
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్త లాక్‌డౌన్ నేపథ్యంలో పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా పారిశ్రామిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. పారిశ్రామిక, సర్వీసు రంగాల కార్యకలాపాలకు సం బంధించిన మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. టెలీకమ్యూనికేషన్స్, ఇంటర్నెట్ సర్వీసులు, ఐటీ, ఐటీ ఆధారిత సేవల కార్యకలాపాలను వీలైనంత తక్కువ మంది సిబ్బందితో నిర్వహించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.
కోల్డ్ స్టోరేజీ, వేర్ హౌజింగ్ సర్వీసులు, సరుకుల రవాణా, కార్మికుల రాకపోకలకు అనుమతి, ఈ–కామర్స్, హోం డెలివరీ సర్వీసులు, విద్యుత్ ఉత్పత్తి, సరఫరా, పంపిణీకి అనుమతిస్తారు. పరిశ్రమల నిర్మాణ పనులు యథావిధిగా నడుస్తాయి. లాక్‌డౌన్ మినహాయింపు వేళల్లోనే కార్మికుల రాకపోకలకు అనుమతి ఉంటుంది. లాక్‌డౌన్ సమయంలో కార్మికులకు పరిశ్రమల ఆవరణలోనే వసతి ఏర్పాటు చేయాలి. ఐడీ కార్డులు ఉన్న కార్మికుల రాకపోకలకు అనుమతి ఇస్తారు.
మ్యానుఫాక్చరింగ్ యూనిట్లు కార్మికుల శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేయడంతో పాటు, పాజిటివ్ వచ్చిన వారిని క్వారంటైన్‌కు తరలించడంతో పాటు వేతనాలు కూడా చెల్లించాలి. కార్మికులు పాజిటివ్‌గా తేలితే శానిటైజేషన్ చేపట్టిన తర్వాతే కార్యకలాపాలు ప్రారంభించాలి. భోజన, టీ విరామ సమయంలో కార్మికులు గుమికూడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 500కు మించి కార్మికులు పనిచేసే పరిశ్రమలు సొంత క్వారంటైన్ వసతి ఏర్పాటు చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment