అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం
ఈసీఐ నుంచి ఓటర్ల జాబితా అందిన వెంటనే రంగంలోకి దిగాలి
రిజర్వేషన్లపై బీసీ కమిషన్ గడువులోగా నివేదిక ఇవ్వాలి
సచివాలయంలో ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష
అక్టోబర్ లేదా నవంబర్ చివర్లోగా ఎన్నికలు నిర్వహించే చాన్స్
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) నుంచి కొత్త ఓటర్ల జాబితా అందిన వారంలోగానే ఆయా స్థానిక సంస్థలకు తగినట్లుగా ఓటర్ల జాబితాలు రూపొందించాలని చెప్పారు. రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి నిర్దిష్ట గడువులోగా బీసీ కమిషన్ సైతం తమ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని కోరారు. శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికలపై ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది.
ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకులు, ఎన్నికలు సత్వరం నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై ఈ సందర్భంగా చర్చించారు. ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టడానికి ఉన్న ఆటంకాలు ఏమిటని అధికారులను సీఎం ప్రశ్నించారు. దీంతో కొత్త ఓటర్ల జాబితా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘానికి రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే రెండు రాష్ట్రాలకు జాబితాలు పంపిందని, మనతో పాటు మరో ఆరు రాష్ట్రాలకు మరో వారంలోగా జాబితాలు పంపించనుందని వివరించారు.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వపరంగా కసరత్తు పూర్తయితే..అక్టోబర్ లేదా నవంబర్ చివర్లోగా ముందుగా పంచాయతీ, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్‌లకు ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, ధనసరి అనసూయ సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీని వాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె.కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్ వకు ళాభరణం కృష్ణమోహన్‌రావు, సీఎస్ శాంతికుమారి, సీఎం ముఖ్య కార్యదర్శి వి.శేషాద్రి, కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, వేముల శ్రీనివాసులు, సంగీత సత్యనారాయణ, అజిత్‌రెడ్డి, అడ్వకేట్ జనరల్ సుదర్శన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఓటర్ల జాబితా ఆధారంగానే రిజర్వేషన్లు?
కులగణన ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభా లెక్కించి, ఆయావర్గాల వారీగా స్థానిక రిజర్వేషన్ల ఖరారుకు చాలా సమయం పడుతుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఇటీవలే ముగిసిన లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జారీ చేసిన ఓటర్ల జాబితా ఆధారంగా రిజర్వేషన్లు పూర్తి చేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గ్రామ పంచాయతీలు, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లకు అనుగుణంగా ఓటర్ల జాబితాను రూపొందించి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా కాస్ట్ ఎన్యూమరేషన్ (కుల గణన) పద్ధతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లపై స్పష్టత సాధించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అదే సమయంలో ఓటర్ల జాబితాను అనుసరించి ఎస్సీ, ఎస్టీ, బీసీ జనాభాపై ఒక అంచనాకు రావడంలో ఏవైనా సాంకేతిక సమస్యలు ఎదురవుతాయా అన్నది కూడా పరిశీలించనున్నట్టు తెలిసింది. కాగా వారం రోజుల్లో తాజా ఓటర్ల జాబితాలు అందగానే, వాటి ప్రాతిపదికన రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
ప్రక్రియలో భాగంగా బీసీ కమిషన్ ఆధ్వర్యంలో తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో బహిరంగ విచారణ పద్ధతుల్లో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తారు. ఇవి ముగిశాక రాష్ట్ర స్థాయిలో అన్ని పార్టీలు, సంఘాలతో నిర్వహించే అఖిలపక్ష భేటీల్లో తుది నిర్ణయం తీసుకోనున్నారు. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఎన్నికల తేదీలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు ప్రభుత్వం స్పష్టతనిస్తుంది. ఆ వెంటనే ఎస్‌ఈసీ ఎన్నికల నిర్వహణ కసరత్తును ప్రారంభించి, నెలన్నర, రెండునెలల వ్యవధిలోనే ప్రక్రియను పూర్తి చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment