హైదరాబాద్, సాక్షి: తెలంగాణలో రుణమాఫీ వర్తించే రైతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయం కీలక ప్రకటన చేసింది. రూ. 2 లక్షల లోపు రుణాలుండీ ఇప్పటికీ మాఫీ కాని రైతులు మండల వ్యవసాయ అధికారిని కలిసి.. అందుకు కారణం తెలుసుకోవాలని కోరింది. తద్వారా త్వరగతిన ప్రక్రియను పూర్తి చేసుకోవాలని సూచించింది.
రూ.2 లక్షల లోపు రుణమున్నప్పటికీ, మాఫీ కాని రైతులెవరైనా ఉంటే ఆ బ్యాంకు బ్రాంచీ ఉన్న మండలం వ్యవసాయ అధికారిని (MAO) కలిసి ఫిర్యాదు చేయాలి. రుణమాఫీ పోర్టల్ లో రైతు పేరిట ఉన్న రైతు సమాచార పత్రంలో రుణ మాఫీ వర్తించిందా? లేదంటే వర్తించకపోవడానికి కారణమేమిటో ఉంటుంది. ఉదాహరణకు.. ఆధార్ లేదని గుర్తిస్తే వెంటనే ఆధార్ కార్డును ఎంఏవోకు అందించాలి.
ఆధార్ సరిగ్గా లేకుంటే వెంటనే ఆ రైతు తన సరైన ఆధార్‌తో పాటు, ఓటర్ ఐడీ లేదా, వెహికల్ లైసెన్స్ లేదా రేషన్ కార్డును ఎంఈవోకు అందించాలి. వాటిని పోర్టల్లో అప్ లోడ్ చేసి సరిచేసుకోవటం ద్వారా రుణమాఫీ పొందేందుకు అర్హులవుతారు. ఒకవేళ..
కుటుంబ నిర్ధారణ జరగలేదనే కారణంతో రుణమాఫీ జరగలేదనే ఫిర్యాదులుంటే.. ఎంఈవో క్షేత్రస్తాయిలో వెరిఫికేషన్ చేస్తారు. రైతుల ఇంటికి వెళ్లి ఆ కుటుంబంలో రైతు ఖాతాలున్న వారి ఆధార్ కార్డులు, రైతు వెల్లడించిన వివరాలను నమోదు చేసుకోని పోర్టల్లో అప్‌లోడ్ చేస్తారు. ఆధార్ లో, బ్యాంకు ఖాతాలో ఉన్న రైతు పేరు సరిపోలకపోతే, రైతులు సరైన పేరున్న అప్ డేటేడ్ ఆధార్ కార్డును సమర్పించాల్సి ఉంటుంది. నెల రోజుల్లో రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులన్నింటినీ వ్యవసాయ శాఖ పరిష్కరిస్తుంది అని సీఎంవో ఒక ప్రకటనలో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment