Weather Alert : Telangana Heavy Rains For Next 3 Days - Sakshi
Sakshi News home page

Telangana: జడివాన..మరో 3 రోజులు కుండపోతే..!

Published Tue, Aug 31 2021 2:14 AM | Last Updated on Tue, Aug 31 2021 1:21 PM

Telangana May Faces Heavy Rainfall Upcoming 3 Days - Sakshi

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు 

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటికే రెండు రోజులుగా భారీ వర్షాలతో జిల్లాలు అతలాకుతలం అవుతుండగా.. మరో 3,4 రోజులు కుండపోత వానలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణతో పాటు ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇక ఆది, సోమవారాల్లో కురిసిన వర్షాలతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల ఊర్లకు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు నీటమునిగాయి. రహదారులు, వంతెనలపై వరద ప్రవాహాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆది, సోమవారాల్లో వరదలో కొట్టుకుపోయి.. నలుగురు మృతిచెందగా, మరికొందరు గల్లంతయ్యారు.  

హైదరాబాద్‌లో ఆరెంజ్‌ అలర్ట్‌ 
హైదరాబాద్‌లో ఆదివారం మధ్యాహ్నం నుంచే వానలు పడుతున్నాయి. వాతావరణం పూర్తిగా మేఘావృతమైంది. సోమవారం కుత్బుల్లాపూర్, షాపూర్‌నగర్‌లలో 4.1, కంచన్‌బాగ్‌లో 4 సెంటీమీటర్ల వర్షం పడింది. మరిన్ని రోజులు వానలు పడే నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసి.. లోతట్టు, ముంపు ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. 

రానున్న ఐదు రోజుల్లో.. 
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మరికొద్దిరోజుల పాటు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కొన్నిప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్ధిపేట, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో అత్యంత భారీగా.. మంచిర్యాల, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, జనగామ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌ జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. మూడు, నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని తెలిపింది. 

అప్రమత్తంగా ఉండండి: సీఎస్‌ 
రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా జిల్లా కలెక్టర్లు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆదేశించారు. సోమవారం ఆయన డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వాతావరణశాఖ సూచనలకు అనుగుణంగా.. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటి పారుదల, విద్యుత్‌ శాఖల అధికారులు జాగ్రత్తగా పరిస్థితులను సమీక్షించాలని సూచించారు. క్షేత్రస్థాయి అధికారులు, ఉద్యోగులు పని ప్రదేశంలోనే అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. ఎక్కడికక్కడ పరిస్థితులను నిశితంగా పరిశీలించాలని.. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బందితో నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. 
 
రాష్ట్రవ్యాప్తంగా వానలు 

  • కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని దహెగాం, బెజ్జూర్, సిర్పూర్‌(టి), తిర్యాణి, ఆసిఫాబాద్‌ మండలాల్లో ఆదివారం రాత్రి నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు కుండపోత కురిసింది. దహెగాం మండలంలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురంభీం ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తుండటంతో మూడు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు జడివాన కురిసింది. ఖిలా వరంగల్‌లో ఏకంగా 14 సెంటీమీటర్లు, లింగాల ఘన్‌పూర్, పాలకుర్తిలలో 12.3 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. వరంగల్‌ నగరంలోని 33 కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇళ్లు, గుడిసెల్లోకి నీరు చేరడంతో సామగ్రి నీటమునిగింది. 
  • సిద్దిపేట జిల్లావ్యాప్తంగా సగటున 7.9 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. సుమారు ఏడు వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. సిద్దిపేట–హన్మకొండ మార్గంలో బస్వాపూర్‌ వద్ద మోయతుమ్మెద వాగు వంతెనపై లారీ చిక్కుకుపోయింది. స్థానికులు లారీ డ్రైవర్‌ను రక్షించారు. 
  • ఉమ్మడి కరీంనగర్‌ జిల్లావ్యాప్తంగా సోమవారం భారీ వర్షాలు కురిశాయి. లోయర్‌ మానేర్‌ డ్యాం (ఎల్‌ఎండీ)కి భారీగా వరద వస్తుండటంతో 8 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల నుంచి సిద్దిపేట రహదారి తంగళ్లపల్లి నీట మునిగి.. రాకపోకలు ఆగిపోయాయి. వేములవాడలో భారీ వర్షంతో రాజన్న ఆలయం ఎదుట భారీగా నీళ్లు నిలిచాయి.  
  • ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఐదు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 
  • కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలతో సింగితం రిజర్వాయర్, కౌలాస్, పోచారం ప్రాజెక్టులు నిండిపోయాయి. మద్నూర్‌ మండలంలో పెసర, మినుము పంటలు నీటమునిగాయి.

     

ఇద్దరు మృతి.. మరో ఇద్దరు గల్లంతు 

  • యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం కుర్రారం శివారులోని దోసల వాగుదాటుతూ ఓ బైక్‌ వాగులో పడిపోయింది. ఆ బైకు నడుపుతున్న శ్రవణ్‌ బయటపడగా.. జనగామ జిల్లా చిన్నమడూరుకు చెందిన సింధూజ (26), రాజాపేట మండలం బొందుగులకు చెందిన హిమబిందు (23) వాగులో కొట్టుకుపోయారు. నిజానికి శ్రవణ్, సింధూజ, హిమబిందుతోపాటు సింధూజ తల్లిదండ్రులు, మరికొందరు బంధువులు కలిసి బొందుగుల గ్రామానికి వెళుతున్నారు. ఈ ముగ్గురూ బైక్‌పై వెళ్తుండగా మిగతావారు కారులో ఉన్నారు. ఆ కారు మొదట వాగు దాటింది. వెనకాల బైక్‌ మీద వస్తున్నవారు వాగులో పడిపోయారు. తమ కళ్లముందే ఇద్దరు యువతులు కొట్టుకుపోవడంతో.. కుటుంబ సభ్యులు, బంధువుల హతాశులయ్యారు. కాగా.. సోమవారం సాయంత్రం పారుపెల్లి వాగు సమీపంలో సింధూజ మృతదేహం లభించింది. హిమబిందు ఆచూకీ దొరకలేదు. 
  • హన్మకొండ కాకాజీ కాలనీలో వరద నీరు నిండటంతో డ్రైనేజీ ఉందని గుర్తించలేక ఓ యువకుడు మృతి చెందాడు. అతడిని వరంగల్‌ నగరంలోని శివనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఓరం క్రాంతికుమార్‌ (28)గా గుర్తించారు. 
  • ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలం దానాపూర్‌కు చెందిన టేకం దోబీరావు (33) ఆదివారం అర్ధరాత్రి జండగూడ వాగులో గల్లంతయ్యాడు.  
  • సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేటకు భూపతిరెడ్డి, మరొకరితో కలిసి బైక్‌పై వెళ్తుండగా.. కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం వద్ద వరద ప్రవాహంలో కొట్టుకుపోయారు. కొంతదూరంలో చెట్టును పట్టుకుని నిలబడగా>.. స్థానికులు రక్షించారు. 
  • యాదాద్రి జిల్లా రాజాపేట మండలం పారుపల్లి వాగు ప్రవాహంలో రాగుల బాలరాజు, చిన్నం బాలరాజు అనే గొర్రెల కాపరులు చిక్కుకుపోగా పోలీసులు వారిని కాపాడారు. 
  • సిద్దిపేట మండలం మిట్టపల్లి శివారులోని వాగులో ఓ కారు చిక్కుకుంది. అందులో ప్రయణిస్తున్న సిద్దిపేట వాసులు కూడవెళ్లి భాను, మురం భానులను పోలీసులు రక్షించారు. 

 నవ వధువు కన్నుమూసింది 

  • వరుడి అక్క కూడా మృతి 

వికారాబాద్‌ జిల్లా మర్పల్లి మండలం తిమ్మాపూర్‌ వాగులో గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలు సోమవారం లభ్యమయ్యాయి. జిల్లాలోని మోమిన్‌పేట్‌ నుంచి రావులపల్లికి వస్తున్న పెళ్లికారు ఆదివారం సాయంత్రం తిమ్మాపూర్‌ వద్ద వరదలో కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. కారులో వధువు ప్రవళిక (19), వరుడు నవాజ్‌రెడ్డి, ఆయన అక్కలు రాధిక, శ్వేత, ఆమె కుమారుడు శశాంక్‌రెడ్డి, డ్రైవర్‌ రాఘవేంద్రరెడ్డి ఉన్నారు. వీరిలో నవాజ్‌రెడ్డి, రాధిక ఆదివారమే ప్రాణాలతో బయటపడ్డారు. ప్రవళిక, శ్వేతల మృతదేహాలు సోమవారం ఉదయం లభించాయి. శశాంక్‌రెడ్డి ఆచూకీ ఇంకా దొరకలేదు.  

పరారైన డ్రైవర్‌.
వాగులో కారు కొట్టుకుపోయిన కొంతసేపటికే డ్రైవర్‌ రాఘవేందర్‌రెడ్డి సురక్షితంగా బయటపడ్డాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరిన అతను.. భయంతో పరారయ్యాడు. ఈ విషయాన్ని గుర్తించిన పోలీసులు.. సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. కాగా.. కారు కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌.. సోమవారం ఉదయమే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రవళిక, శ్వేత మృతదేహాలను స్వయంగా తరలించారు. 

వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి 
వికారాబాద్‌ జిల్లా పులుమామిడి వద్ద ఆదివారం సాయంత్రం వాగులో కొట్టుకుపోయిన చాకలి శ్రీనివాస్‌ మృతిచెందాడు. ఘటనా స్థలానికి సమీపంలోని చెట్ల పొదల్లో సోమవారం ఉదయం మృతదేహం లభ్యమైంది.   

వాగులో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు 
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట–లింగన్నపేట మధ్య మానేరువాగు ఉప్పొంగి వంతెనపై నుంచి నీరు ప్రవహిస్తోంది. సోమవారం సాయంత్రం కామారెడ్డి నుంచి సిద్దిపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వరద తాకిడికి వంతెనపై అదుపుతప్పింది. ఒక టైర్‌ కిందికి దిగి ఆగిపోయింది. త్రుటిలో భారీ ప్రమాదం తప్పింది. గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకుని డ్రైవర్‌ సీటు పక్కన ఉండే కిటికీలోంచి ప్రయాణికులను రక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement