ఆర్నెల్లు ఏం చేశారు? | Telangana HC Dismisses Petitions For Postponing Group 1 Mains Exam, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ఆర్నెల్లు ఏం చేశారు?

Published Sat, Oct 19 2024 4:15 AM | Last Updated on Sat, Oct 19 2024 3:32 PM

Telangana HC dismisses petitions for postponing Group 1 Mains exam

గ్రూప్‌–1 మెయిన్స్‌ వాయిదాకు హైకోర్టు ససేమిరా

ప్రిలిమ్స్‌ రాసి ఫలితాలు వచ్చాక నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తారా? 

90% మంది పరీక్షల హాల్‌ టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు

పరీక్షలకు అధికారులు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు  

ఇప్పుడు వాయిదా వేస్తే గ్రూప్‌–1 ప్రహసనంలా మారుతుంది

వేలాదిమంది ఆశలపై నీళ్లు చల్లలేం.. మెయిన్స్‌ వాయిదా వేయలేం 

సింగిల్‌ జడ్జి తీర్పులో జోక్యం చేసుకోలేమన్న ధర్మాసనం 

అప్పీళ్లలో మెరిట్స్‌ లేనందున కొట్టివేస్తున్నట్లు స్పష్టికరణ

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌–1 మెయిన్స్‌ పరీక్ష వాయిదాకు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం నిరాకరించింది. సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సమర్థించింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి అప్పీళ్లలో ఎలాంటి మెరిట్స్‌ లేవని వ్యాఖ్యానించింది. అప్పిలెంట్ల (పిటిషన్‌ వేసిన అభ్యర్థులు) తీరును తప్పుబట్టింది. ‘ఫిబ్రవరిలో రీ నోటిఫికేషన్‌ ఇస్తే ఆగస్టులో సవాల్‌ చేస్తారా? ప్రిలిమ్స్‌ కూడా రాసి, ఫలితాలు విడుదల చేసిన తర్వాత న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారా?’ అని ప్రశ్నించింది. మెయిన్స్‌కు అర్హత సాధించిన 31,383 మందిలో 90 శాతం పరీక్షల హాల్‌ టికెట్లు కూడా డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. వారి ఆశలపై నీళ్లు చల్లలేం. అధికారులు కూడా సెంటర్లలో ఏర్పాట్లు పూర్తి చేశారు. మరో రెండురోజుల్లో పరీక్ష అనగా ఇప్పుడు వాయిదా వేయడం సరికాదు. సింగిల్‌ జడ్జి అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే తీర్పునిచ్చారు. ఈ అప్పీళ్లను కొట్టివేస్తున్నాం..’ అని జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. 

సింగిల్‌ జడ్జి తీర్పుపై అప్పీళ్లు 
గ్రూప్‌–1 ప్రిలిమినరీ ‘కీ’లో తప్పులను, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును, రీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తూ దామోదర్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన సింగిల్‌ జడ్జి.. టీఎస్‌పీఎస్సీ వాదనలతో ఏకీభవిస్తూ పిటిషన్లను కొట్టివేశారు. సాంకేతిక అంశాలను నిపుణుల కమిటీలకే వదిలేయాలని కోర్టుల జోక్యం కూడదని తీర్పునిచ్చారు. అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ పిటిషనర్లు రెండు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి ధర్మాసనం విచారణ చేపట్టింది.  

రీ నోటిఫికేషన్‌తో అర్హులు పెరిగారు..  
పిటిషనర్ల తరఫు న్యాయవాదులు శివ, సుధీర్‌ వాదనలు వినిపిస్తూ.. ‘రీ నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు కమిషన్‌కు అధికారం లేదు. ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్‌ రద్దు చేసి 2024లో మళ్లీ ఇవ్వడంతో రెండేళ్లలో అర్హులు పెరిగారు. దరఖాస్తుల గడువు ఎట్టి పరిస్థితుల్లోనూ పెంచం అని చెప్పిన కమిషన్‌ రెండురోజులు పెంచింది. దీంతో దాదాపు 20 వేల దరఖాస్తులు పెరిగాయి. ఎస్టీ రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచారు. తొలి నోటిఫికేషన్‌ నాటికి ఈ రిజర్వేషన్లు 6 శాతమే. ఇది ఎస్టీలకు లబ్ధి చేకూర్చినా.. మిగతావారు పోస్టులు కోల్పోయే అవకాశం ఉంది. అప్పిలెంట్లు ప్రిలిమ్స్‌ ప్రాథమిక ‘కీ’ లోని 15 ప్రశ్నలపై అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని నిపుణుల కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. 6 ప్రశ్నలు (41, 66, 79, 112, 114, 119) పూర్తిగా తప్పుల తడకగా ఉన్నాయి. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని మెయిన్స్‌ వాయిదా వేయాలి. స్వతంత్ర నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి ‘కీ’ రూపొందించాలి..’ అని కోరారు.  

ఇలానే ప్రశ్నలు అడగాలని టీఎస్‌పీఎస్సీని కోరలేరు.. 
    టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘పిటిషనర్లు 8 మందిలో ఇద్దరు మెయిన్స్‌కు అర్హత సాధించారు. అయితే ‘కీ’పై ఒక్కరు మాత్రమే అభ్యంతరం తెలిపారు. అతను కూడా సరైన సమాధానమే ఇచ్చారు. ప్రశ్నలు ఎలా అడగాలి అనేది నియామక సంస్థ పరిధిలోని అంశం. రాజ్యాంగ బద్ధమైన సంస్థను ఇలానే ప్రశ్నలు అడగాలని ఎవరూ కోరలేరు. ‘కీ’ ఇలానే ఉండాలని కూడా నిర్ణయించలేరు. 6,175 అభ్యంతరాలను స్వీకరించాం. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నిర్ణయం మేరకే 2 ప్రశ్నలు తొలగించాం. మెయిన్స్‌కు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. 90 శాతం మంది హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. సాంకేతిక కారణాలతో దరఖాస్తులకు 2 రోజులు సమయం ఇచ్చాం. అప్పీళ్లలో మెరిట్‌ లేదు కొట్టివేయాలి..’ అని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం ధర్మాసనం తీర్పు వెలువరించింది. 

ఏ ప్రశ్న సరైందో న్యాయస్థానాలు తేల్చలేవు 
    ‘8 మంది అప్పిలెంట్లలో ఇద్దరు మాత్రమే ‘కీ’పై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. 15 ప్రశ్నలకు అభ్యంతరాలు తెలుపగా, నిపుణుల కమిటీ వాటిని పరిశీలించింది. ఇలా 6,147 అభ్యంతరాలను పరిశీలించిన తర్వాతే తుది ‘కీ’ విడుదల చేసింది. ఏ ప్రశ్న సరైంది.. ఏది కాదో.. న్యాయస్థానాలు తేల్చలేవు. నిపుణుల కమిటీనే నిర్ణయం తీసుకోవాలి. నోటిఫికేషన్‌లోనే ప్రిలిమ్స్, మెయిన్స్‌ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో తెలంగాణ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చెప్పింది. అక్టోబర్‌లో మెయిన్స్‌ అని తెలిసినా పిటిషనర్‌లు ఆలస్యంగా కోర్టును ఆశ్రయించారు. రెండేళ్లలో రెండుసార్లు ప్రిలిమ్స్‌ రద్దయ్యింది. ఇటీవల జరిగింది మూడోది. ఇప్పుడు మెయిన్స్‌ కూడా వాయిదా వేస్తే అభ్యర్థుల్లో తీవ్ర నైరాశ్యం నెలకొంటుంది. గ్రూప్‌–1 ఒక ప్రహసనంలా మారుతుంది..’ అని ధర్మాసనం తన తీర్పులో స్పష్టం చేసింది.  

నిరుద్యోగుల్లో నైరాశ్యం ఏర్పడుతోంది 
మానవ తప్పిదం కారణంగా కొన్ని పొరపాట్లు జరిగి ఉండవచ్చు. తొలిసారి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ 5 లక్షల మంది రాశారు. రెండుసార్లు రద్దు తర్వాత 3 లక్షలే రాశారు. అభ్యర్థుల్లో నిరాసక్తత పెరిగిపోతోంది. నిరుద్యోగుల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడుతోంది. కొందరు అత్యాహత్యాయత్నాలకు కూడా పాల్పడుతున్నారు. ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకోవాలి. లక్షల మంది మనోభావాలను అర్థం చేసుకోవాలి. ఆరుగురి కోసం వేలాది మందిని అసహనానికి గురి చేయడం సరికాదు. మెయిన్స్‌ వాయిదా వేయడం సాధ్యం కాదు. 2011లో మాదిరిగా ఆదేశాలిస్తే.. ఇక టీఎస్‌పీఎస్సీ ఈ గ్రూప్‌–1 పరీక్ష ఎప్పటికి పూర్తి చేస్తుందో తెలియదు. రీ నోటిఫికేషన్‌ను సవాల్‌ చేస్తున్నప్పుడు ప్రిలిమ్స్‌ ఎలా రాశారు? పోస్టులను పెంచే, తగ్గించే అధికారం కమిషన్‌కు ఉంటుంది. రీ నోటిఫికేషన్‌తో వచ్చిన నష్టం ఏంటి? రద్దు చేసి అదేరోజు మళ్లీ నోటిఫికేషన్‌ ఇచ్చారు కదా?  – జస్టిస్‌ షావిలి 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement