గచ్చిబౌలి స్టేడియం వేదికలుగా నిలుస్తాయి. త్వరలో స్పోర్ట్స్ కోసం ఓ పాలసీని తీసుకొస్తాం..’అని రేవంత్‌రెడ్డి చెప్పారు.
అక్టోబర్ 2న సీఎం కప్ క్రీడలు
‘అక్టోబర్ 2న సీఎం కప్ క్రీడలు నిర్వహిస్తాం. అక్టోబర్ 3వ వారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో సీఎం కప్ క్రీడలు ప్రారంభం అవుతాయి. సీఎం కప్ క్రీడల విజేతలతో, వివిధ విభాగాల క్రీడాకారులతో డేటా బేస్ ఏర్పాటు చేస్తాం. దీనిపై త్వరలోనే స్పష్టమైన ప్రకటన ఉంటుంది. త్వరలోనే గచ్చిబౌలి స్టేడియంలో ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్ జరుగుతుంది. 25 ఏళ్ల కిందట హైదరాబాద్‌లో ఆఫ్రో ఏషియన్ గేమ్స్, మిలిటరీ క్రీడలు నిర్వహించిన ఘనత మనకు ఉంది.
అదే తరహాలో ఇప్పుడు కూడా స్టేడియాలకు పూర్వవైభవం తీసుకొచ్చేలా చేస్తాం. తెలంగాణలోని యువతను క్రీడలవైపు మళ్ళించేలా తగిన చర్యలు తీసుకుంటాం..’అని సీఎం తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, వి.హన్మంతరావు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ప్రముఖ బాక్సర్ నిఖత్ జరీన్, ఎన్‌ఎండీసీ ఈడీ జైపాల్‌రెడ్డి, ఐడీఎఫ్‌సీ బ్యాంక్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ టీవీ నారాయణ, ఎన్‌ఎండీసీ హైదరాబాద్ మారథాన్ రేస్ డైరెక్టర్ రాజేష్ వెచ్చా తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment