హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల వెన్నులో ఇవాళ(బుధవారం, డిసెంబర్ 4 2024) స్వల్ప భూకంపం వణుకు పుట్టించింది. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు.. బయటకు పరుగులు తీశారు. మీడియా కథనాలతో తమవారి క్షేమసమాచారం గురించి.. ప్రకంపనల గురించి ఆరాలు తీస్తూ కనిపించారు. మరోపక్క.. మళ్లీ భూకంపం రావొచ్చన్న వదంతుల నడుమ చాలా గ్రామాల్లో ప్రజలు సాయంత్రం దాకా రోడ్ల మీదే గడుపుతూ కనిపించారు.
భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.0గా నమోదైందని, తెలంగాణలోని ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్-ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు వెల్లడించారు. భూకంప కేంద్రం నుంచి 225 కి.మీ పరిధిలో ఈ ప్రకంపనల ప్రభావం కనిపించిందన్నారు.ఆస్తి, ప్రాణ నష్టం నమోదు కాలేదని ప్రకటించారు.
👉హైదరాబాద్ సహా ఉమ్మడి ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, జనగామ జిల్లాల పరిధిలో ప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్ నగర పరిధిలోని వనస్థలిపురం, హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఏపీలోని విజయవాడ, విశాఖపట్నం, జగ్గయ్యపేట, నందిగామ, ఏలూరు సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించింది.
👉1969లో భద్రాచలం పరిసరాల్లో దాదాపు ఇదే తీవ్రతతో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. సుమారు 50 ఏళ్ల తర్వాత నేడు ఆ తీవ్రతతో ప్రకంపనలు వచ్చాయని భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూమి పగుళ్లలో ఒత్తిడితో స్థానచలనం జరిగి ప్రకంపనలు వస్తుంటాయని తెలిపారు.
👉హైదరాబాద్, భద్రాచలం, ఏటూరు నాగారం, ములుగు తదితర ప్రాంతాలు జోన్-3లో ఉన్నాయన్నారు. కానీ, జోన్-5లో ఉన్న ఉత్తర భారతంలోని ప్రాంతాలతో పోలిస్తే మన దగ్గర తీవ్రత తక్కువగా ఉంటుందని చెప్పారు. దీంతో.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు.
👉ములుగు నుంచి 50 కిలోమీటర్లు ఈశాన్యం వైపు ఏటూరు నాగారం భూకంప కేంద్రంలో రిక్టర్ స్కేల్ పై 5 తీవ్రతగా భూకంపం నమోదైంది. గతంలో 1969, 2018లో కొత్తగూడెం, భద్రాచలంలో భూ ప్రకంపనలు వచ్చాయి.
👉తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలపై తెలంగాణ విపత్తు నిర్వహణశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ములుగు జిల్లా మేడారం వద్ద భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు చెప్పారు. భూమికి 40 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. భూకంప కేంద్రం ఎక్కువ లోతులో ఉన్నందున ప్రకంపనల తీవ్రత తక్కువగా ఉందని చెప్పారు. ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఎలాంటి నష్టం జరగలేదని, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, వదంతులు నమ్మొద్దని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment