గడువులోగా ఆ పనులు పూర్తి చేయకుంటే ఉద్యోగం ఊస్టే! | Telangana Minister KTR Warns GHMC Zonal Commissioner Over Septic Works To Complete | Sakshi
Sakshi News home page

Telangana: ఉద్యోగం ఊస్టే! నాలా పనులు పూర్తి చేయకుంటే వేటే

Published Fri, Jun 3 2022 1:56 AM | Last Updated on Fri, Jun 3 2022 11:48 AM

Telangana Minister KTR Warns GHMC Zonal Commissioner Over Septic Works To Complete - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ఈసారి వర్షాకాలంలో ప్రాణాపాయం వంటి ఘటనలు తలెత్తకుండా ఉండేందుకు మంత్రి కేటీఆర్‌తో పాటు ఉన్నతాధికారులు కొత్త కాలంగా హెచ్చరికలు జారీ చేస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడ నిర్లక్ష్యం కనిపించినా  వేటు తప్పదని హెచ్చరించడంతో ఆమేరకు చర్యలకూ  ప్రభుత్వం వెనుకాడబోదని భావిస్తున్న ఉన్నతాధికారులు.. ముఖ్యంగా జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్లు సంబంధిత అధికారులు, సిబ్బందిని హెచ్చరిస్తున్నారు.

ఈ నెల 5లోగా రక్షణ చర్యలన్నీ తీసుకోవాలని.. నాలాలు, మ్యాన్‌హోళ్ల వంటి ప్రాంతాలతోపాటు రోడ్లు, ఫుట్‌పాత్‌ల మార్గాల్లో సైతం గోతులుండరాదని మున్సిపల్‌ శాఖ స్పెషల్‌ సీఎస్‌ మెమో జారీ చేసిన నేపథ్యంలో.. నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ప్రాణాపాయం జరిగితే ప్రభుత్వం క్రిమినల్‌ కేసులు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి తొలగిస్తుందని పనులు సత్వరం పూర్తి చేయాల్సిందిగా ఆదేశించారు.

నాలా సేఫ్టీలో భాగంగా చేపట్టాల్సిన పనులతో పాటు ఇతర ప్రాంతాల్లోని పనుల్ని సైతం  వెంటనే పూర్తిచేయాలని, పూర్తయ్యే అవకాశం లేని ప్రాంతాల్లో బారికేడింగ్స్‌తో పాటు ఇతరత్రా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని జోనల్‌ కమిషనర్లు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే అధికారుల టీమ్స్‌కు నాలుగైదు రోజుల క్రితమే సర్క్యులర్లు జారీ చేశారు. సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా పైపైనే చూస్తే సరిపోదని తాము సర్వేచేయాల్సిన ప్రాంతాల్లో అన్ని ప్రదేశాలకూ నడిచి వెళ్లి,  క్షేత్రస్థాయి పరిస్థితులు క్షుణ్నంగా పరిశీలించి, రక్షణ ఏర్పాట్లు నూరు శాతం ఉన్నట్లు నిర్ధారించుకొని ధ్రువీకరించాలని పేర్కొన్నారు.  

ఇవీ బాధ్యతలు.. 
►మాన్సూన్‌ సేఫ్టీ ఆడిట్‌లో భాగంగా క్షేత్రస్థాయిలో సర్వే చేయాల్సిన బృందాల్లో నియమించిన  డిప్యూటీ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ విభాగంలోని ఎస్‌ఈ, ఈఈలు, డీఈఈలు, ఏఈలు, టౌన్‌ప్లానింగ్‌ విభాగంలోని సీపీ, జోనల్‌ ఏసీపీలు, సర్కిల్‌స్థాయిల్లోని ఏసీపీలు, ఎస్‌ఓలు, శానిటేషన్‌ విభాగానికి సంబంధించిన ఏఎంఓహెచ్‌లు, డిప్యూటీఈఈలు, శానిటరీ సూపర్‌వైజర్లు తదితరులు కిందివిధంగా పనులు పూర్తిచేయాలని సూచించారు.

►తాము సర్వే చేయాల్సిన ప్రాంతంలోని ప్రతి రోడ్డు, లేన్, బైలేన్లు, డ్రెయిన్ల వెంబడి  నడచుకుంటూ  వెళ్లి చూడాలి. వాహనాల్లో అయితే సరిగ్గా తెలియదని నడవాలని పేర్కొన్నారు. గుంతలు, రోడ్‌కటింగ్‌లు ఉంటే సంబంధిత ఈఈ దృష్టికి తెచ్చి వెంటనే పూడ్పించాలి. రెండు మీటర్ల కంటే  ఎక్కువ  వెడల్పున్న అన్ని నాలాలకు ఫెన్సింగ్‌ ఉండాలి. అంతకంటేతక్కువ వెడల్పున్న నాలాలకు పైకప్పులుండాలి. అన్ని క్యాచ్‌పిట్లపై మూతలుండాలి. మూతలకు పగుళ్లు ఉండరాదు. అలాంటివాటిని మార్చాలి.  

►అన్ని కల్వర్టుల వద్ద రక్షణ కంచెలుండాలి.అవసరమైన అన్ని ప్రాంతాల్లో  ప్రమాద హెచ్చరిక బోర్డులుండాలి. ఈ పనులు పూర్తి చేశాక అన్ని ప్రాంతాల్లో నూరు శాతం సేఫ్టీ ఉన్నట్లు క్షేత్రస్థాయి అధికారి, డిప్యూటీ కమిషనర్, ఈఈలు ధ్రువీకరించాలి. నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం సహించే పరిస్థితి లేదని, తీవ్రంగా పరిగణించడంతో పాటు తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోనుందని, మరణాలు సంభవిస్తే క్రిమినల్‌ కేసు నమోదు చేయడంతో పాటు ఉద్యోగం నుంచి డిస్మిస్‌ చేయనున్నట్లు తీవ్రంగా          హెచ్చరించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement