సాక్షి, హైదరాబాద్: ఇటీవల మెదక్‌లో జరిగిన ఖదీర్ ఖాన్ లాకప్‌డెత్ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర హోం కార్యదర్శి, డీసీపీ, మెదక్ ఎస్పీలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 14కు వాయిదా వేసింది. మెదక్ పట్టణానికి చెందిన ఖదీర్ ఖాన్...గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 16వ తేదీ రాత్రి మృతి చెందాడు.
దొంగతనం కేసులో అతన్ని పోలీసులు తీవ్రంగా కొట్టడం వల్లే మృతి చెందాడంటూ ఆయన భార్య సిద్ధేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని హైకోర్టు సుమోటో పిల్‌గా విచారణకు స్వీకరించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది.
ఏఏజీ రామచంద్రరావు పోలీసుల తరఫున వాదనలు వినిపిస్తూ...ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ఖదీర్‌ను హాజరుపరిచిన 14 రోజుల తర్వాత అతను మృతి చెందాడని చెప్పారు. వాదనల తర్వాత ధర్మాసనం..ఖదీర్ భార్య తన భర్తను లాకప్‌డెత్ చేశారని ఆరోపిస్తోందని, దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
సిట్‌తో విచారణ జరిపించాలి...
ఖదీర్ మృతిపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని, ప్రభుత్వం రూ.50 లక్షల పరిహారం చెల్లించాలని కోరుతూ అతని భార్య సిద్ధేశ్వరి లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను అత్యంత క్రూరంగా చంపారని, సీసీటీవీ ఫుటేజీ ఫ్రీజ్ చేసేలా ఎస్పీకి ఆదేశాలివ్వాలని న్యాయస్థానానికి ఆమె విజ్ఞప్తి చేశారు.
ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి విచారణ చేపట్టారు. స్పెషల్ జీపీ సంతోశ్‌కుమార్ హాజరై.. సుమోటో పిల్ వివరాలను తెలిపారు. తదుపరి వాదనల కోసం ఈ పిటిషన్‌ను కూడా పిల్‌తోపాటే జతచేయాలని రిజిస్ట్రీకి సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment