సాక్షి, హైదరాబాద్: చాలాకాలం తర్వాత ఊళ్లల్లో ‘పల్లె వెలుగు’బస్సులు సందడి చేస్తున్నాయి. తమ ఊరికి బస్సు వచ్చిందం టూ పల్లెవాసులు సంబరపడిపోతున్నారు. మూడు, నాలుగేళ్లుగా మాయమవుతూ వచ్చిన పల్లెవెలుగు బస్సులు ఇప్పుడు మళ్లీ ఊరిబాట పట్టడంతో వాటిల్లో ప్రయాణించేవారి సంఖ్య కూడా పెరిగింది. గతవారంరోజులుగా 3 వందల ఊళ్లకు బస్సుల రాకపోకలు మొదలయ్యాయి.
సోమవారం నాటికి(హైదరాబాద్ సిటీ జోన్‌లో ఉన్న బస్సులు మినహా) మొత్తం 6,583 బస్సులు తిరుగుతున్నాయి. ఇది గత మూడేళ్లలోనే గరిష్ట సంఖ్య కావటం విశేషం. వీటిల్లో 3,508 పల్లెవెలుగు బస్సులు గ్రామాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇందులో ఆర్టీసీ సొంత పల్లెవెలుగు బస్సులు 1,811 కావటం విశేషం. సోమవారంనాటికి ఈ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో గరిష్టంగా 63 శాతానికి చేరింది. కోవిడ్ సంక్షోభం తర్వాత ఇదే అత్యధిక ఆక్యుపెన్సీ రేషియో కావటం విశేషం.
ఆక్యుపెన్సీ రేషియో లేదని..
ఆర్టీసీలో 2019లో జరిగిన సమ్మెతో మొత్తం పరిస్థితి తల్లకిందులైన సంగతి తెలిసిందే. సమ్మెను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆర్టీసీలో ఎన్నో మార్పులను చేసింది. ప్రధానంగా ఆక్యుపెన్సీ రేషియో తగ్గిన పల్లెవెలుగు బస్సులపై వేటువేసింది. ఇక ఊరి రోడ్లు అంత అనుకూలంగా లేకపోవటంతో వీటిల్లో డీజిల్ వినియోగం కాస్త ఎక్కువే. వెరసి ఖర్చు భారీగా ఉండేది. సమ్మెకు పూర్వం నుంచి ఈ నష్టాలు పెరుగుతూ రావటంతో పల్లెవెలుగు బస్సుల ట్రిప్పులు తగ్గించారు. దాదాపు 3వేల ఊళ్లకు బస్సులు నిలిచిపోయాయి.
ట్విట్టర్‌లో ఫిర్యాదుల వెల్లువ..
ఇటీవల డీజిల్, పెట్రోలు ధరలు పెరిగి సొంతవాహనాల నిర్వహణ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారటం, ఆటో కనీస చార్జీలు రెట్టింపు కావటంతో జనం జేబులపై భారం పడింది. రవాణా కష్టాలపై జనం సర్పంచులకు విన్నవించుకోవటం, వారు ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచడం బాగా పెరిగింది. ఎండీగా సజ్జనార్ వచ్చాక కూడా వినతుల వెల్లువ కొనసాగింది. ట్విట్టర్‌లో కూడా ఫిర్యాదులు పెరిగిపోవటం తో తాజా పరిస్థితిపై ఆయన ఆరా తీశారు. ఈ క్రమంలో పల్లెవెలుగు బస్సులను పునరుద్ధరిస్తూ వస్తున్నారు. ఇటీవల విద్యాసంస్థలు కూడా తెరుచుకోవటంతో విద్యార్థుల ప్రయా ణ కష్టాలను దూరం చేసేందుకు పల్లెవెలుగు ట్రిప్పుల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు.
2,500 ఊళ్లకు బస్సులు కావాలి
ఇప్పటికీ దాదాపు రెండున్నర వేల ఊళ్లకు బస్సు వసతి సరిగా లేదు. ఇప్పుడు వాటికి కూడా బస్సు సౌకర్యం కల్పించాలంటే ప్రస్తుతం ఆర్టీసీ వద్ద చాలినన్ని పల్లెవెలుగు బస్సుల్లేవు. ఇప్పటికే 1,697 అద్దె బస్సులు పల్లెవెలుగు ట్రిప్పుల్లో ఉన్నాయి. మరిన్ని అద్దె బస్సులు తీసుకుంటే ఆర్టీసీలో ప్రైవేటు బస్సుల సంఖ్య విపరీతంగా పెరిగినట్లు అవుతుంది. ఇది ప్రైవేటీకరణకు సంకేతమని కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆర్టీసీ ఎండీ తీసుకునే నిర్ణయం కోసం అధికారులు కూడా ఎదురు చూస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment