సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి నుంచి(సోమవారం) మూడు రోజుల పాటు పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18,19,20 తేదీల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షను నిర్వహించనున్నారు. రెండు విడుతలుగా ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇంజనీరింగ్ స్ట్రీమ్ లో 1,72,241 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. తెలంగాణ లో 89, ఏపీ లో 19 పరీక్ష కేంద్రాల ఏర్పాటు చేశారు నిర్వాహణ అధికారులు. ఒక్క నిమిషం నిబంధన అమలు కానుంది. అంటే.. నిమిషం ఆలస్యమైనా అనుమతించరు. విద్యార్ధులను గంట ముందు నుండే పరీక్ష హాల్లోకి అనుమతిస్తున్నారు.
అగ్రికల్చర్ స్ట్రీమ్ పరీక్షలు వర్షాల కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారీ వర్షాలు, వరదల కారణంగా ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. వాయిదా వేసిన పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో 79 వేల 365 దరఖాస్తులు వచ్చాయి.
ప్రత్యేక ఏర్పాట్లు
తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెట్ వర్క్ ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంసెట్ నిర్వహణకు పకడ్బంది ఏర్పాట్లు చేశారు. నిమిషం రూల్ అమలు చేస్తున్నారు, సమయానికి నిమిషం ఆలస్యమైనా ఎగ్జామ్ సెంటర్ లోకి ఎంట్రీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. అభ్యర్థుల డాక్యుమెంట్లను పరిశీలించి, విద్యార్థులను కేంద్రాల్లోనికి పంపిస్తారు. మొబైల్స్ , వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. ఈ జాగ్రత్తలు అభ్యర్థులంతా ఖచ్చితంగా పాటించాలని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment