సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో క్యాష్‌లెస్ టికెట్ జారీ వ్యవస్థ ఏర్పాటు కానుంది. దీనికోసం ప్రత్యేకంగా రీచార్జి చేసుకునే కార్డులను జారీ చేయనుంది. డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ కార్డు ద్వారానే టికెట్ కొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయోగం కోసం తొలుత హైదరాబాద్ సిటీలోని 16వ నంబర్ బస్ రూట్‌ను కేటాయించారు. ఈ రూట్‌లో తిరిగే బస్సుల్లో దీన్ని అమలు చేసి.. లోటుపాట్లు, లాభనష్టాలు గుర్తించి దాని ఆధారంగా రాష్ట్రవ్యాప్తంగా అమలుపై నిర్ణయం తీసుకోనున్నారు. భవిష్యత్తులో ఈ కార్డులను ఇతర అవసరాలకు కూడా వినియోగించేలా మార్పు చేయనున్నారు.
టికెట్ జారీ ఇలా...
ఈ ప్రత్యేక కార్డులు ప్రతిపాదిత మొత్తం (రూ.30గా ప్రస్తుతానికి అంచనా) చెల్లించి కొనాలి. అందులో నిర్ధారిత మొత్తాన్ని టాప్‌అప్ చేయించుకోవాలి. ఆ కార్డుకు ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. కండక్టర్ వద్ద ప్రత్యేక టికెట్ జారీ యంత్రం ఉంటుంది. ప్రయాణికుడు ఏ స్టేజీలో దిగాలో నమోదు చేసి ప్రయాణికుడి వద్ద ఉన్న కార్డులో ఉండే క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయగానే నిర్ధారిత టికెట్ మొత్తం కార్డు నుంచి డిడక్ట్ అవుతుంది. ఆ యంత్రం నుంచి టికెట్ జారీ అవుతుంది. కార్డులో బ్యాలెన్స్ అయిపోగానే మళ్లీ రీచార్జి చేసుకోవాలి. దీంతో చిల్లర సమస్యలుండవు, టికెట్ జారీలో అవకతవకలకు ఆస్కారం ఉండదు. ప్రయాణికుడు కచ్చితంగా వెంట టికెట్ డబ్బు ఉంచుకోవాల్సిన అవసరం లేదు.
ఓ కంపెనీకి ప్రయోగం బాధ్యత..
ఇటీవల వన్ మనీ అనే ప్రైవేటు కంపెనీ ఈ కార్డు విషయంలో ఆర్టీసీని సంప్రదించింది. ఇప్పటికే క్యాష్‌లెస్ లావాదేవీల విషయంలో యాప్స్ రూపొందించి అమలు చేయడంలో తనకున్న అనుభవాన్ని పేర్కొంటూ ఆర్టీసీలో దాన్ని అమలు చేయాలని కోరింది. ఈ మేరకు ప్రయోగాత్మక పరిశీలన రూట్‌ను దానికి అప్పగించారు. సిటీలో సికింద్రాబాద్–కుషాయిగూడ మధ్య ఉండే 16వ నంబర్ బస్ రూట్‌లో దీన్ని అమలు చేయనున్నారు. డిజిటల్ ఇండియా కింద కేంద్ర ప్రభుత్వం సంస్థలకు భారీగా సాయం చేస్తోంది. ఇప్పుడు ఆర్టీసీలో నగదు రహిత లావాదేవీలకు సంబంధించి కూడా సంబంధిత సంస్థకు కేంద్రం నుంచి భారీగా నగదు ప్రోత్సాహకాలు, గ్రాంట్లు అందే అవకాశం ఉంటుందని సమాచారం. ఆర్టీసీలో ఈ విధానాన్ని నిర్వహించే ప్రైవేటు సంస్థలకు ఈ లబ్ధి ఉండనున్నందున అవకాశం కోసం పలువురు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది.
అధికారుల సమీక్ష..
రవాణా, రోడ్లు భవనాల శాఖ ప్రత్యేక కార్యదర్శి విజేంద్ర బోయీ ఆధ్వర్యంలో అధికారులు ఇటీవల దీనిపై సమీక్ష జరిపారు. ఆ కార్డును ఆధార్‌తో అనుసంధానించాలన్న సదరు కంపెనీ సూచనను అధికారులు వ్యతిరేకించారు. అలా చేయలేమని చెప్పడంతో ప్రస్తుతానికి ఆధార్‌తో అనుసంధానం లేకుండానే ప్రయోగం నిర్వహించనున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే టెండర్ ప్రక్రియ ద్వారా రాష్ట్రం మొత్తం నిర్వహించే బాధ్యతను నిర్ధారిత కంపెనీకి అప్పగించనున్నట్లు అధికారులు చెప్పారు.
5 శాతం రాయితీ..
కార్డును వినియోగించి టికెట్ కొంటే నిర్ధారిత బస్సు చార్జీపై 5 శాతం రాయితీ ఇచ్చేలా యోచిస్తున్నారు. దీంతో ప్రయాణికుడికి కొంత వెసులుబాటు కలుగుతుంది. డబ్బు చెల్లించడం కంటే నగదు రహిత లావాదేవీకే మొగ్గు చూపుతారని అధికారులు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment