ఉప్పల్ లో జెన్‌నెక్ట్స్ స్క్వేర్ ప్రాజెక్ట్ నమూనాను పరిశీలిస్తున్న మంత్రి కేటీఆర్
ఉప్పల్ (హైదరాబాద్): హైదరాబాద్‌లోని పశ్చిమ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమైన ఉన్న ఐటీ రంగాన్ని గ్రిడ్ పాలసీలో భాగంగా నగరం దశదిశలా విస్తరించేందుకు కృషి జరుగుతోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. పశ్చిమ ప్రాంతానికి దీటుగా తూర్పు ప్రాంత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఐటీ కారిడార్ పూర్తయితే లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జెన్ ప్యాక్ట్, రాంకీ ఎస్టేట్స్ సంస్థల సంయుక్తాధ్వర్యంలో ఉప్పల్ జెన్ ప్యాక్ట్ ఆవరణలో జరుగుతున్న జెన్‌నెక్ట్స్ స్క్వేర్ ప్రాజెక్ట్‌కు ఆదివారం కేటీఆర్ శంకుస్థాపన చేశారు.
హైదరాబాద్ తూర్పు ప్రాంతంలో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో నూతన ప్రాజెక్టు రావడం అద్భుతమని అన్నారు. ఉప్పల్ ప్రాంతంలో లక్షమంది ఐటీ ఉద్యోగులకు వసతి కల్పించేలా నివాస మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. దీంతో పాటు పశ్చిమ హైదరాబాద్‌లోని సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ తరహాలో రాచకొండ ప్రాంతంలో మరో సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పలువురు జెన్‌ప్యాక్ట్ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment