సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహ సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలా కాలం తర్వాత ఆయన మీడియా ముందుకు వచ్చి పార్టీ పరిస్థితులపై మాట్లాడారు. ఈ క్రమంలో తెలంగాణ కాంగ్రెస్‌కు ప్రమాదకరమైన జబ్బు సోకిందని, వెంటనే ప్రక్షాళన చేయాలంటూ ఆయన వ్యాఖ్యానించడం కొసమెరుపు. మంగళవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ..
బాధతో ఈ ప్రెస్ మీట్ పెట్టాను. అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయం గురించి ఢిల్లీ పెద్దల దృష్టి కి తీసుకెళ్ళడం కోసమే వచ్చాను. వచ్చే డిసెంబర్ లో ఎన్నికలు ఉన్నాయి. కానీ, పార్టీ పరిస్థితి ఘోరంగా దిగజారింది. కాంగ్రెస్ చేసిన గొప్ప పనులు బతికిస్తాయనే ఆశతో ఇన్ని రోజులు క్యాడర్ ఎదురు చూస్తుంది. కానీ, కాంగ్రెస్‌లో లోపాలు ఉన్నాయి. అవి ఎక్కడ? అనే దానిపై కసరత్తు జరగాలి. ఎందుకనో అలా జరగడం లేదు. కొత్త కమిటీలను చూస్తే.. ఆ విషయం స్పష్టమవుతుంది. పీసీసీ డెలిగేట్స్ నుంచి ఇదే విధంగా తప్పులు జరుగుతున్నాయి. కొత్తగా వచ్చిన వారికి కమిటీలలో ప్రాధాన్యత ఇచ్చారు. ఏ లెక్క ప్రకారం కొత్త వారికి పదవులు ఇచ్చారు? 84 మంది జనరల్ సెక్రటరీలు అవసరమా? సమైక్య రాష్ట్రంలో కూడా ఇంతమంది జనరల్ సెక్రటరీలు లేరు.. అని ప్రశ్నించారాయన.
కమిటీలలో అనర్హులకు చోటు కల్పించారు. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లో గుర్తింపు లేదు. కాంగ్రెస్ సిద్ధాంతాలు ఏంటో తెలియని వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారు. ఈ క్రమంలో.. అసలైన కాంగ్రెస్ వాదులకు అన్యాయం జరుగుతోంది. కార్యకర్తల మనోభావాలు దెబ్బతీస్తే పార్టీ కే ప్రమాదం. పార్టీలో కష్టపడ్డవారికి గుర్తింపు లేదు. కోవర్టులకే గుర్తింపు ఉంటోంది. తెలంగాణ కాంగ్రెస్‌కు కోవర్ట్ ఇజం అనే ప్రమాదకరమైన జబ్బు సోకింది. ఎనిమిదేళ్లుగా.. కాంగ్రెస్‌కు కోవర్ట్ రోగం పట్టుకుంది. కొందరు ప్రభుత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పాటపాడుతూ ప్రభుత్వానికి మద్ధతు పలుకుతున్నారు. బీఆర్‌ఎస్‌కు కొన్ని అనుకూల శక్తులు పని చేస్తున్నాయి. అదే సమయంలో.. కోవర్టులకే కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉంటోంది.
రాబోయే పరిస్థితులు బాగా లేవు.. కాంగ్రెస్ అలెర్ట్ గా పనిచేయాలి. లోపం ఎక్కడ ఉంటుందో పార్టీలో చర్చ జరగడం లేదు.ఇప్పటికే తప్పిదాలు చాలా జరిగాయి. వ్యక్తి స్థాయిని బట్టి పార్టీ లో పదవులు ఇవ్వాలి. అసలు కాంగ్రెస్‌లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచన ఉందా.. లేదంటే ఎవరి సొంత ఎజెండా వారికి ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొందరైతే.. ఇతరులకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారా? అనిపిస్తోంది. సిద్ధిపేట జిల్లాలో కోవర్టులకు పోస్టులు ఇచ్చారు. ఎవరి ఇంట్రెస్ట్ ఏంటనేది తేలాలి. తెలంగాణ కాంగ్రెస్‌ను ప్రక్షాళన చేయాలి. ఇక నైనా జాగ్రత్తగా పనిచేయాలి. కోవర్ట్ ల వివరాలు ఆధారాలతో సహా సమాచారం ఏఐసీసీ కి ఇచ్చాం. . కోవర్ట్ లను గుర్తించే బాధ్యత హైకమాండ్ కు ఉంది. వాళ్లపై చర్యలు తీసుకోవాలి. నేను ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడం లేదు. నేను హైకమాండ్ ను గౌరవిస్తున్నా. కానీ ఆత్మగౌరవం తో బతుకుతా అంటూ వ్యాఖ్యానించారు దామోదర రాజనర్సింహ.
Comments
Please login to add a commentAdd a comment