ఆ వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోండి
చట్ట ప్రకారం నిర్ణయం తీసుకుని పిటిషనర్లకు తెలియజేయండి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై హైకోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: దేశంలోని ప్రతి ఒక్కరికీ మతం వద్దు, కులం వద్దు అనుకునే స్వేచ్ఛను రాజ్యాంగం ఇచ్చిందని ఓ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు స్పష్టం చేసింది. కులాన్ని, మతాన్ని ప్రకటించడానికి, ఆచరించడానికి ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ ఉందని అభిప్రాయపడింది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలంటూ పిటిషనర్లు అక్టోబర్ 29న, నవంబర్ 1న ఇచ్చిన వినతిపత్రాలను పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే నవంబర్ 6 నుంచే సర్వే ప్రారంభమవుతున్నందున ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పింది.
ఏ నిర్ణయం తీసుకున్నదీ పిటిషనర్లకు తెలియజేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 4కు వాయిదా వేసింది. ప్రభుత్వం నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో ‘కులం లేదు, మతం లేదు’అనే కాలమ్‌ను చేర్చాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ వాహీద్, కృష్ణ చంద్ రెండుసార్లు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అయినా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారుల తీరు ఉన్నత న్యాయస్థానం గత ఉత్తర్వులకు విరుద్ధమంటూ వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ సూరేపల్లి నందా మంగళవారం విచారణ చేపట్టారు.
వాదనల అనంతరం.. ‘మతం లేదు.. కులం లేదు’ అనుకునేవారి కోసం భారత సెన్సెస్ కమిషన్ వాటిని ప్రస్తావించకుండా స్వేచ్ఛను మంజూరు చేసిందని న్యాయమూర్తి తెలిపారు. 2010, 2021లో దాఖలైన పిటిషన్లలో హైకోర్టు ఇచ్చిన తీర్పులను ప్రస్తావించారు. పాఠశాల విద్యా సర్టిఫికెట్లలో కులం, మతం ప్రస్తావన వద్దంటూ పిటిషనర్లు కోరగా, వారికి అనుకూలంగా ఉత్తర్వులు వెలువడ్డాయని చెప్పారు. తదుపరి విచారణలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, జీఏడీ, సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment