
సాక్షి, హైదరాబాద్: ‘అధికారిక పనుల నిమిత్తం అత్యవసరంగా పుదుచ్చేరి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరాను..’అంటూ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం మధ్యాహ్నం చేసిన ట్వీట్ రాష్ట్రంలో కొంత రాజకీయ వేడి పుట్టించింది. గవర్నర్ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి వస్తున్నారంటే మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చుననే చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం అందడంతోనే గవర్నర్ అత్యవసరంగా హైదరాబాద్‌కు బయలుదేరి ఉంటారనే ఊహాగానాలు కొనసాగాయి.
ఈటల బర్తరఫ్ నేపథ్యంలో..
మొన్నటివరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేసిన నేపథ్యంలో.. ఆ ఖాళీని భర్తీ చేయవచ్చని, అదే సమయంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ప్రస్తుత మంత్రివర్గంలో ఒకరిద్దరు మంత్రులపైనా వేటు పడుతుందని, కొత్తవారికి చోటు లభించే అవకాశాలున్నాయన్న ప్రచారమూ సాగుతోంది. ఈటల రాజేందర్‌ను తొలగించిన అనంతరం వైద్యారోగ్య శాఖను సీఎం కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. ఈ శాఖను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించవచ్చని బాగా ప్రచారం జరుగుతోంది. కరోనా నియంత్రణపై ఇటీవల సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశంలో హరీశ్‌రావు పాల్గొనడం, బుధవారం కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ రాష్ట్రాలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రం తరఫున హరీశ్‌రావు పాల్గొనడం ఈ ప్రచారానికి ఊతమిస్తోంది. వైద్యారోగ్య శాఖకు మంత్రిని నియమించే అవకాశాలుండడంతో రాష్ట్రంలో ఏ క్షణంలోనైనా మంత్రివర్గ విస్తరణ జరగొచ్చని అధికార పార్టీ నేతలు భావిస్తున్నారు.
ఇతర కార్యక్రమాల కోసమే..
అయితే రాజ్‌భవన్‌లో బుధవారం నిర్వహించతలపెట్టిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవంతో పాటు వర్చువల్‌గా జరిగే మరో కార్యక్రమంలో పాల్గొనడానికి మాత్రమే గవర్నర్ హైదరాబాద్‌కు వచ్చారని రాజ్‌భవన్ అధికార వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ విస్తరణ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు రాజ్‌భవన్‌కు ఎలాంటి అధికారిక సమాచారం లేదని అధికారులు మీడియాకు తెలియజేశారు. దీంతో గవర్నర్ అత్యవసర పర్యటనపై కొనసాగిన ఊహాగానాలకు బ్రేక్ పడినట్టు అయింది.
నర్సుల సేవలు అసమానమైనవి: గవర్నర్
కోవిడ్ సంక్షోభంలో నర్సులు అసమానమైన సేవలు అందిస్తున్నారని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కొనియాడారు. బుధవారం అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా.. రాజ్‌భవన్‌కు ఆనుకొని ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఆరోగ్య రంగంలో, రోగుల సేవలో నర్సులు అద్వితీయమైన, నిస్వార్థమైన సేవలు అందిస్తున్నారంటూ గవర్నర్ సెల్యూట్ చేశారు. కోవిడ్ సంక్షోభ సమయంలో ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారత్‌లో.. తమ ఆరోగ్యాలను, జీవితాలను పణంగా పెట్టి నర్సులు అందిస్తున్న సేవలు చాలా గొప్పవని పేర్కొన్నారు. ఆధునిక నర్సింగ్ వృత్తికి ఆద్యురాలైన ఫ్లోరెన్స్ నైటింగేల్‌కు గవర్నర్ నివాళులర్పించారు. వర్చువల్ పద్ధతిలో జరిగిన మరో కార్యక్రమంలో గవర్నర్.. తమిళనాడులోని నర్సులకు వారి అత్యుత్తమ సేవలకుగాను అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో గవర్నర్ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ పి.సౌందరరాజన్ పాల్గొన్నారు.