ప్రయాణికురాలికి శానిటైజర్ అందిస్తున్న కండక్టర్
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సొంతంగా హ్యాండ్ శానిటైజర్లు తయారు చేసుకుంటోంది. కోవిడ్ వైరస్ విస్తరించే ప్రమాదం ఉండటంతో ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా బస్సుల్లో ప్రయాణికులందరికీ హ్యాండ్ శానిటైజర్లు అందుబాటులోకి తెచ్చింది. డిపోల పరిధిలో సొంతంగా శానిటైజర్ తయారీ ప్రారంభించింది. అధికారులు ఆయా జిల్లాల వైద్యాధికారులను సంప్రదించి శానిటైజర్ తయారీ విధానం తెలుసుకుని, ముడి పదార్థాలు తెప్పించి రూపొందిస్తున్నారు. దాన్ని చిన్న చిన్న ప్లాస్టిక్ సీసాల్లో నింపి అన్ని బస్సుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో డ్రైవర్ వెనుక భాగంలో 500 మిల్లీ లీటర్ల సామర్థ్యంతో డబ్బాలను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు కండక్టర్ల వద్ద చిన్న సీసాలు ఉంచుతున్నారు.
ప్రయాణికులు బస్సు ఎక్కగానే ముందుగా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతోపాటు బస్టాండ్లలో వాష్‌బేసిన్‌ల వద్ద లిక్విడ్ సోప్ (సబ్బు ద్రావణం) అందుబాటులో ఉంచారు. ప్రయాణికులు బస్సు ఎక్కేముందు కచ్చితంగా అక్కడ చేతులు కడుక్కోవాలంటూ మైకుల ద్వారా ఆదేశిస్తున్నారు. బస్సు ఎక్కేముందు డ్రైవర్లు, కండక్టర్లు కూడా ఆ విషయాన్ని ప్రశ్నిస్తున్నారు. ఎక్కిన తర్వాత శానిటైజర్‌తో శుభ్రం చేయిస్తున్నారు. టికెట్ ఇచ్చేప్పుడు కూడా కండక్టర్లు తమ వద్ద ఉన్న చిన్న సీసాల ద్వారా వారికి శానిటైజర్ అందించి చేతులు శుభ్రం చేసుకోమని చెబుతున్నారు. ఇక డ్రైవర్, కండక్టర్లకు ప్రత్యేకంగా సబ్బులు అందిస్తున్నారు. వారు వీలైనప్పుడల్లా వాటితో చేతులను శుభ్రం చేసుకోవాలని అధికారులు ఆదేశించారు.
రవాణా నిలిపివేస్తే ఇబ్బందులు..
‘కోవిడ్ భయంతో ప్రజా రవాణాను నిలిపివేస్తే ఇబ్బందులు వస్తాయి. అలా అని వదిలేస్తే బస్సు ల్లో ఒకేచోట ఎక్కువ మంది ప్రయాణించడం సమస్యలకు కారణమయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసం ఈ ఏర్పాట్లు చేశాం. అన్ని బస్సుల్లో శానిటైజర్లు కావాలంటే భారీ మొత్తంలో అవసరం ఉంటుంది. అందుకోసం సొంతంగా తయారు చేయడమే మంచిదని భావించాం. ఐసోప్రొఫైల్ ఆల్కహాల్, గ్లిజరిన్, డిస్టిల్డ్ వాటర్‌లతోపాటు అవసరమైన ముడిపదార్థాలు వాడి శానిటైజర్లు రూపొందిస్తున్నాం’అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment