సాక్షి, హైదరాబాద్: లాటరీ ప్రక్రియ, పోటీలేకుండా నేరుగా లైసెన్సులు ఇచ్చే ‘ఎలైట్ బార్ల’తరహాలో.. ‘ఎలైట్ వైన్స్’విధానాన్ని తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతమున్న ఏ4 కేటగిరీ వైన్‌షాపులకు అదనంగా.. నగర ప్రాంతాల్లో ఈ ఎలైట్ వైన్స్ ఏర్పాటుకు అనుమతించే దిశగా కసరత్తు ప్రారంభించింది. వీటికి సాధారణ వైన్‌షాపుల కంటే కనీసం రెండింతలు, ఆపైన లైసెన్స్ ఫీజులను నిర్ణయించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది.
ఇప్పటికే రాష్ట్రంలో ఇలా నేరుగా లైసెన్సు మంజూరు చేసిన ‘టానిక్’ఎలైట్ వైన్‌షాపులు ఉన్నాయి. వాటికి ఇచ్చిన ఐదేళ్ల లైసెన్సుల గడువు ఈ ఏడాది మార్చితో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో.. టానిక్ షాపుల తరహాలోనే మరిన్ని ఎలైట్ వైన్‌షాపులు ఏర్పాటు చేసేందుకు.. వీటితోపాటు మరిన్ని వాకిన్ స్టోర్స్ (సూపర్ మార్కెట్ల తరహాలో లోనికి వెళ్లి నచ్చినవి ఎంచుకునే ఉండేవి)ను ఏర్పాటు చేసేందుకు ఎక్సైజ్ శాఖ రంగం సిద్ధం చేస్తోంది. అంతేగాకుండా హైదరాబాద్ నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో బార్ల సంఖ్యను కూడా పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. బార్లకు బాగా డిమాండ్ ఉన్న నేపథ్యంలో.. కొందరు బార్ లైసెన్సులను ఇతరులకు ఇస్తూ సొమ్ము చేసుకుంటున్నారని, అలా కాకుండా బార్ల సంఖ్యను పెంచడం ద్వారా డిమాండ్ తీరి, సర్కారుకు అదనపు ఆదాయమూ సమకూరుతుందని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఎక్సైజ్ ఆదాయం పెంపుకోసం..
2023–24లో రూ.19,884.90 కోట్ల మేర ఎక్సైజ్ ఆదాయాన్ని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగినట్టుగా రాబడి ఉంది. కాంగ్రెస్ సర్కారు తాజాగా పెట్టిన బడ్జెట్ (2024–25)లో మరో రూ. 6 వేల కోట్లు అదనంగా.. రూ.25,617.52 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకుంది. అంటే ప్రతి నెలా రూ.500 కోట్ల వరకు అదనపు ఆదాయాన్ని సమీకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం మద్యం ధరలు పెంచాలని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదన చేసినా ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఎలైట్ వైన్స్ ఏర్పాటు, బార్ల సంఖ్య పెంచడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవాలన్న దానిపై మాత్రం సానుకూలత వచ్చినట్టు ఎక్సైజ్‌శాఖ వర్గాలు చెప్తున్నాయి.
రిజిస్ట్రేషన్ల ఆదాయం యథాతథం
సర్కారు తాజా బడ్జెట్‌లో రాష్ట్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయ పద్దులో.. స్టాంపులు–రిజిస్ట్రేషన్ల శాఖ అంచనాలను యథాతథంగా కొనసాగించింది. గత బడ్జెట్ (2023–24)లో రూ.18,500 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ఆదాయ లక్ష్యం నిర్దేశించుకోగా.. ఈసారి (2024–25) స్వల్పంగా తగ్గించి రూ.18,228 కోట్ల రాబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రతిపాదనలను బట్టి ఈ ఏడాది భూముల విలువల పెంపు ఉండదని తెలుస్తోంది.
► వాహనాల పన్నుల ద్వారా రూ.8,477 కోట్లు, జీఎస్టీ ద్వారా రూ.50,762 కోట్లు వస్తుందని తాజా బడ్జెట్‌లో పేర్కొంది. జీఎస్టీ ద్వారా 2023–24లో రూ.40వేల కోట్ల రాబడి అంచనా వేయగా.. ఈసారి ఏకంగా రూ.10వేల కోట్లకుపైగా పెంచడం గమనార్హం. ఇక కేంద్ర జీఎస్టీ (సీజీఎస్టీ)లో వాటా ద్వారా మరో రూ.7,838 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది.
► 2023–24లో వ్యాపార, అమ్మకపు పన్ను ద్వారా రూ.39,500 కోట్లు వస్తాయని అంచనా వేయగా రూ.34,166 కోట్లు సమకూరాయి. దీంతో ఈసారి ఈ పద్దు కింద ఆదాయ అంచనాను గతంకన్నా తక్కువగా రూ.33,449 కోట్లుగా సర్కారు పేర్కొంది.
► పన్నేతర ఆదాయాన్ని కూడా ఈసారి బడ్జెట్‌లో తగ్గించి చూపెట్టారు. గత బడ్జెట్‌లో దీనిని రూ.22,801 కోట్లుగా అంచనా వేయగా.. తాజా బడ్జెట్‌లో రూ.20,658 కోట్లకు తగ్గించారు. అంటే ప్రజలపై నేరుగా భారం వేయకుండా, ఇతర మార్గాల ద్వారా పన్ను ఆదాయం పెంచుకునే దిశలో సర్కారు బడ్జెట్ ప్రతిపాదనలు చేసినట్టు స్పష్టమవుతోందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment