సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం అమలులో మరిన్ని సంస్కరణలు చేయాలని భావిస్తోంది. ఈ పథకం లబ్ధిదారుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంతో అమలు చేస్తుండగా... వారికి నిత్యం సహాయ, సహకారాలను అందించేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. లబ్ధిదారులు ఏర్పాటు చేసిన యూనిట్‌ను దళితబంధు వెబ్‌సైట్‌లో ఎంట్రీ చేసి, నిర్వహణ తీరును క్రమం తప్పకుండా రికార్డు చేసేందుకు ఈ ప్రత్యేక విభాగం పనిచేయనుంది.
లబ్ధిదారులు, జిల్లా సంక్షేమాధికారులతో సమన్వయానికి ఈ విభాగం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో ఈ విభాగాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఇప్పటికే దళితబంధు అమలుకు ఏడుగురు అధికారులతో ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. వివిధ సంక్షేమ శాఖలు, రెవెన్యూ అధికారులతో ఏర్పాటైన ఈ కమిటీ... క్షేత్రస్థాయిలో పరిస్థితులకు అనుగుణంగా పథకంలో సవరణలకు సూచనలిస్తోంది. తాజాగా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విభాగం రాష్ట్రస్థాయి కమిటీతో సమన్వయం చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.
నిర్వహణపై పర్యవేక్షణ...
దళితబంధు సాయంతో ఏర్పాటు చేసిన వ్యాపార యూనిట్ల తీరును ఈ ప్రత్యేక విభాగం క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తుంది. నెలకోసారి యూనిట్ నిర్వహణ తీరుపై సంబంధిత లబ్ధిదారుతో మాట్లాడి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటుంది. అంతేకాకుండా ఏవైనా సమస్యలెదురైతే... సంబంధిత కేటగిరీకి చెందిన నిపుణులతో సమన్వయపర్చి లబ్ధిదారులకు సలహాలు, సూచనలు ఇవ్వనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 34వేల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద ఎంపికయ్యారు. వీరి ఖాతాల్లో రూ.10లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం జమ చేసింది. ఇందులో ఇప్పటికే 8వేల మంది లబ్ధిదారులు వారి ఖాతా నుంచి నగదును ఉపసంహరించి వివిధ రకాల యూనిట్లను తెరిచారు. మరో రెండు నెలల్లో 50శాతానికి పైగా లబ్ధిదారులు యూనిట్లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment